జర్మనీ నుంచి వచ్చాడు.. 99 లక్షలు పాడాడు.. సర్పంచ్ అయ్యాడు..
| ప్రకాశం జిల్లా కందుకూరు మండలం మహదేవపురంలో సర్పంచ్ పదవికి నిర్వహించిన వేలంలో దామా శ్రీనివాసులు రూ.99 లక్షలు చెల్లించి విజయం సాధించారు. గ్రామంలో రాజకీయ విభేదాలు పెరగకుండా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు చర్చలు జరిపి 17 మంది అభ్యర్థులను ఏకాభిప్రాయానికి తీసుకొచ్చారు. వేలంలో వచ్చిన మొత్తాన్ని పూర్తిగా గ్రామ అభివృద్ధికి ఖర్చు చేయాలని నిర్ణయించడం విశేషంగా నిలిచింది.
నిజమైన నాయకత్వం అంటే పదవిని ఆశించడం కాదు.. ఆ పదవి ద్వారా సమాజానికి.. ఊరికి ఏమి చేయగలిగామన్నదే అసలైన సార్థకత. ప్రకాశం జిల్లా కందుకూరు మండలం మహదేవపురం గ్రామంలో చోటుచేసుకున్న ఒక అరుదైన ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిని రేపుతోంది. సర్పంచ్ పదవి కోసం జరిగిన పోటీలో వేలం ద్వారా రూ.99 లక్షల భారీ మొత్తాన్ని దామా శ్రీనివాసులు దక్కించుకోవడం సంచలనమైంది. ఆ సొమ్మును పూర్తిగా గ్రామ అభివృద్ధికి వెచ్చించాలనే నిర్ణయం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
ఎన్నికల సమయం వచ్చిందంటే సాధారణంగా ప్రచార హోరు.. హామీల జల్లు.. విమర్శలు.. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు కనిపిస్తాయి. కానీ మహదేవపురంలో మాత్రం పరిస్థితి వేరేలా మారింది. ఈసారి సర్పంచ్ స్థానం జనరల్ కేటగిరీకి రిజర్వ్ కావడంతో టీడీపీ నుంచి పలువురు ఆశావహులు పోటీకి సిద్ధమయ్యారు. అధికార వర్గాల మధ్య ఉన్న అంతర్గత విభేదాలను గమనించిన వైసీపీ వర్గీయులు కూడా బరిలోకి దిగారు. ఫలితంగా ఏకంగా 17 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసి పోటీని రసవత్తరంగా మార్చారు.
గ్రామంలో పోటీ తీవ్రమైతే రాజకీయ వైరాలు, వర్గ విభేదాలు పెరిగే అవకాశం ఉందని భావించిన స్థానిక ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నారు. రెండు రోజుల పాటు అభ్యర్థులతో చర్చలు జరిపి.. అందరూ కలిసి ఒకే నిర్ణయానికి వచ్చేలా కృషి చేశారు. పోటీలో ఉన్న అభ్యర్థులందరూ కలిసి సర్పంచ్ పదవిని వేలం ద్వారా ఖరారు చేయాలని నిర్ణయించారు. ఈ ప్రతిపాదనకు వైసీపీ వర్గీయులు సైతం సమ్మతించడంతో వేలం ప్రక్రియ నిర్వహించారు. ఈ పోటీలో టీడీపీ వర్గీయుడైన దామా శ్రీనివాసులు అత్యధికంగా రూ.99 లక్షలు పాడి సర్పంచ్ పదవిని కైవసం చేసుకున్నారు.
ఎన్నికల సమయంలో ఓటర్ల కోసం ఖర్చు చేసే సొమ్ముకు భిన్నంగా వేలంలో వచ్చిన రూ.99 లక్షలను ఊరి అభివృద్ధికి వినియోగించాలన్న సంకల్పం అందరినీ ఒప్పించేలా చేసింది.. ఈ నిధులను సక్రమంగా వినియోగిస్తే గ్రామానికి ఎంతో మేలు జరుగుతుంది.
రాజకీయ పార్టీల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఊరి ప్రయోజనాల కోసం అభ్యర్థులు కలిసికట్టుగా ఒక నిర్ణయానికి రావడం ఆశించదగ్గ పరిణామం.. విభేదాలను పక్కన పెట్టి అభివృద్ధి వైపు చూడాలనే సందేశం ఇందులో దాగి ఉంది.
మహదేవపురం ప్రజల ఆశయమంతా ఒక్కటే రూ.99 లక్షల పాట వార్తల్లో నిలవడం కాదు.. ఆ సొమ్ముతో గ్రామం ఆదర్శంగా ఎదగడం... పదవికి పెట్టిన ఖర్చు కంటే.. ఆ పదవిలో ఉన్నవారు ఊరికి చేసిన మేలే నిజమైన నాయకత్వానికి కొలమానం..