పిక్‌టాక్ : లుక్‌తో అంచనాలు పెంచుతున్న చైతూ

తాజాగా నాగ చైతన్య షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.;

Update: 2026-03-12 07:05 GMT

'తండేల్‌' సినిమా సూపర్‌ హిట్‌ తర్వాత నాగ చైతన్య కెరీర్‌ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఆయన ఎంపిక కూడా అలాగే అనిపిస్తుంది. చాలా కాలంగా ఎదురు చూస్తున్న నాగచైతన్య మూవీ అప్‌డేట్‌ వచ్చింది. విరూపాక్ష దర్శకుడు కార్తీక్‌ దండు దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా వృషకర్మ రూపొందుతున్న విషయం తెల్సిందే. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో నాగ చైతన్య లుక్‌ పై ఇటీవలే క్లారిటీ వచ్చింది. ఇప్పటి వరకు చైతన్యను చూడని విధంగా దర్శకుడు కార్తీక్‌ చూపించబోతున్నాడు. అంతే కాకుండా నాగ చైతన్య యొక్క గత చిత్రాలతో పోల్చితే ఈ సినిమా పూర్తి విభిన్నంగా ఉంటుందని అంటున్నారు. విరూపాక్ష సినిమాకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు కార్తీక్‌ ఈ సినిమాను రూపొందించే పనిలో ఉన్నాడని తెలుస్తోంది.



 


నాగ చైతన్య సోషల్‌ మీడియా పోస్ట్‌..

తాజాగా నాగ చైతన్య షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. బీయింగ్‌ అర్జున్‌ అంటూ జిమ్‌లో డంబెల్స్‌తో వర్కౌట్‌ చేస్తున్న ఫోటోలను షేర్‌ చేయడంతో పాటు, ఆన్‌ సెట్‌ ఫోటోలు, సినిమాలోని లుక్‌ ను రివీల్‌ చేయడం ద్వారా నాగ చైతన్య మరోసారి సినిమా గురించి చర్చ జరిగేలా చేశాడు. అర్జున్‌ పాత్ర కోసం నాగ చైతన్య ఎంతగానో కష్టపడుతున్నాడు. జిమ్‌లో ఆయన వర్కౌట్స్ గంటల పాటు సాగుతున్నట్లు ట్రైనర్‌ చెప్పుకొచ్చాడు. ఇప్పటికే నాగ చైతన్య సిక్స్‌ ప్యాక్ బాడీతో చాలా ఫిట్‌ గా కనిపిస్తున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా చాలా ఫిట్‌గా నాగ చైతన్య కనిపిస్తున్నాడు అంటూ ఈ ఫోటోలకు అభిమానులు తెగ కామెంట్స్ చేస్తున్నారు. నాగ చైతన్య లుక్‌ కి అంతా ఫిదా కావడం మాత్రమే కాకుండా వృషకర్మ సినిమాపై అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి.

తండేల్‌ సినిమా తర్వాత..

సాధారణంగా నాగ చైతన్య అనగానే ఒక సాఫ్ట్‌ కార్నర్‌ కుర్రాడు గుర్తుకు వస్తాడు. కానీ ఈ సినిమా తర్వాత మొత్తం మారబోతుంది. తండేల్‌తో కొంత వరకు తన ఇమేజ్‌ను మార్చుకున్న నాగ చైతన్య ఇప్పుడు పూర్తిగా తన ఇమేజ్ ను మార్చుకునే పనిలో ఉన్నాడట. పూర్తి స్థాయి యాక్షన్‌ సినిమాలు గతంలో చేసిన నాగ చైతన్య, అందుకు తగ్గ ఫిజిక్‌ ను ట్రై చేయలేదు. కానీ ఈసారి పాత్రలకు తగ్గట్లుగా ఫిజిక్‌ ను రెడీ చేసుకుంటూ, తన అభిమానులను నూటికి నూరు శాతం సంతృప్తి పరచడం కోసమే అన్నట్లుగా నాగ చైతన్య సినిమాలకు రెడీ అవుతున్న తీరు చూస్తుంటే ముచ్చటేస్తుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఈ మధ్య కాలంలో నాగ చైతన్య సినిమాల సంఖ్య తగ్గించినప్పటికీ క్వాలిటీ పెంచాడనే టాక్‌ కూడా ఉంది. మరో వంద కోట్ల మూవీ లోడ్‌ కావాలి అంటే ఇంతకు మించి అన్నట్లుగా నాగ చైతన్య కష్టపడాల్సిందే అంటూ అభిమానులు మాట్లాడుకుంటున్నారు.

కార్తీక్‌ దండు దర్శకత్వంలో వృషకర్మ మూవీ..

వృషకర్మ సినిమా నిర్మాణంలో సుకుమార్‌ భాగస్వామ్యం కావడంతో పాటు, ఆయన స్క్రిప్ట్‌ వర్క్‌ సలహాలు కచ్చితంగా వర్కౌట్‌ అవుతాయనే విశ్వాసంను అంతా వ్యక్తం చేస్తున్నారు. విభిన్న చిత్రాలతో దర్శకుడు కార్తీక్‌ దండు ముందు ముందు స్టార్‌ దర్శకుల జాబితాలో చేరబోతున్నాడనే విశ్వాసం కూడా వ్యక్తం అవుతోంది. మైథలాజికల్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ థ్రిల్లర్‌ మూవీగా ఈ సినిమా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్‌ లుక్‌ వీడియోకు మంచి స్పందన వచ్చింది. సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అక్కినేని ఫ్యాన్స్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాతో నాగ చైతన్య బాక్సాఫీస్‌ వద్ద మరోసారి తన సత్తా చాటడం ఖాయం. వంద కోట్లతో మరోసారి బాక్సాఫీస్‌ ను నాగ చైతన్య షేక్ చేయాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. ఈ ఫోటోలు చూస్తుంటే బాక్సాఫీస్‌ ను షేక్‌ చేసేందుకు చైతూ జిమ్‌ లో కసరత్తులు చేస్తున్నట్లుగా అనిపిస్తోంది.

Tags:    

Similar News