ఆమిర్‌తో లోకేష్ కనకరాజ్.. అంతా బుస్

‘కూలీ’ సినిమాలో ఒక్కో పాత్ర గురించి విడుదలకు ముందు ఇచ్చిన బిల్డప్‌కు, సినిమాలో ఉన్న విషయానికి అసలు పొంతన లేదు.;

Update: 2025-09-07 19:32 GMT

‘కూలీ’ సినిమాలో ఒక్కో పాత్ర గురించి విడుదలకు ముందు ఇచ్చిన బిల్డప్‌కు, సినిమాలో ఉన్న విషయానికి అసలు పొంతన లేదు. అన్నింటికంటే ఎక్కువ డిజప్పాయింట్ చేసిన క్యారెక్టర్ నాగార్జున చేసిన సైమన్ పాత్రదే. కొన్ని నెలల పాటు నాగ్ వెంట పడి.. ఆరేడుసార్లు నరేషన్ ఇస్తే కానీ నాగ్ ఒప్పుకోలేదని లోకేష్ చెప్పాడు. అంత విషయం ఈ పాత్రలో ఏముందో సినిమా చూసిన ప్రేక్షకులకు అంతుబట్టలేదు. ఇక బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన ఆమిర్ ఖాన్.. ఈ చిత్రంలో క్యామియో చేశాడంటే తన పాత్ర మామూలుగా ఉండదని అనుకున్నారు. అదొక సిల్లీ క్యారెక్టర్‌లా తోచింది సినిమా చూస్తే. ఇక ‘కూలీ’ రిలీజ్‌కు ముందు ఇంటర్వ్యూల్లో లోకేష్ కనకరాజ్.. ఆమిర్‌ ఖాన్‌తో ఓ సూపర్ హీరో సినిమా చేస్తానని దాని గురించి కూడా తెగ హైప్ ఇచ్చే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. మీడియాలో కూడా దీని గురించి గొప్పగా రాశారు. తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి ప్రతి ఇంటర్వ్యూలో ఇలా హైప్ ఇవ్వడం లోకేష్‌కు అలవాటే.

ఐతే తాజా సమాచారం ప్రకారం లోకేష్, ఆమిర్ సినిమా తెరకెక్కే అవకాశమే లేదట. లోకేష్‌కు ఆల్రెడీ చాలా కమిట్మెంట్లు ఉన్నాయి. ఖైదీ-2, విక్రమ్-2, రోలెక్స్.. ఇలా తన గత చిత్రాల్లోని పాత్రలతోనే మూడు సినిమాలు చేయాల్సి ఉంది. వీటి గురించి కూడా ఎప్పట్నుంచో ఊరిస్తున్నాడు తప్ప.. ఏదీ ముందుకు కదలడం లేదు. ‘ఖైదీ-2’ పక్కా అనుకుంటే.. ఇప్పుడేమో రజినీకాంత్, కమల్ హాసన్ కాంబినేషన్లో మల్టీస్టారర్ అంటూ ఓ ప్రచారం మొదలైంది. ఖైదీ-2 సంగతే తేలట్లేదంటే.. ఇక విక్రమ్-2, రోలెక్స్ సినిమాలు ఉంటాయో లేదో తెలియదు. ఆమిర్ సినిమా అయితే అసలు తెరకెక్కేందుకు ఏమాత్రం అవకాశం లేదన్నది కోలీవుడ్ సమాచారం. పైగా ‘కూలీ’లో ఆమిర్ పాత్ర తుస్సుమనిపించడంతో లోకేష్, ఆమిర్ కాంబినేషన్ మీద ప్రేక్షకులకు పెద్దగా ఆసక్తి కూడా ఉండే అవకాశం లేదు.

Tags:    

Similar News