ఆ ఊరి మహిళా సర్పంచ్.. 15 ఏళ్లుగా చోరీలు!
గౌరవప్రదమైన స్థానంలో ఉండి కూడా దొంగతనాలకు పాల్పడే ఒక మహిళా సర్పంచ్ వ్యవహారం షాక్ కు గురి చేస్తోంది.;
గౌరవప్రదమైన స్థానంలో ఉండి కూడా దొంగతనాలకు పాల్పడే ఒక మహిళా సర్పంచ్ వ్యవహారం షాక్ కు గురి చేస్తోంది. ఒక చోరీ కేసులో పోలీసులకు దొరికిపోయిన ఆమె.. తన దొంగతనాల చరిత్ర గురించి నోరు విప్పగా.. పోలీసులు సైతం నోట మాట రాని పరిస్థితి. సంచలనంగా మారిన ఈ సిత్రమైన ఉదంతంలోకి వెళితే..
తమిళనాడులోని తిరుప్పత్తూరు జిల్లా నరియంపట్టు పంచాయితీకి సర్పంచ్ గా వ్యవహరిస్తున్నారు అధికార పార్టీ డీఎంకేకు చెందిన భారతి. తాజాగా ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. సర్పంచ్ ను అరెస్టు చేస్తారా? అని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కారణం.. ఆమె చేసిన ఘన కార్యం గురించి తెలిస్తే నోట మాట రాదంతే.
బస్సులో ప్రయాణిస్తున్న వేళ.. వరలక్ష్మి అనే బాధితురాలి మెడలో నుంచి 5 సవర్ల బంగారు గొలుసు చోరీకి గురైంది. దీంతో.. బాధితురాలు కోయంబేడు పోలీసుల్ని ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సర్పంచ్ భారతిని అరెస్టు చేశారు. ఊరి సర్పంచ్ ను దొంతనం కేసులో అరెస్టు చేయటమా? అని ఆందోళన వ్యక్తమైనప్పటికీ.. విచారణ వేళ ఆమె చెప్పిన విషయాలతో పోలీసులు సైతం అవాక్కు అయ్యారు.
తాను పదిహేనేళ్లుగా దొంగతనాలు చేస్తుంటానని.. చోరీలు చేసినప్పుడు కలిగే ఆనందమే వేరుగా ఉంటుందని ఆమె చెప్పారు. డబ్బులకు డబ్బులు.. పలుకుబడి.. పదవి ఇన్ని ఉన్నా.. దొంగతనాలు చేయాల్సిన అవసరం ఏమంటే.. చోరీ చేసినప్పుడు వచ్చే ఆనందం కోసమే తానీ పని చేసినట్లుగా పేర్కొన్నారు. ఈ ఉదంతం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పుర్రెకో బుద్ధి.. జిహ్వాకో రుచి అన్న సామెత ఈ ఉదంతం పక్కాగా సూట్ అవుతుందని చెప్పాలి.