‘దురంధర్-2’ డ్యామేజ్.. తక్కువ అంచనా వేయొద్దు
మూడు నెలల ముందు ‘దురంధర్’ సినిమా రిలీజవుతున్నపుడు పెద్దగా అంచనాలు లేవు. దక్షిణాది ప్రేక్షకులు అయితే ఈ సినిమాను పెద్దగా పట్టించుకున్నట్లే కనిపించలేదు.;
మూడు నెలల ముందు ‘దురంధర్’ సినిమా రిలీజవుతున్నపుడు పెద్దగా అంచనాలు లేవు. దక్షిణాది ప్రేక్షకులు అయితే ఈ సినిమాను పెద్దగా పట్టించుకున్నట్లే కనిపించలేదు. నార్త్ ఇండియాలో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ గొప్పగా జరగలేదు. కానీ రిలీజ్ తర్వాత అంతా మారిపోయింది. పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లు అంతకంతకూ పెరుగుతూ పోయాయి. సినిమా రేంజే మారిపోయింది. రెండు నెలల థియేట్రికల్ రన్‌తో ఏకంగా రూ.1400 కోట్ల వసూళ్లు రాబట్టి సంచలనం సృష్టించింది.
దీనికి కొనసాగింపుగా మార్చి 19న రాబోతున్న ‘దురంధర్-2’ మీద అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వాయిదా వార్తలకు చెక్ పెడుతూ మొన్ననే ట్రైలర్ లాంచ్ చేసింది చిత్ర బృందం. దీంతో పాటు టీం ఒక మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది. విడుదలకు ముందు రోజు సాయంత్రం దేశవ్యాప్తంగా పెయిడ్ ప్రిమియర్స్ ఫిక్స్ చేస్తూ.. 12 రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలుపెట్టేసింది.
దీంతో ఒక్కసారిగా బుక్ మై షో షేకైపోయింది. రేపో ఎల్లుండో సినిమా రిలీజవుతున్నట్లుగా జనం ఎగబడి ప్రిమియర్స్ టికెట్లు కొంటున్నారు. దేశవ్యాప్తంగా ఈ సినిమాకు డిమాండ్ మామూలుగా లేదు. హైదరాబాద్‌లో పెయిడ్ ప్రిమియర్స్ షోల బుకింగ్స్ స్టేటస్ చూస్తే షాకవ్వక మానలేదు. టాలీవుడ్ టాప్ స్టార్ల సినిమాల రేంజిలో టికెట్లు తెగుతున్నాయి. ‘దురంధర్-2’ రిలీజ్ రోజే తెలుగు నుంచి పవన్ కళ్యాణ్ సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ కాబోతోంది.
దానికీ ముందు రోజు పెయిడ్ ప్రిమియర్స్ వేయబోతున్నారు. ఐతే ఆ షోలకు స్పెషల్ రేట్లు తెచ్చుకునే ప్రయత్నంలో ఉంది టీం. కానీ కోర్టు ఆదేశాల కారణంగా అది అంత తేలిగ్గా సాధ్యమయ్యేలా లేదు. ఒకవేళ జీవో వచ్చినా.. పుణ్యకాలం గడిచిపోవడం ఖాయం. ఈలోపు ‘దురంధర్-2’కు ఇప్పుడు అందుబాటులో ఉన్న షోలన్నీ సోల్డ్ ఔట్ అయిపోయి.. కొత్త షోలు మొదలుపెట్టేలా ఉన్నారు. ఈ చిత్రాన్ని నార్మల్ రేట్లతో రిలీజ్ చేస్తుండడం పెద్ద అడ్వాంటేజ్.
పవన్ సినిమాకు జీవో తెచ్చుకుని ప్రిమియర్స్ వేసినా రేటు 1000కి అటు ఇటు పెడతారు. ఇది ‘దురంధర్-2’కు ప్లస్ అవుతుంది. హిందీ సినిమా కదా అని దీన్ని ఎంతమాత్రం తేలిగ్గా తీసుకునే పరిస్థితి కనిపించడం లేదు. దీని క్రేజే వేరుగా ఉంది. ప్రిమియర్స్ అనే కాక రెగ్యులర్ షోల పరంగా చూసినా.. పవన్ సినిమాకు అది చేసే డ్యామేజ్ గట్టిగానే ఉండబోతోందన్నది స్పష్టం.