కోర్టు తర్వాత పెరిగిన బాధ్యత.. తెల్ల కాగితంపై రోషన్ కాన్ఫిడెన్స్ అదే!
తాజాగా హీరోహీరోయిన్లు తుపాకీతో మాట్లాడిన సందర్భంగా సినిమా కథ, తమ పాత్రలు, కెరీర్‌పై ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
కోర్టు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న హీరో హర్ష్ రోషన్.. ఇప్పుడు మరో విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా నటించిన తెల్లకాగితం అక్టోబర్ 2న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. తాజాగా హీరోహీరోయిన్లు తుపాకీతో మాట్లాడిన సందర్భంగా సినిమా కథ, తమ పాత్రలు, కెరీర్‌పై ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
తెల్లకాగితంను ఇన్నోసెంట్ లవ్ స్టోరీతో పాటు హార్డ్ హిట్టింగ్ ఎమోషన్ ఉన్న సినిమాగా హర్ష్ రోషన్ అభివర్ణించాడు. వరుసగా లవ్ స్టోరీలు చేస్తున్నారనే ప్రశ్నకు స్పందిస్తూ.. ఒకే జానర్‌లో ఉన్నా కథలోని కాన్ఫ్లిక్ట్ కొత్తగా ఉంటే ప్రేక్షకులకు ఫ్రెష్‌గా అనిపిస్తుందని చెప్పాడు. డైరెక్టర్ రమేష్ కోర్టు సినిమా రిలీజ్ కు వారం రోజుల ముందే ఈ కథను చెప్పారని, కథ విన్న వెంటనే ఈ సినిమాకు యస్ చెప్పానని రోషన్ వెల్లడించాడు. ఈ సందర్భంగా నిర్మాత కృష్ణ అందించిన సపోర్ట్‌ను కూడా గుర్తు చేసుకున్నాడు.
కోర్టు మూవీ సక్సెస్ తర్వాత తనపై బాధ్యత మరింత పెరిగిందని రోషన్ చెప్పాడు. ఆ సినిమా తర్వాత ప్రతి ఒక్కరూ తనను ఓన్ చేసుకున్నారని, అందుకే కథల ఎంపిక విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటున్నానని తెలిపాడు. ఎలాంటి కథలు వినాలి, ఎప్పుడు వినాలనే విషయాలను తన తండ్రి, మేనేజర్ చూసుకుంటారని వెల్లడించాడు. తెల్లకాగితం పై తనకు ఉన్న కాన్ఫిడెన్స్‌కు కారణం కూడా చెప్పాడు. టీజర్ లాంచ్‌కు రెండు రోజుల ముందే సినిమా చూశానని, తాను అనుకున్నదానికంటే సినిమా బాగా వచ్చిందని పేర్కొన్నాడు. ఈ సినిమా 7జీ బృందావన్ కాలనీ తరహాలో ఆడియన్స్ కు గుర్తుండిపోతుందన్న తన కామెంట్స్ కూడా ఆ నమ్మకంతో చేసినవేనని చెప్పాడు. అనిల్ రావిపూడి, కొరటాల శివ ఈ సినిమాను చూశారని, అనిల్ తో తనకు ఎంతో మంచి అనుబంధముందని కూడా రోషన్ వెల్లడించాడు.
నక్షత్ర మాట్లాడుతూ.. తాను ఫస్ట్ సినిమా చేయాలని డిసైడ్ అయినప్పుడు ఎలాంటి సినిమానైతే ఊహించుకున్నానో దానికంటే తెల్లకాగితం మూవీ ఎక్స్‌పీరియెన్స్ ఎక్కువగానే ఉందని చెప్పింది. ఈ సినిమాలో తన క్యారెక్టర్ చాలా ఫన్నీగా, కొత్తగా ఉంటుందని, ముఖ్యంగా అమ్మాయిలకు బాగా కనెక్ట్ అవుతుందని తెలిపింది. రోషన్‌తో కలిసి వర్క్ చేయడం చాలా సౌకర్యంగా అనిపించిందని, తాను చేసే తప్పులను సరిదిద్దుతూ ఎంతో హెల్ప్ చేశాడని తెలిపింది. ఈ సినిమా ఫ్యామిలీస్‌తో పాటు టీనేజర్లు కూడా తప్పక చూడాల్సిన సినిమా అని నక్షత్ర పేర్కొంది.
రిలీజ్ కు ముందే తెల్లకాగితంపై హీరోహీరోయిన్లలో కనిపిస్తున్న ఈ నమ్మకం.. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ఎలాంటి రెస్పాన్స్ ను తెచ్చుకుంటుందో చూడాలి.