మారుతున్న కాస్టింగ్.. మారని వెయిటింగ్!

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తదుపరి ప్రాజెక్టుల విషయంలో అనుసరిస్తోన్న‌ వ్యూహం ఇండస్ట్రీలో చర్చనీ యాంశమైంది.;

Update: 2026-05-10 06:14 GMT

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ తదుపరి ప్రాజెక్టుల విషయంలో అనుసరిస్తోన్న‌ వ్యూహం ఇండస్ట్రీలో చర్చనీ యాంశమైంది. ముఖ్యంగా స్పానిష్ చిత్రం `కాంపియోన్స్` రీమేక్ గురించి ఆయన గత కొంతకాలంగా హింట్స్ ఇస్తున్నా? అది పట్టాలెక్కడంలో జరుగుతున్న జాప్యం పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అమీర్ ఖాన్ వంటి అగ్ర హీరోలు ప్రాజెక్టులను అనౌన్స్ చేసి ప్రేక్షకులలో ఆశలు రేకెత్తించి ఆ తర్వాత వాటిని పక్కన పెట్టడం లేదా జాప్యం చేయడం సరైన పద్ధతి కాదని సోష‌ల్ మీడియ వేదిక‌గా నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

అమీర్ ఖాన్ ఈ సినిమాలో న‌టుడు మాత్ర‌మే కాదు. ఈ చిత్రానికి నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. తొలుత ఈ సినిమాలో ఆయనే హీరోగా నటిస్తారని వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత సల్మాన్ ఖాన్ పేరు తెరపైకి వచ్చింది. అయితే చివరగా ఆ పాత్రను ఫర్హాన్ అక్తర్ చేస్తున్నట్లు వెలుగులోకి వ‌చ్చింది. తాజాగా మ‌ళ్లీ అమీర్ పేరు తెర‌పైకి వ‌స్తోంది. ఇలా నటీనటుల ఎంపికలో జరుగుతోన్న గందరగోళం, కథ చర్చలకే పరిమితమవ్వడం వల్ల సినిమాపై ఉన్న క్రేజ్ తగ్గే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అమీర్ ఖాన్ నుంచి వచ్చే సినిమాలంటే కచ్చితంగా ఏదో ఒక కొత్తదనం ఉంటుందని ప్రేక్షకులు ఆశిస్తారు.

`కాంపియోన్స్` రీమేక్ కథాంశం కూడా ఎంతో వైవిధ్యంగా ఉంటుంది. ఒక బాస్కెట్‌బాల్ కోచ్ మానసిక వికలాంగులతో ఒక టీమ్‌ను ఎలా సిద్ధం చేశాడనేది ఈ సినిమా నేపథ్యం. ఇలాంటి సున్నితమైన , స్ఫూర్తిదాయకమైన కథలను వెండి తెరపైకి తీసుకురావడంలో అమీర్ సిద్ధహస్తులు. కానీ ప్రకటనలతో ఊరించడం వ‌దిలేసి వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. `లాల్ సింగ్ చద్దా` ఫలితం తర్వాత అమీర్ ఖాన్ కొంతకాలంగా విరామంలోనే ఉంటున్నారు. నిర్మాణం మాత్రం ఆప‌లేదు.

అప్ప‌టి నుంచి ఏదో సినిమా నిర్మించ‌డం, వాటిలో అవ‌సరం అనుకుంటే కీల‌క పాత్ర‌లు పోషించ‌డం చేస్తున్నారు. కానీ హీరోగా సినిమా ఎప్పుడు చేస్తారు? అనేదే క్లారిటీ లేకుండాపోతుంది. విరామం తర్వాత ఆయన నుండి వచ్చే ప్రతి అడుగు పక్కాగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఒక సినిమా గురించి ఆరంభంలో భారీ హైప్ ఇచ్చి ఆ తర్వాత సైలెంట్ అయిపోవడం వల్ల డిస్ట్రిబ్యూటర్లలో, ఎగ్జిబిటర్లలో ఒక రకమైన అభద్రతా భావం ఏర్పడుతుంది. అమీర్ ఖాన్ తన ప్రొడక్షన్ హౌస్ ద్వారా ఈ ప్రాజెక్టును వేగవంతం చేయాలని అభిమానులు కోరుతున్నారు.

ప్రస్తుతం బాలీవుడ్ మళ్ళీ పుంజుకుంటున్న తరుణంలో అమీర్ ఖాన్ వంటి పెద్ద తారలు క్రియాశీలకంగా మార‌డం పరిశ్రమకు ఎంతో ముఖ్యం. `కాంపియోన్స్` రీమేక్ సినిమా మాత్రమే కాదు. అది సమాజానికి ఓ మంచి సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం. అలాంటి ప్రాజెక్టును కాగితాలకే పరిమితం చేయకుండా వాస్తవ రూపంలోకి తీసుకొస్తే అమీర్ ఖాన్ బ్రాండ్ వాల్యూ మరింత పెరుగుతుంది. ప్రకటనలతో సరిపెట్టకుండా యాక్షన్‌లోకి దిగాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News