దృశ్యం 3.. అప్పుడే రూ.350 కోట్లా?
దృశ్యం.. ఆ ఫ్రాంచైజీకి ఉన్న క్రేజే వేరు. సెపరేట్ ఫ్యాన్ బేస్ తో ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి.;
దృశ్యం.. ఆ ఫ్రాంచైజీకి ఉన్న క్రేజే వేరు. సెపరేట్ ఫ్యాన్ బేస్ తో ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి. తొలుత మాలీవుడ్ లో తెరకెక్కి.. ఆ తర్వాత పలు భాషల్లో విడుదలై టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది దృశ్యం ఫ్రాంచైజీ. తొలి రెండు భాగాలు భారీ విజయం సాధించగా.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రీమేక్ అయి అక్కడా హిట్స్ గానే నిలిచాయి.
అయితే హిట్ ప్రాంచైజీలో దృశ్యం 3 కూడా రానున్న విషయం తెలిసిందే. డైరెక్టర్ జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మోహన్ లాల్, మీనా జంటగా తెరకెక్కుతున్న ఆ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. వరుస షెడ్యూల్స్ ను మేకర్స్ కంప్లీట్ చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో సినిమాను విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు.
అయితే దృశ్యం-3 సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. థ్రియేట్రికల్, డిజిటల్ రైట్స్ కలిపి రూ.350 కోట్లు పలికాయని సమాచారం. ఆ విషయాన్ని సినిమా నిర్మాత ఎం. రంజిత్ ఒక ఈవెంట్‌లో అధికారికంగా వెల్లడించినట్లు ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి.
అదే సమయంలో అంత మొత్తంలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం మాలీవుడ్ లో ఇదే తొలిసారి కావడం విశేషం. అనేక మలయాళ సినిమాలు హిట్స్ గా నిలిచినా.. భారీ వసూళ్లు రాబట్టినా.. వాటి కంప్లీట్ కలెక్షన్స్ కూడా ఆ నెంబర్ కన్నా తక్కువ అనే చెప్పాలి. దీంతో రిలీజ్ కు ముందే షూటింగ్ దశలోనే దృశ్యం-3 మూవీ కొత్త చరిత్ర క్రియేట్ చేసింది.
అంత రేట్ ఎందుకు?
నిజానికి.. జార్జ్ కుట్టీ (మోహన్ లాల్ పాత్ర పేరు) ఫ్యామిలీ చుట్టూ తిరిగే కథతో రూపొందిన దృశ్యం ప్రాంచైజీలో వచ్చిన రెండు పార్టులు ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్స్‌గా నిలిచాయి. ఫస్ట్ పార్ట్ థియేటర్ లో విడుదలవగా.. రెండో పార్టు ఓటీటీలో విడుదలైంది. కానీ మొదటి భాగానికి మించిన విజయాన్ని సాధించిందని చెప్పాలి.
దీంతో ఇప్పుడు దృశ్యం 3పై ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే అంత పెద్ద మొత్తంలో బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఈసారి రీమేక్ హక్కులు అమ్మకుండా మలయాళంతో పాటు తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేయడం మరో కారణమని చెబుతున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతుండడంతో భారీ రేంజ్ లో బిజినెస్ జరిగినట్లు అభిప్రాయపడుతున్నారు.