ఓటీటీ పాఠం: వాపును చూసి బలుపు అనుకుంటే!
కారణం ఏదైనా కానీ కరోనా క్రైసిస్ కాలంలో ఉన్న `ఓటీటీ బలుపు` ఇప్పుడు లేదు. అదంతా వాపు మాత్రమేనని క్లియర్‌కట్‌గా ప్రజలకు అర్థమవుతోంది.;
వాపును చూసి బలుపు అనుకుంటే పొరపాటు. ఆ బలుపు కూడా ఎంతో కాలం నిలవడం లేదు. ఇప్పుడు ఓటీటీల వాలకం చూస్తుంటే అలానే ఉంది. సినీపరిశ్రమలు క్రైసిస్ లో ఉన్న సమయంలో ఓటీటీలే అదుకున్నాయని, నిర్మాతలకు నష్టం రాకుండా కాపాడాయని భావించారు. కానీ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఇటీవలి కాలంలో ఓటీటీ రంగంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు కంటెంట్ కొనుగోలులో చాలా రూల్స్ ని ఓటీటీలు ప్రవేశ పెట్టాయి. అమ్మకానికి వచ్చిన ఒక్కో సినిమాకి ధరను నిర్ణయించాలంటే, ముందుగా థియేట్రికల్ గా నిరూపించుకుని తీరాలి. అక్కడ సరిగా ఆడితే, దానిని బట్టి ధరను నిర్ణయిస్తారు. ఒకవేళ సినిమా సరిగా ఆడకపోతే అంతే సంగతి.
ఓటీటీలు ఆదుకుంటాయని భావించి వాటిపైనే ఆధారపడితే, అది ఏనాటికైనా పెను ముప్పుగా పరిణమిస్తుందని ప్రూవైంది. ఓటీటీలు ఇటీవల సినిమాలను కొనడం మానేసాయి. పెద్ద సినిమా లేదా క్రేజ్ ఉన్న హీరో అయితేనే సరైన ధరలు చెల్లించి కొనుగోలు చేస్తున్నాయి. కానీ అంతగా క్రేజ్ లేని, చిన్న సినిమాలను కూడా అవి పట్టించుకోవడం లేదు.
కారణం ఏదైనా కానీ కరోనా క్రైసిస్ కాలంలో ఉన్న `ఓటీటీ బలుపు` ఇప్పుడు లేదు. అదంతా వాపు మాత్రమేనని క్లియర్‌కట్‌గా ప్రజలకు అర్థమవుతోంది. ఇటీవల డిజిటల్ వేదికలు, ముఖ్యంగా ఓటీటీలు తమ నష్టాలను పూడ్చుకునేందుకు సరైన ఆఫీస్ ని కూడా మెయింటెయిన్ చేయడం లేదు. ఇప్పుడు సెలక్టివ్ గా మాత్రమే సినిమాలను కొంటున్నాయి. ధరల్ని పరిమితం చేసాయి. ఏడాది కాలంగా ఇదే పరిస్థితిని పరిశ్రమ ఎదుర్కొంటోంది. పర్యవసానంగా వాపును చూసి బలుపు అనుకున్న నిర్మాతలు వరుసగా ఏక కాలంలో నాలుగైదు సినిమాలను ప్రారంభించిన వారు, అందరూ పునరాలోచించుకునేలా చేసింది ఈ పరిణామం.
ఓటీటీలు లేదా డిజిటల్ హక్కుల రూపంలో భారీ ప్యాకేజీలు అందుతున్నందున హీరోలు డైరెక్టర్లు కూడా తమ పారితోషికాలను పెంచేసారు. అయితే పెరిగిన పారితోషికాలను చెల్లించే పరిస్థితి ఇటీవల నిర్మాతకు లేదు. అందువల్ల మార్కెట్ ని బట్టి హీరోలు, ఇతరులు కూడా తమ పారితోషికాల విషయంలో ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని విశ్లేషిస్తున్నారు.
ఇటీవల ఓటీటీలు టై అప్‌లతో విలీన ప్రక్రియలో ఉన్నాయి. జియో- హాట్ స్టార్ కలిసి దూకుడు పెంచాయి. జియో ప్లస్ హాట్‌స్టార్ ఇప్పుడు గేమ్‌లో దూకుడు ప్రదర్శిస్తోంది. ఇంతలోనే అల్లు అవింద్ సారథ్యంలోని `ఆహా-తెలుగు` కరెక్షన్ మోడ్ లో ఉందని చెబుతున్నారు. జీ స్టూడియోస్ క్రియాశీల నిర్మాణంలో ఉంది. ఈ సంస్థ డిజిటల్ ఒప్పందాలను పొందడం కంటే ఒరిజినల్ సినిమాలను నిర్మించే ఆలోచనతో ఉంది. ఇక అమెజాన్ ప్రైమ్ వీడియోస్, నెట్ ఫ్లిక్స్ తమ బడ్జెట్లను పరిమితం చేసి, అవసరమైన కంటెంట్ ని తీసుకుంటున్నాయి. థియేటర్ లో బాగా ఆడితేనే ఆ సినిమాను కొనేందుకు వారంతా సిద్ధమవుతున్నారు.