ట్రావెల్ బ్యాగ్ లో మహిళ శవం.. 24 గంటల్లో పట్టేసిన బాచుపల్లి పోలీసులు
విజయ్ ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో పని చేస్తుండగా.. తార ఇంటి వద్దే ఉంటోంది. ఇటీవల తార గర్భం దాల్చింది.;
బాచుపల్లి శివారులోని నిర్జన ప్రదేశంలో ఒక బ్యాగ్ లో మహిళ డెడ్ బాడీని పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే. హత్య చేసి ట్రావెల్ బ్యాగులో కుక్కేసి.. వదిలేసి వెళ్లిన వైనం సంచలనంగా మారింది. దేశవ్యాప్తంగా ఏ పోలీస్ స్టేషన్ లోనూ ఈ మహిళకు సరిపోయే మిస్సింగ్ కేసు నమోదు కాకపోవటం.. పది రోజులకు పైనే హత్య చేసినట్లుగా గుర్తించిన పోలీసులకు.. ఎలాంటి క్లూ లభించలేదు. సీసీ కెమేరా ఫుటేజ్ కూడా దీనికి సంబంధించిన ఎలాంటి ఆధారం చిక్కలేదు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో విచారణ చేపట్టిన బాచుపల్లి పోలీసులు.. మర్డర్ మిస్టరీని తెలివిగా చేధించారు.
సాంకేతిక అంశాలు సాయం చేయలేని పరిస్థితుల్లో.. సంప్రదాయ విచారణ పద్దతిని ఎంపిక చేసుకున్న వారు.. హంతకుడ్ని విచారణ చేపట్టిన 24 గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు. పోలీసు వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సంచలన కేసును పోలీసులు ఎలా చేధించారు? హతురాలు ఎవరు? నిందితుడు ఆమెను ఎందుకు హత్య చేశాడు? లాంటి వివరాల్లోకి వెళితే..
నేపాల్ కు చెందిన తారా బెహరా (33).. విజయ్ తోపా (30) ఇద్దరూ పక్క పక్క గ్రామాలకు చెందిన వారు. ఇద్దరికి పరిచయం.. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. తారాకు పెళ్లై.. ఇద్దరు పిల్లలు ఉన్నారు. విజయ్ కి పెళ్లి కాలేదు. గత ఏప్రిల్ లో తార పిల్లల్ని వదిలేసి.. విజయ్ తో వచ్చేసింది. వారు నేపాల్ నుంచి హైదరాబాద్ కు చేరుకొని తొలుత జూబ్లీహిల్స్ లోని బస్తీలో నివాసం ఉంటూ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో పని చేశాడు. కొద్ది రోజుల క్రితం వారు బాచుపల్లికి దగ్గర్లోని బౌరంపేట లోని ఇందిరమ్మ కాలనీలోకి మకాం మార్చారు.
విజయ్ ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో పని చేస్తుండగా.. తార ఇంటి వద్దే ఉంటోంది. ఇటీవల తార గర్భం దాల్చింది. దీంతో.. ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఇప్పటికే ఇద్దరు పిల్లల తల్లైన తారకు పిల్లలు వద్దని విజయ్ వారించగా.. తనకు పిల్లలు కావాలని తార పట్టుపట్టింది. ఇది విజయ్ కు నచ్చలేదు. ఆమెను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు. మే 23న ఇంట్లో ఉన్న తారను మంచం నవారుతో గొంతుకు బిగించి చంపేశాడు. అదే రోజు బాచుపల్లిలోని ఒక షాపుకు వెళ్లి.. డెడ్ బాడీ పట్టేంత ట్రావెల్ బ్యాగ్ ను కొనుగోలు చేశాడు.
ఆ బ్యాగ్ లో డెడ్ బాడీని కుక్కేసి.. తల మీద పెట్టుకొని రాత్రి వేళలో.. 2 కి.మీ. నడిచి ఒక నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లి అక్కడ బ్యాగ్ పడేశాడు. అక్కడికి దగ్గర్లో ఎలాంటి సీసీ కెమేరాలు లేకపోవటంతో నిందితుడి ఆచూకీ లభించలేదు. దీంతో.. ట్రావెల్ బ్యాగ్ కొత్తగా ఉండటంతో అతడు బ్యాగ్ ఎక్కడ కొని ఉంటాడన్న కోణంలో బాచుపల్లి.. నిజాంపేట.. ప్రగతినగర్ లోని 75 షాపుల్లో విచారణ చేపట్టారు పోలీసులు.
ఈ క్రమంలో బాచుపల్లిలోని రాందేవ్ బ్యాగుల షాపులో బ్యాగ్ కొన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ట్రావెల్ బ్యాగ్ కొన్నాక.. ర్యాపిడో ద్వారా ఇంటికి వెళ్లినట్లుగా గుర్తించారు.
సీసీ ఫుటేజ్ ద్వారా నిందితుడ్ని గుర్తించిన పోలీసులు.. ర్యాపిడో బుకింగ్ ద్వారా అతడి ఆచూకీని గుర్తించారు. హత్య చేసిన తర్వాత జూబ్లీహిల్స్ లో సోదరుడి వద్ద నిందితుడు ఉంటున్నట్లుగా గుర్తించిన పోలీసులు అతడ్ని అక్కడకు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. హత్య చేసిన వివరాల్ని తెలుసుకున్నారు. పోలీసులు పెద్ద ఎత్తున చేసిన ప్రయత్నాలతో 24 గంటల వ్యవధిలోనే హంతకుడ్ని పట్టేశారు.