ఒక భార్య రాసిన క్రైం స్టోరీ.. ఏ సినిమాలోనూ చూసి ఉండరు
తన భార్య కనిపించటం లేదని కంప్లైంట్ చేశాడు. ఈ మిస్సింగ్ ఘటనపై విచారణ జరిపిన పోలసీులు.. పెరియపట్నం తాలూకా బెట్టడపుర సమీపంలో ఒక డెడ్ బాడీ దొరికిందని..;
బంధాలు.. అనుబంధాల మీద మీకెప్పుడు డౌట్ రాలేదా? ఈ రియల్ స్టోరీని చదివిన తర్వాత ఒళ్లు గగుర్పాటుకు గురి కావటమే కాదు.. భయంతో వణుకుతారు. చుట్టు ఉండే మనుషుల మీద కాదు.. ఇలాంటి వారి ఇంటి సభ్యులుగా ఉండే తమ భవిష్యత్ ఏమిటన్న ఆందోళనకు గురయ్యేలా చేసే ఒక రియల్ క్రైం స్టోరీ. ఇప్పుడు మీరు చదివే రియల్ క్రైం స్టోరీలో ట్విస్టులు ఏ సినిమాలోనూ ఇప్పటివరకు చూసి ఉండరు. ఒక భార్య మిస్సింగ్ కేసు భర్తకు శాపంగా మారటమే కాదు.. చేయని తప్పునకు భారీ శిక్షలకు గురి కావటమే కాదు.. చివర్లో రివీల్ అయ్యే భారీ ట్విస్టు చెమటలు పట్టేలా చేస్తాయి.
నా భార్య మిస్ అయ్యిందన్న భర్త ఫిర్యాదుకు పోలీసులు సానుకూలంగా స్పందించటం తర్వాత.. అతడే ఆమెను ఏదో చేసి ఉంటాడని జైలుపాలు చేయటం.. తమ కుమార్తె చనిపోలేదని.. అల్లుడు అలాంటోడు కాదని సురేశ్ అత్త.. ఆయన బావమరుదు మొర పెట్టుకున్నా పట్టించుకోని పోలీసుల తీరు ఒక ఎత్తు అయితే.. ఎలాంటి తప్పు చేయకుండానే ఏడాదిన్నర పాటు జైలుజీవితాన్ని గడపాల్సి రావటం.. ఆ తర్వాత వెలుగు చూసిన భయంకర ట్విస్టును.. చదవాల్సిందే. మారిన మనుషుల తీరు ఎంత దారుణంగా ఉంటుందో చెప్పే ఈ ఉదంతానికి వేదిక కర్ణాటక. ఇప్పుడా రాష్ట్రంలో తీవ్ర కలకలాన్ని రేపిన ఈ ఉదంతంలో అసలేం జరిగిందంటే..
కర్ణాటక కొడుగు జిల్లా కుశాల్ నగర్ తాలూకా బసవనహళ్లి గ్రామానికిచెందిన సురేశ్ కు.. మల్లిగే అనే యువతికి పెళ్లైంది. వారి వైవాహిక జీవితం బాగానే సాగింది. అందుకు ప్రతిఫలంగా వారికి ఇద్దరు పిల్లలు జన్మించారు. చక్కగా సాగిపోతున్న వారి జీవితంలో ఒక అనూహ్య ఘటన చోటు చేసుకుంది. 2019లో ఒక రోజు హటాత్తుగా మల్లిగే కనిపించలేదు. దీంతో భర్త సురేశ్.. అతడి కుటుంబ సభ్యులతో పాటు.. మల్లిగే కుటుంబ సభ్యులు ఆమె కోసం తీవ్రంగా గాలించారు. ఎంత వెతికినా ఆమె జాడ లభించలేదు. దీంతో 2021లో కుశాల్ నగర్ పోలీసుల్ని ఆశ్రయించాడు భర్త సురేశ్.
తన భార్య కనిపించటం లేదని కంప్లైంట్ చేశాడు. ఈ మిస్సింగ్ ఘటనపై విచారణ జరిపిన పోలసీులు.. పెరియపట్నం తాలూకా బెట్టడపుర సమీపంలో ఒక డెడ్ బాడీ దొరికిందని.. అది మల్లిగేదేనని ఆమె తల్లికి.. భర్త సురేశ్ కు చెప్పారు. తీవ్ర విషాదానికి గురైన ఆ డెడ్ బాడీకి అంత్యక్రియలు జరిపారు. కొన్ని రోజుల తర్వాత మల్లిగేను భర్త సురేశ్ హత్య చేశాడన్న ఆరోపణతో అతడ్ని పోలీసులు అరెస్టు చేశారు. రిమాండ్ కు తరలించారు. ఏడాదిన్నర పాటు జైల్లోనే ఉన్నాడు సురేశ్.
చివరకు బెయిల్ మీద బయటకు వచ్చాడు. తన భార్య ఇద్దరు పిల్లల్ని విడిచి పెట్టి వేరే వారితో వెళ్లినట్లుగా అర్థం చేసుకున్న సురేశ్.. అలాంటి వ్యక్తిని మళ్లీ జీవితంలోకి రానివ్వకూడదని భావించాడు.ఇంకోవైపు అమ్మను ఎందుకు చంపావంటూ కొడుకు అడుగుతుంటే ఏం సమాధానం చెప్పాలో సురేశ్ కు అర్థమయ్యేది కాదు. తాను చంపలేదన్న విషయాన్ని ఎలా చెప్పాలో అర్థమయ్యేది కాదు. తాను చంపలేదన్న విషయాన్ని రుజువు చేసేందుకు మల్లిగేను పట్టుకోవటమే తనకున్న ఏకైక ఆప్షన్ గా భావించాడు సురేశ్.
