రాజేంద్రప్రసాద్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాల్సిందే - విశాల్

నటకిరీటి రాజేంద్రప్రసాద్ గత కొంతకాలంగా వరుసగా వివాదాలలో చిక్కుకుంటున్న విషయం తెలిసిందే.;

Update: 2026-03-12 06:43 GMT

నటకిరీటి రాజేంద్రప్రసాద్ గత కొంతకాలంగా వరుసగా వివాదాలలో చిక్కుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా టాలీవుడ్ హాస్యబ్రహ్మ బ్రహ్మానందంపై కీలక వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన ఈయన.. ఇటీవల తెలంగాణ ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కొడుకు పెళ్లిలో ఒక బాలుడు సెల్ఫీ కోసం అడిగితే ..అతడిని తోసేసి మరోసారి చిక్కుల్లో నిలిచాడు. ఇక ఆ ఘటన నుండి బయటపడక ముందే.. మరొకసారి తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నటుడు ఎంజీఆర్ పై ఊహించని కామెంట్లు చేసి తమిళ తంబీల ఆగ్రహానికి గురవుతున్నారు. ఈ క్రమంలోనే కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ఈ విషయంపై స్పందించి.. రాజేంద్రప్రసాద్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి అంటూ షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వివరాలలోకి వెళ్తే.. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన "కళాప్రపూర్ణ కాంతారావు జాతీయ అవార్డు -2025" ప్రధానోత్సవ వేదికపై రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.." ఒకప్పుడు కాంతారావు జానపద చిత్రాల కోసం జనాలు ఎగబడేవారు. ముఖ్యంగా కాంతారావుని చూసి ఎంజీఆర్ కూడా భయపడేవాడు. కాంతారావును చూస్తే ఎంజీఆర్ కి ఉచ్చ" అంటూ రాజేంద్రప్రసాద్ కామెంట్లు చేశారు. దీంతో తమిళ తంబీలు మాత్రమే కాదు కోలీవుడ్ నటీనటులు కూడా మండిపడుతూ ఆయన క్షమాపణలు చెప్పాలి అంటూ బహిరంగ కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విశాల్ కూడా స్పందించారు.

విశాల్ తన ఎక్స్ ఖాతా ద్వారా స్పందిస్తూ.. "తెలుగు సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్ మీరు ఒక ప్రోగ్రాం లో మాట్లాడిన మాటలు నన్ను తీవ్రంగా బాధించాయి. సర్.. నేను మీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. తమిళనాడులో ఎంజీఆర్ అంటే కేవలం ఒక నటుడు మాత్రమే కాదు తమిళులు ఆరాధ్యంగా భావించే గొప్ప దైవం.. ముఖ్యంగా అలాంటి వ్యక్తి గురించి మీరు తక్కువ చేసి మాట్లాడడం మాకు నచ్చలేదు. ఒక గొప్ప నటుడిని గొప్పగా చెప్పడం కోసం మీరు మరో గొప్ప నటుడుని కించపరచడం కరెక్ట్ కాదు . తమిళ ప్రజల మనోభావాలను ఇది తీవ్రంగా దెబ్బతీసింది. మీలాంటి పెద్ద నటులకు ఈ విషయం చెప్పడం నాకు చాలా బాధగా ఉన్నప్పటికీ తప్పని పరిస్థితుల్లో చెప్పాల్సి వస్తోంది.

పెద్ద మనసుతో మీరు దీనిపై స్పందించి క్షమాపణ చెప్పండి. భవిష్యత్తులో మీ స్థాయి ఉన్న నటులు ఎవరైనా మిమ్మల్ని ఇలాగే మాట్లాడినా కూడా నేను అప్పుడు మీకోసం ఇలాగే స్పందిస్తాను. కాబట్టి దయచేసి మీరు స్పందించి క్షమాపణలు చెబుతారని భావిస్తున్నాను అంటూ విశాల్ రాసుకొచ్చారు. ఇక ప్రస్తుతం విషయాలు తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరి దీనిపై రాజేంద్రప్రసాద్ స్పందించి క్షమాపణలు చెబుతారేమో చూడాలి.



Tags:    

Similar News