జగన్ భారీ ఓటమి...ఆమంచి విశ్లేషణ అదుర్స్ !
వైసీపీ 2024 ఎన్నికల మీద అతిగా ఆశలు పెట్టుకుంది. ఎంతలా అంటే వై నాట్ 175 అని ఒక పెద్ద నినాదమే అందుకుంది.
వైసీపీ 2024 ఎన్నికల మీద అతిగా ఆశలు పెట్టుకుంది. ఎంతలా అంటే వై నాట్ 175 అని ఒక పెద్ద నినాదమే అందుకుంది. అసలు అలా ఎక్కడైనా జరుగుతుందా అన్న ఆలోచన లేకుండా వైసీపీ వ్యవహరించింది అంటే దానికి కారణం నేల విడిచి సాము చేయడమే. అక్కడే వైసీపీ తేలిపోయింది అన్నది ఒక కఠినమైన విశ్లేషణ. వైసీపీ ఈ రోజున తమ ఓటమికి ఏపీలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించకపోవడమే కారణం అంటోంది. దీని మీద సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. ఎందుకంటే ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీనామా కోరుతూ విపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి. దాంతో ఏపీలో కూడా అదే జరిగింది అని వైసీపీ అనుకుంటూ కొత్త చర్చని పెడుతోంది. అయితే వైసీపీ తన భారీ ఓటమి మీద ఆత్మ పరిశీలన నిజాయతీగా ఈ రోజుకీ చేసుకోలేదు అనడానికి ఇది మరో ఉదాహారణ అంటున్నారు.
ఆమంచి పాత వీడియో వైరల్ :
వైసీపీ 2024 ఎన్నికల్లో ఓటమి పాలు అయిన తరువాత ఆ పార్టీలో కొన్నాళ్ళు ఉండి బయటకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి క్రిష్ణ మోహన్ అప్పట్లో ఈ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తూ చెప్పిన మాటలు చేసిన వాదన ఈ రోజు మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది ఎవరికో నచ్చడం కాదు వైసీపీ శ్రేణులకే బాగా ఇష్టం అయింది. అవును కదా తప్పు మన పార్టీదే కదా అని వారు అనుకోవడమే కాదు, ఈ వీడియోను వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు "జగన్ గారూ, దయచేసి ఇది చూడండి" అనే శీర్షికతో విస్తృతంగా షేర్ చేయడమే అసలైన విశేషం. ఆ వీడియోలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి లేవనెత్తిన అంశాలను పార్టీ అధినేత జగన్ గమనించాలని కూడా వారు కోరుతున్నారు.
ఐప్యాక్ ని నమ్మిన ఫలితం :
ఇంతకీ వైసీపీ మద్దతుదారులను సైతం ఆకట్టుకున్న ఆ పాత వీడియోలో ఏముంది అంటే జగన్ ఐ ప్యాక్ టీం ని పూర్తిగా నమ్మడం వల్లనే చేదు ఫలితాలు వచ్చాయని ఆమంచి కుండబద్దలు కొట్టారు. ఐప్యాక్ ఎప్పటికప్పుడు నిర్వహించిన సర్వేలో తప్పుడు అంకెలు సమాచారం తప్ప గ్రౌండ్ లెవెల్ లో వాస్తవాలు అధినాయకత్వానికి చేరవేయలేకపోయారు అని ఆమంచి పేర్కొన్నారు. అంతే కాదు ఆనాటి వైసీపీ అధినాయకత్వానికి ప్రజలకు మధ్య నేరుగా ఉండే అనుబంధం కానీ ఒక బలమైన వ్యవస్థ కానీ లేకుండా పోయిందని కూడా లోపాలను ఎత్తి చూపారు.
పార్టీకి దూరంగా :
నిజానికి ఐప్యాక్ లాంటి సంస్థల కంటే పార్టీకి జనంలో ఎంత బలం ఉందో ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది సొంత పార్టీ నేతలు ఎమ్మెల్యేలకు బాగా తెలుస్తుందని ఆమంచి విశ్లేషించారు. అలా నిరంతరం పార్టీ జనాలతో అధినాయకత్వం కనుక సమావేశాలు నిర్వహించి వారితో అనుసంధానం అయితే గ్రౌండ్ లెవెల్ లో పార్టీ పరిస్థితి ఎలా ఉందో తెలుకునేందుకు వీలు ఉండేదని ఆయన అన్నారు. కనీసం ప్రతీ మూడు నెలలకు ఒకసారి శాసనసభా పక్ష సమావేశాలను కూడా నిర్వహించలేదని పార్టీ మీటింగులు పెద్దగా లేవని చెప్పారు. ఎంతసేపూ డబ్బులు ఖర్చు పెట్టి ఐప్యాక్ టీం ఇచ్చే నివేదికల మీదనే ఆధారపడడం వల్లనే జగన్ ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందన్నది ఆమంచి చేసిన విశ్లేషణ.
