స్క్రిప్టు, ట్యాలెంట్ ఉన్నా OTTలో అవ‌కాశం రావాలంటే!?

లంచం లంచం లంచం.. ఇది లేనిదే ఏదీ ముందుకు సాగ‌దు. అభిన‌వ భార‌తావ‌నిని ప‌ట్టి పీడించే రుగ్మ‌త ఇది.;

Update: 2026-03-31 03:30 GMT

లంచం లంచం లంచం.. ఇది లేనిదే ఏదీ ముందుకు సాగ‌దు. అభిన‌వ భార‌తావ‌నిని ప‌ట్టి పీడించే రుగ్మ‌త ఇది. గ‌వ‌ర్న‌మెంట్ ఆఫీస్ లో లంచం లేనిదే ఫైల్ క‌ద‌ల‌దు.. రెవెన్యూ- త‌హ‌శీల్దార్ ఆఫీస్, మున్సిప‌ల్ ఆఫీస్, స‌చివాలయం, ఫారెస్ట్ ఆఫీస్, డిఇవో ఆఫీస్ కాదేదీ లంచానిక‌న‌ర్హం..

ప‌శువుల మార్కెట్లో ద‌ళారీలు ఉన్నారు.. కూర‌గాయ‌ల మార్కెట్లో దోపిడీ ద‌ళారులు ఉన్నారు.. అస‌లు రంగం ఏదైనా ద‌ళారీ లేనిదే ప‌న‌వ్వ‌దు. దీనిపై ఆర్.పి ప‌ట్నాయ‌క్ `బ్రోక‌ర్` అనే సినిమా తీసారు. లంచ‌గొండిత‌నంపై శంక‌ర్ ఏకంగా భార‌తీయుడు, భార‌తీయుడు 2 లాంటి భారీ సినిమాల్ని తెర‌కెక్కించారు.

ఇప్పుడు క్రియేటివ్ రంగంలో కూడా ఈ లంచ‌గొండుల‌దే రాజ్యం. ఒక‌రి మెద‌డులోని సృజ‌నాత్మ‌క‌త‌కు రూపం ఇవ్వాలంటే చాలా ఇక్క‌ట్లు ఎదుర్కోవాల్సిందే. ఓటీటీ రంగంలో అవినీతి భోగోతం నిజంగా బుర్ర తిరిగిపోయేలా ఉంద‌ని ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి.

స్క్రిప్టు, ట్యాలెంట్ ఉన్నా ఓటీటీలో అవ‌కాశం రావాలంటే అంత సులువేమీ కాదు. పెద్ద కార్పొరెట్ ఓటీటీల్లో ద‌ర్శ‌క‌త్వ‌ అవ‌కాశం కావాలంటే మ‌ధ్య‌లో వాళ్ల‌కు లంచాలివ్వాలి.. ల‌క్ష‌ల్లో చెల్లించుకుంటే, ప‌ర్సంటేజీలు ఇస్తేనే ప‌న‌వుతోంద‌నే ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. చాలా మంది యువ ప్ర‌తిభావంతులు అద్భుత‌మైన స్క్రిప్టుల‌తో ఓటీటీల‌ను అప్రోచ్ అవుతున్నారు. క‌థ‌, కంటెంట్ స‌రే.. అస‌లు మ్యాట‌ర్ ఎక్క‌డ‌? అనేది అక్క‌డ ఎదుర‌య్యే ప్ర‌శ్న‌. ల‌క్ష‌ల్లో చెల్లించాల‌ని డీల్ సెట్ట‌ర్ ముందే ప్ర‌పోజ‌ల్ పెడుతున్నార‌ని ఓ ఔత్సాహిక పూణే ఫిలింఇనిస్టిట్యూట్ కుర్రాడు వాపోవ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

స్క్రిప్టు అద్భుతంగా ఉంది.. అంతా ఓకే... ఆఫ‌ర్ లెట‌ర్ ఇవ్వ‌డానికి రెడీ.. ఒప్పందం చేసుకోవ‌డానికి సిద్ధ‌మే. కానీ ల‌క్ష‌ల్లో డ‌బ్బు చెల్లించాలి.. దీనికోసం డెబ్యూ ద‌ర్శ‌కుల‌కు డ‌బ్బు పెట్టే నిర్మాత‌లు కావాలి.. అంటే నిర్మాత లంచం ఇవ్వ‌డానికి రెడీగా ఉండాలి..! ఇది విన‌డానికి ఎంత ఎబ్బెట్టుగా ఉంది? క్రియేటివ్ రంగంలో ఇలాంటి లంచ‌గొండి భోగోత‌మా? నిజంగా సిగ్గు చేటు! కానీ బుర్ర‌లో తెలివితేట‌లు ఉంటే స‌రిపోదు.. ఇక్క‌డ అర్థ బ‌లం కూడా ముఖ్యం. అడగ్గానే డ‌బ్బు కుమ్మ‌రించే స‌త్తా ఉంటేనే ఇక్క‌డ అవ‌కాశాలొస్తాయి. అయితే డ‌బ్బు క‌ట్టి రైల్వే ఉద్యోగం కొనుక్కున్న చందంగా డ‌బ్బు క‌ట్టి క్రియేటివిటీ ప్ర‌ద‌ర్శించడ‌మా?! ఇదే ర‌కం క్రియేటివిటీ అవుతుంది!

టాలీవుడ్ లోని కొన్ని నిర్మాణ సంస్థ‌లు నిజ‌మైన ఫ్యాష‌న్ ఉన్న క్రియేట‌ర్లు, ప్ర‌తిభావంతులకు అవ‌కాశాలు క‌ల్పించేందుకు షార్ట్ ఫిలిం కాంటెస్ట్ ల‌ను ఏర్పాటు చేస్తున్నాయి. కచ్ఛితంగా అక్క‌డ నిరూపించుకుంటే పెద్ద స్థాయిలో అవ‌కాశాలొస్తాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. దేవ‌క‌ట్టా, శ్రీ‌రామ్ ఆదిత్య‌, విరించి వ‌ర్మ‌, సుజీత్, రాహుల్ సాంకృత్య‌న్, మేర్ల పాక ముర‌ళి, కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని స‌హా చాలా మంది యువ‌ద‌ర్శ‌కులు ల‌ఘు చిత్రాల ద్వారానే ద‌ర్శ‌కులుగా అవ‌కాశాలు అందుకున్న విష‌యాన్ని మ‌రువ‌కూడ‌దు. ఈ లంచ‌గొండుల చుట్టూ తిరుగుతూ టైమ్ వేస్ట్ చేసుకునే కంటే నిజ‌మైన ప్ర‌తిభ‌ను నిరూపించుకోవ‌డానికి ఇత‌ర మార్గాల‌ను అన్వేషించ‌డం మ‌రింత తెలివైన క్రియేటివిటీగా యువ‌త‌రం భావించాలి.

Tags:    

Similar News