ఓటీటీల్లోనూ షార్ట్‌ వీడియోలు రానున్నాయా?

ఒకప్పుడు ఓటీటీల్లో సినిమాలు థియేట్రికల్‌ రిలీజ్ అయిన చాలా వారాల తర్వాత స్ట్రీమింగ్‌ అయ్యేవి.;

Update: 2025-06-16 05:08 GMT

ఇండియాలో గత ఐదేళ్లలో ఓటీటీ మార్కెట్‌ పదుల రెట్లు పెరిగింది. ముఖ్యంగా కరోనా సమయంలో థియేటర్లు మూత పడటం, ఆ తర్వాత కరోనా భయంతో థియేటర్లకు జనాలు వెళ్లకుండా ఓటీటీ కంటెంట్‌కి అలవాటు అయ్యారు. థియేటర్లలో నార్మల్‌ పరిస్థితులు నెలకొన్నా కూడా ఓటీటీలను ప్రేక్షకులు వదల్లేదు. థియేటర్లకు వెళ్లే వారి సంఖ్య భారీగా తగ్గింది. ఒక సర్వే ప్రకారం పదేళ్ల క్రితం ఉన్న థియేటర్ల సంఖ్య, థియేటర్‌కి వెళ్లే వారి సంఖ్య దాదాపుగా సగానికి పైగా తగ్గింది. అదే సమయంలో ఓటీటీ మార్కెట్‌ విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఓటీటీలు మరింత స్పీడ్‌గా దూసుకు పోతున్నాయి. ఓటీటీల్లో సినిమాలు, సిరీస్‌లు ఇబ్బడి ముబ్బడిగా వస్తున్నాయి.

ఒకప్పుడు ఓటీటీల్లో సినిమాలు థియేట్రికల్‌ రిలీజ్ అయిన చాలా వారాల తర్వాత స్ట్రీమింగ్‌ అయ్యేవి. కానీ ఇప్పుడు థియేట్రికల్‌ రిలీజ్ కాకుండానే కొన్ని సినిమాలు డైరెక్ట్‌ ఓటీటీ స్ట్రీమింగ్‌ అవుతున్నాయి. ఇక ఇంగ్లీష్ కి పరిమితం అయిన వెబ్‌ సిరీస్‌ల జోరు ఇండియన్ మార్కెట్‌ను ముంచేస్తుంది. అన్ని ప్రాంతీయ భాషల్లోనూ ఓటీటీ వెబ్‌ సిరీస్‌లను స్ట్రీమింగ్‌ చేస్తున్నాయి. ఓటీటీలో వచ్చే కంటెంట్‌ విషయంలో మొదటి నుంచి కూడా కొందరికి అసంతృప్తి ఉన్నప్పటికీ థియేటర్‌లకు వెళ్లడం కంటే ఇంట్లో కూర్చుని ఓటీటీ కంటెంట్‌ను ఎంజాయ్‌ చేయవచ్చు అని భావిస్తున్నారు. పెరిగిన మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని ఓటీటీలు సైతం మరింతగా తమ పనితనం ను మెరుగు పరుచుకుంటున్నాయి.

కొత్త సినిమాలను, ఆకట్టుకునే వెబ్‌ సిరీస్‌లను తమ సబ్‌స్క్రైబర్స్‌కి అందజేసేందుకు గాను ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో నెటిజన్స్ షార్ట్ వీడియోలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. నిమిషం వ్యవధిలోనే ఒక వీడియోను చూసే వీలు ఉండే విధంగా షార్ట్స్‌ ను క్రియేట్‌ చేస్తున్నారు. ఒక సర్వే ప్రకారం ఇండియాలో డిజిటల్‌ యూజర్స్‌ లో 70 శాతం మంది షార్ట్ ఫామ్ వీడియోలను ఇష్టపడుతున్నారు. వారు లాంగ్ వీడియోల కంటే షార్ట్‌ వీడియోలను ఇష్టపడుతున్నారు, అందుకే ఓటీటీలు సైతం షార్ట్‌ వీడియో ఫార్మట్‌లో కంటెంట్‌ను అందించేందుకు గాను రెడీ అవుతున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే విదేశాల్లోని కొన్ని ఓటీటీలు షార్ట్ వీడియోలను అందిస్తున్నాయి.

ఇండియాలో షార్ట్‌ వీడియోలను చూసే వారు ఎక్కువ మంది ఉన్న కారణంగా ఓటీటీలు ఆ దిశగా ప్లాన్‌ చేస్తున్నాయి. నిమిషం కంటెంట్‌ ను సొంతంగా క్రియేట్‌ చేయడం లేదంటే, క్రియేటర్స్ నుంచి కొనుగోలు చేయడం వంటివి చేయబోతున్నారు. వీడియో క్రియేటర్స్‌కి ఇది కచ్చితంగా బిగ్‌ ఆఫర్స్‌ను తెచ్చి పెట్టే అవకాశాలు ఉన్నాయి. నిమిషం నుంచి రెండున్నర మూడు నిమిషాల పాటు ఉండే షార్ట్‌ వీడియోలను ఓటీటీలో రాబోయే రోజుల్లో స్ట్రీమింగ్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. కొన్ని సినిమాలకు సంబంధించిన కీలక సన్నివేశాలను సైతం ఇలా ఓటీటీలు షార్ట్‌ వీడియోలుగా స్ట్రీమింగ్‌ చేస్తే మొత్తం వీడియోను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపించే అవకాశం ఉంటుంది. కనుక ఓటీటీలు ముందు రోజుల్లో షార్ట్‌ వీడియోలను విప్లవాత్మకంగా తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓటీటీల్లో షార్ట్స్ రావడంపై మీ స్పందన ఏంటి?

Tags:    

Similar News