2025 సైలెంట్… 2026 సునామీ!
2025 ఏడాది చాలా సైలెంట్‌గా ముగిసింది. గత ఏడాది భారీ సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాల్ని సొంతం చేసుకోలేకపోయాయి.;
2025 ఏడాది చాలా సైలెంట్‌గా ముగిసింది. గత ఏడాది భారీ సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాల్ని సొంతం చేసుకోలేకపోయాయి. ఒక్క పవన్‌కల్యాణ్ నటించిన `ఓజీ` తప్ప గత ఏడాది భారీ సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద ప్రభావాన్ని చూపించకపోవడంతో ప్రేక్షకులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే 2026 మాత్రం అలా కాదు.. ఈ సారి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్‌ల సునామీ కాయమని ట్రేడ్ వర్గాలు, రిలీజ్‌కు రెడీ అవుతున్న సినిమాలు చెబుతున్నాయి. గత ఏడాది తెలుగు ఇండస్ట్రీ నుంచి రూ.300 కోట్లు రాబట్టిన ఏకైక సినిమాగా `ఓజీ` నిలవడంతో ఇప్పుడు అందరి దృష్టి 2026పై పడింది.
ఈ ఏడాది భారీ స్థాయిలో రిలీజ్ కానున్న పాన్ ఇండియా సినిమాల లిస్ట్ భారీగానే ఉంది. ఇందులో ముందుగా ప్రభాస్ `ది రాజాసాబ్` రిలీజ్ కాబోతోంది. ప్రభాస్ నటిస్తున్న తొలి హారర్ కామెడీ మూవీ కావడంతో దీనిపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే వెయ్యి కోట్లు రాబడుతుందా అనే అనుమానాలు మాత్రం అందరిలోనూ ఉన్నాయి. ఈ మూవీ ప్రీరిలీజ్ బిజినెస్ రూ.325 కోట్లకు పైనే చేసింది. అయితే ప్రభాస్ స్టామినాకు తగ్గట్టుగా రూ.1000 కోట్లు కొల్లగొడుతుందా? అన్నదే ఇప్పుడు అందరిలో అనుమానాల్ని రేకెత్తిస్తోంది. ఇది మాస్ మూవీ.. క్లాస్ ఫిల్మ్‌గా తెరకెక్కుతున్న `ఫౌజీ`పై అందరి దృష్టి పడింది.
ఇండో పాక్ వార్ నేపథ్యంలో సాగే ప్రేమకథగా దీన్ని హను రాఘవపూడి తెరకెక్కిస్తున్నాడు. రెండు భాగాలుగా రానుందని ప్రచారం జరుగుతున్న ఈ క్రేజీ వార్ డ్రామా కచ్చతంగా వెయ్యి కోట్లు వసూలు చేస్తుందనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ `పెద్ది`. బుచ్చిబాబు సాన డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీపై చరణ్ భారీ అంచనాలే పెట్టుకున్నాడు. `గేమ్ ఛేంజర్` ఫ్లాప్ కావడంతో `పెద్ది`పైనే ఆధారపడిన చరణ్ ఈ సినిమా రూ.1000 కోట్లు కొడుతుందని నమ్ముతున్నాడట. మరి చరణ్ డ్రీమ్‌ని `పెద్ది` ఎంత వరకు నిజం చేస్తుందో తెలియాలంటే మార్చి 27 వరకు వేచిచూడాల్సిందే.
వీటి తరువాత ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్న పేరు `ది ప్యారడైజ్`. నేచురల్ స్టార్ నాని నెవర్ బిఫోర్ మాస్ అవతార్‌లో నటిస్తున్నాడు. `దసరా`తో తనని తొలి సారి వంద కోట్ల క్లబ్ హీరోగా నిలబెట్టిన శ్రీకాంత్ ఓదెలతో మరోసారి నాని చేస్తున్న సినిమా ఇది. ఫస్ట్ గ్లింస్‌తోనే అంచనాల్ని పతాక స్థాయికి చేర్చిన ఈ మూవీతో పాన్ ఇండియా స్థాయిలో నాని రచ్చ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీని మార్చి 27న రిలీజ్ చేయబోతున్నారు. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీతో నాని వసూళ్ల సునామీని సృష్టించడం ఖాయం అని తెలుస్తోంది.
దేవర, వార్ 2 సినిమాలతో నిరుత్సాహపరిచిన ఎన్టీఆర్ ఈ ఏడాది `డ్రాగన్`తో చెలరేగబోతున్నాడు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో డార్క్ థీమ్ ఫాంటసీ నేపథ్యంలో పీరియాడిక్ ఫాంటసీ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ రూపొందుతోంది. రుక్మిణీ వాసంత్, టొవినో థామస్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ2026లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీతో ఎన్టీఆర్ మళ్లీ ట్రాక్‌లోకి రావాలనే పట్టుదలతో ఉన్నాడు. పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్, హరీష్ శంకర్‌ల కలయికలో రానున్న `ఉస్తాద్ భగత్‌సింగ్` కూడా ఇదే ఏడాది రిలీజ్ కాబోతోంది. `గబ్బర్‌సింగ్` తరువాత వీరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక వీటితో పాటు అడివి శేష్ `గూఢచారి 2`పై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ఈ క్రేజీ లైనప్‌తో 2026లో కలెక్షన్‌ల సునామీ కాయమనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి.