టాలీవుడ్‌పై బిగ్ బాంబ్ పేల్చాడు
సినీప్రయాణంలో నిరంతరం శ్రమించే ప్రతి వ్యక్తికి సమాన గుర్తింపు కావాలని, అన్ని విభాగాల నిపుణులకు న్యాయమైన బహుమతులు అందాలని పట్టుబడుగున్నారు అమీర్.;
అవును.. టాలీవుడ్ పై బిగ్ బాంబ్ పేల్చాడు. ఒక రకంగా తెలుగు చిత్రసీమ సహా, సౌత్ - నార్త్ లోని అన్ని సినీపరిశ్రమల్లో చిన్న చూపు చూసే రచయితలు, కొన్ని విభాగాల సాంకేతిక నిపుణులకు ఇకపై పారితోషికాల విషయంలో సమన్యాయ సూత్రం పాటించాలని సూచిస్తున్నాడు దిగ్గజ ఫిలింమేకర్ అమీర్ ఖాన్.
సినీప్రయాణంలో నిరంతరం శ్రమించే ప్రతి వ్యక్తికి సమాన గుర్తింపు కావాలని, అన్ని విభాగాల నిపుణులకు న్యాయమైన బహుమతులు అందాలని పట్టుబడుగున్నారు అమీర్. నటులు, రచయితలు, దర్శకులు, ఇతర విభాగాల నిపుణులంతా సమానంగా సినిమా కోసం పని చేస్తారని అమీర్ అన్నారు.
అలాగే సినిమాని అన్ని విధాలుగా ముందుకు నడిపించే దర్శకుడు, రచయిత ఇద్దరికీ అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని కూడా అమీర్ ఖాన్ సూచించారు. దీనికోసం పాయింట్ల వ్యవస్థను రూపొందించాలని కూడా అన్నారు. ఒక సినిమాకి వచ్చే లాబాల నుంచి వాటాలు పని - శ్రమను అనుసరించి పంచాలని కూడా అమీర్ ఖాన్ అన్నారు.
అయితే అమీర్ ఖాన్ సూచించిన ఈ విధానం అన్ని సినీపరిశ్రమల్లో ప్రకంపనాలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. మెజారిటీ లాభం పెట్టుబడి పెట్టే నిర్మాతకు, సినిమాకి ప్రధాన ముఖం అయిన హీరోకు వెళ్లాల్సి ఉండగా, దర్శకరచయితలకు అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని సూచించడం ద్వారా రచయితకు కూడా అమీర్ ఖాన్ గౌరవాన్ని పెంచారు. ఇతర విభాగాలలో సాంకేతిక నిపుణులకు వారి పని విధానాన్ని బట్టి పాయింట్లను ఇవ్వాలని సూచించారు అమీర్. తన సొంత నిర్మాణ సంస్థల్లో దీనిని అనుసరిస్తానని కూడా అన్నారు.
నిజానికి అమీర్ ఖాన్ నిర్ణయం సముచితమైనది. నిపుణుల శ్రమకు తగ్గ పారితోషికాలు ఇవ్వని పరిశ్రమల్లో, లేదా రచయిత విలువను ఎప్పటికీ గుర్తించని ఇండస్ట్రీల్లో ఎప్పటికీ సరైన సినిమాలు పుట్టవు. ముఖ్యంగా రచయితకు దక్కే గౌరవాన్ని బట్టి అద్భుతమైన కథలు పుడతాయి. నేడు కథలు లేని సినిమాలు తీసి వందల కోట్లు గంగలో పోస్తున్న నిర్మాతలకు ఇది ఎప్పటికీ గుణపాఠంగానే మిగిలింది. కాబట్టి రచయితల్ని పెంచి పోషించడానికి, సినిమా చిత్రీకరణ సమయంలో సహకరించే సాంకేతిక నిపుణుల గౌరవాన్ని కాపాడే విధంగా పారితోషికాలు చెల్లించాలి. అలా కాకుండా సినిమా ద్వారా వచ్చే పెద్ద లాభాన్ని లేదా పెద్ద డబ్బును ఒకరిద్దరు మాత్రమే పంచుకునే విధానం ద్వారా ఎవరికి వారు `సొంత కుంపటి` పెట్టుకోవడమేనని అమీర్ ఖాన్ పరోక్షంగా చెప్పారు. అమీర్ ఖాన్ సూచించినది కేవలం ఒక బాలీవుడ్ వరకే పరిమితం కాదు. టాలీవుడ్ కోలీవుడ్ శాండల్వుడ్ సహా అన్ని పరిశ్రమలకు వర్తింపజేయాలి.