వైసీపీ గెలవదు అంటూ :
ఇక 2024 సార్వత్రిక ఎన్నికలకు చాలా ముందు నుంచే తాను వైసీపీ 30 లేదా 40 సీట్ల కంటే ఎక్కువ గెలవదు అని చెప్పాను అని ఆమంచి ఆ వీడియోలో పేర్కొన్నారు. అప్పటి వైసీపీ రాజకీయ పరిస్థితి పై తన అంచనాను ధనుంజయ రెడ్డికి కొంతమంది ఐ-ప్యాక్ ప్రతినిధులకు ఇతర పార్టీ నాయకులకు తెలియజేశానని ఆయన అన్నారు. అయినా సరే వాటిని ఎవరూ పట్టించుకోలేదని చెప్పారు. ఇక ఐప్యాక్ బృందాలు అయినా వాస్తవ పరిస్థితిని చెప్పి ఉండాల్సింది అని ఆయన అన్నారు. అంతే కాదు పార్టీ నాయకులు ఎమ్మెల్యేలతో తరచూ వైసీపీ అధినాయకత్వం చర్చలు జరిపి ఫీడ్ బ్యాక్ తీసుకున్నా ఆనాటి పరిస్థితి ఏమిటి అన్నది తెలిసేది అని కూడా ఆయన చెప్పారు.
సంక్షేమం ఒక్కటే కాదు :
జనాలకు సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నాం కదా వారు పార్టీ పట్ల ఆదరణతో ఉంటారు అనుకోవడం తప్పే అని ఆమంచి అభిప్రాయపడ్డారు. జనాలు ఎప్పటికప్పుడు పెరుగుతున్న ఖర్చులు తమ ఆదాయాలను బేరీజు వేసుకుంటారని ఆయన గుర్తు చేశారు. వీటి మధ్య అంతరం పెరిగినపుడు కచ్చితంగా అసంతృప్తి మొదలవుతుందని విశ్లేషించారు ముఖ్యంగా మధ్య తరగతి వర్గాలు అయితే ఎక్కువగా ప్రభుత్వ విధానల పట్ల ప్రభావితమై యాంటీ ఇంకెంబెన్సీగా టర్న్ తీసుకుంటుందని కూడా ఆయన అన్నారు. ఇక వైసీపీ అయిదేళ్ల పాలనలో ప్రభుత్వంపై ప్రజల అభిప్రాయాన్ని ప్రభావితం చేయగల సమస్యలలో పెట్రోల్, డీజిల్, విద్యుత్ బిల్లులు, మద్యం ఇసుకపై చేసే ఖర్చులను ఆయన ఉదహరించారు.
వైఎస్సార్ తీరు వేరు :
ఇక ఆమంచి వైఎస్సార్ పాలనను జగన్ పాలనను కూడా పోల్చి చూశారు. వైఎస్సార్ నిరంతరం నాయకులు ఎమ్మెల్యేలతో గడిపేవారు అని అలా ఆయనకు మంచి ఫీడ్ బ్యాక్ లభించేది అని గుర్తు చేశారు. అలా ప్రజల సమస్యలను తెలుసుకోవడం వాటిని పరిష్కరించడం అభివృద్ధి కార్యక్రమాలను సమన్వయం చేయడంపై వైఎస్సార్ ఎపుడూ ప్రత్యేక దృష్టి పెట్టేవారని ఆయన పేర్కొన్నారు. జగన్ విషయం తీసుకుంటే ఇందుకు భిన్నంగా సాగిందని కూడా ఎత్తి చూపారు. రాజశేఖర రెడ్డి జగన్ల రాజకీయ అనుభవం, పరిపాలనా విధానాలు ఒకేలా ఉన్నాయని అనుకుంటే తప్పు అని కూడా ఆమంచి వాదించారు.
ముఖ్యంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులతో వైఎస్సార్ వ్యవహరించే తీరు అధికారులతో సమన్వయం స్థానిక సమస్యలపై దృష్టి సారించే విషయంలో జగన్ కి ఎంతో తేడా ఉందని ఆయన విశ్లేషించారు. ఇపుడు ఆమంచి పాత వీడియో ఎందుకు వైరల్ అవుతోంది అంటే ఇంకా ఈవీఎంల మీద ఎన్నికల్లో అక్రమాల మీదనే వైసీపీ నిందలు వేస్తూ తమ తప్పులను మరచిపోయింది అని భావించే నిజమైన వైసీపీ అభిమానులు దీనిని పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. మరి దీని మీద వైసీపీ ఇప్పటికైనా ఫోకస్ పెడుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.