మిత్రులతో కలిసి కుశాల్ నగర.. మడికెరె ప్రాంతాల్నిజల్లెడ పట్టాడు. చివరకు ఏప్రిల్ 1న అతడి ప్రయత్నాలు ఫలించాయి. మడికెరెలోని ఒక హోటల్లో మల్లిగె.. ఆమె ప్రియుడ్ని గుర్తించారు.ఈ విషయాన్ని తన లాయర్ పాండుకు వెంటనే సమాచారం అందించారు. మల్లిగె కనిపించిందన్న సమాచారంతో కుశాల్ నగర పోలీసులకు వణుకు పుట్టింది.ఆమెను కోర్టులో హాజరుపర్చేందుకు వీలుగా అదుపులోకి తీసుకోవాలన్నన్యాయవాది కోరినా కుశాల్ నగర పోలీసులు అందుకు సానుకూలంగా స్పందించలేదు.
దీంతో సదరు లాయర్ కోర్టును ఆశ్రయించి.. విషయాన్ని వివరించి.. ఆమెను కోర్టు ఎదుట హాజరుపర్చేలా ఆదేశాలు జారీ చేయాలని విన్నవించటంతో స్పందించిన కోర్టు అందుకు తగ్గట్లు ఆదేశాలు జారీ చేస్తూ.. మల్లిగెను కోర్టు ఎదుట హాజరుపర్చాలని పేర్కొంటూ జిల్లా ఎస్పీని ఆదేశించింది. ఈ కేసు విచారణ అధికారులపైన మైసూర్ ఎస్పీ.. సీఐ.. ఏఎస్ఐలను జిల్లా కోర్టుకు హాజరయ్యారు. ఛార్జ్ షీట్ మీద సమాధానం చెప్పలేని పరిస్థితి. ఈ కేసు పూర్తి వివరాల్ని రెండు వారాల్లో కోర్టు ముందు ఉంచాలన్న ఆదేశాల్ని న్యాయస్థానం ఆదేశించింది.
తన భార్య కనిపించకుండా పోయిందన్న కంప్లైంట్ సురేశ్ ఇచ్చిన తర్వాత.. అతడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. చేయని నేరాన్ని చేసినట్లుగా ఒప్పుకోమంటూ పెట్టిన టార్చర్ అంతా ఇంతా కాదు. చివరకు చిత్రహింసలు పెట్టి నేరాన్ని అంగీకరించేలా చేశారు. పోలీస్ స్టేషన్ లోనే ఇలా జరిగితే న్యాయం కోసం ఎక్కడికి వెళ్లాలన్నది సురేశ్ వాదన. ఇదే విషయాన్ని కోర్టు ముందు ఉంచాడు. సాధారణంగా హత్య కేసులో నిందితుడిపై ఛార్జ్ షీట్ తెరవాలంటే అందులో చనిపోయిన వ్యక్తికి సంబంధించి పోస్టుమార్టం.. డీఎన్ఏ రిపోర్టులు చాలా కీలకం.
కానీ.. మల్లిగె మిస్సింగ్ కేసులో అలాంటి వాటి జోలికి పోలేదు పోలీసులు. కొన్ని నెలల తర్వాత గుర్తు తెలియని ఆస్తిపంజరం కనిపిస్తే దాన్ని మల్లిగెదిగా భావించిన పోలీసులు సురేశ్ తో నేరాన్ని ఒప్పించి.. కేసును క్లోజ్ చేద్దామని భావించారే తప్పించి.. డీఎన్ఏ రిపోర్టు లాంటివి చేపట్టలేదు. ఆస్తిపంజరం మల్లిగెదే అన్న వాదనకు తగ్గట్లు పక్కాగా కేసును బిల్డ్ చేశారే తప్పించి.. వాస్తవం ఏమిటన్న అంశాన్ని బయపెట్టేలా పోలీసులు ప్రయత్నించలేదు. మల్లిగెను తాను చంపలేదన్న విషయం సురేశ్ కు తెలిసినా.. భార్య ఇల్లు వదిలి వెళ్లిపోయిదన్న నింద కంటే హత్య నేరాన్ని మోసేందుకే సురేశ్ ఇష్టపడ్డాడు.
ఎప్పుడైతే మల్లిగె తన ప్రియుడితో కలిసి ఉండటాన్ని గుర్తించాడో.. భర్త సురేశ్ క్షణం కూడా ఆలస్యం చేయలేదు. ఆమెను అదుపులోకి తీసుకునేలా చేసి.. వాస్తవాన్ని బయటపడేలా చేశాడు. అసలు విషయం వెలుగు చూసిన తర్వాత తాము చేసిన తప్పులకు పోలీసులు వణికిపోగా.. ఒక అమాయకుడి జీవితాన్ని భార్య ఆడుకున్న ఆటపై బసవనహళ్లి గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇప్పుడీ వ్యవహారం సోషల్ మీడియాలో తెగ సంచలనంగా మారింది.