సినిమాలు కాదు చుక్కలు చూపిస్తున్న నెట్‌ఫ్లిక్స్‌...!

ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ఖాతాదారులను కలిగి ఉన్న నెట్‌ఫ్లిక్స్ అంతే క్వాలిటీతో బెస్ట్‌ కంటెంట్‌ను ప్రేక్షకులకు అందిస్తోంది.;

Update: 2026-04-20 14:30 GMT

ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ఖాతాదారులను కలిగి ఉన్న నెట్‌ఫ్లిక్స్ అంతే క్వాలిటీతో బెస్ట్‌ కంటెంట్‌ను ప్రేక్షకులకు అందిస్తోంది. సినిమాలు, సిరీస్‌లు, షోలు అంటూ రెగ్యులర్‌గా ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూ, ఎప్పటికప్పుడు తన ఖాతాదారులను పెంచుకుంటున్న నెట్‌ఫ్లిక్స్‌ క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా, సొంత కంటెంట్‌ రూపకల్పనలో ముందు ఉంటుంది. నెట్‌ఫ్లిక్స్‌ ఒకప్పుడు అమెరికాతో పాటు కొన్ని పాశ్చాత దేశాలకు మాత్రమే పరిమితం అయ్యి ఉండేది. కానీ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ నెట్‌ఫ్లిక్స్ కంటెంట్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. అన్ని దేశాలకు సంబంధించిన కంటెంట్‌ను అందించేందుకు గాను నెట్‌ఫ్లిక్స్ ప్రణాళికలు రూపొందించింది. గత పదేళ్లుగా నెట్‌ఫ్లిక్స్ తమ ఖాతాదారుల సంఖ్యను అమాంతం పెంచుకుంది. ఇతర ఓటీటీలు ఏవీ కూడా తమ దరిదాపుల్లోకి కూడా రాలేనంత దూరంలో నెట్‌ఫ్లిక్స్ నిలిచింది.

స్థానిక భాషల్లో నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్‌ కంటెంట్‌....

ఒకవైపు ఖాతాదారులు పెరుగుతున్నారు, మరో వైపు కంటెంట్‌ క్వాలిటీ పెంచుతున్న నెట్‌ఫ్లిక్స్ ఎక్కడికి అక్కడ స్థానిక కంటెంట్‌ను ఇవ్వడం ద్వారా మరింత మంది ఖాతాదారులను పెంచుకుంటూ పోతున్నారు. నెట్‌ఫ్లిక్స్‌ మొదట తమ ఖాతాదారుల వద్ద తక్కువ మొత్తం వసూళ్లు చేసేది. ఎప్పుడైతే కంటెంట్‌ కి ప్రేక్షకులు అలవాటు అయ్యారో మెల్ల మెల్లగా తమ సబ్‌స్క్రిప్షన్ రేటును నెట్‌ఫ్లిక్స్ పెంచుతూ పోతోంది. గత ఐదేళ్లలో ఇండియాలో నెట్‌ఫ్లిక్స్ ఖాతాదారుల సంఖ్య రెండు మూడు రెట్లు పెరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఖాతాదారులు పెరగడంతో ఒరిజినల్ కంటెంట్‌ను నెట్‌ఫ్లిక్స్ ఇండియన్‌ భాషల్లో మరింతగా పెంచింది. స్థానిక భాషల్లోనూ ఒరిజినల్‌ కంటెంట్‌ను నెట్‌ఫ్లిక్స్ నిర్మిస్తున్న విషయం తెల్సిందే. దాంతో సబ్‌స్క్రిప్షన్ రేటును భారీగా పెంచింది. గత ఐదేళ్ల కాలంలో నెట్‌ఫ్లిక్స్ తమ సబ్‌స్క్రిప్షన్ చార్జ్ ను రెట్టింపు కంటే ఎక్కువగానే పెంచింది.

నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ రేటు...

అమెరికాలో నెట్‌ఫ్లిక్స్‌ కంటెంట్‌ కి ఎక్కువ అభిమానులు ఉంటారు. అక్కడి నుంచే నెట్‌ఫ్లిక్స్‌ అత్యధిక సబ్‌స్క్రిప్షన్‌ చార్జ్‌లను వసూళ్లు చేస్తుందని ఒక అంచన. అలాంటి అమెరికాలో ఏడాదిలో ఏకంగా రెండు సార్లు రేట్లను నెట్‌ఫ్లిక్స్‌ పెంచింది. ఈ మధ్య కాలంలో నెట్‌ఫ్లిక్స్ యాడ్స్‌తో కంటెంట్‌ను స్ట్రీమింగ్‌ చేయడం మొదలు పెట్టింది. సబ్‌స్క్రైబర్స్ సైతం యాడ్స్‌ను చూడాల్సి వస్తుంది. యాడ్స్ లేకుండా అధనపు మొత్తాన్ని చెల్లించేలా ప్లాన్స్‌ ను మార్చారు. అమెరికాలో యాడ్స్ తో కంటెంట్‌ చూడాలి అంటే ఇంతకు ముందు 8 డాలర్లు ఉండేది, ఇప్పుడు ఆ మొత్తం 9 డాలర్లకు పెరిగింది. యాడ్స్ లేకుండా నెట్‌ఫ్లిక్స్ కంటెంట్‌ చూడాలి అంటే గతంలో 18 డాలర్లు ఉండేది. కానీ ఇప్పుడు ఆ మొత్తం ను 20 డాలర్లకు చేసింది. ఇక ప్రీమియం ప్లాన్‌ ధరను 25 డాలర్ల నుంచి 27 డాలర్లకు పెంచినట్లు అధికారికంగా నెట్‌ఫ్లిక్స్ నుంచి ప్రకటన వచ్చింది.

ఇండియాలో కూడా నెట్‌ఫ్లిక్స్‌...

ఇప్పటికే అమెరికా లో కొత్త రేట్లు అమలు అయ్యాయి. నెట్‌ఫ్లిక్స్ సాధారణంగా అమెరికాలో తమ సబ్‌స్క్రిప్షన్ పెంచిన కొన్ని నెలల్లోనే ఇండియా ఇతర దేశాల్లోనూ పెంచడం పరిపాటిగా వస్తుంది. కనుక త్వరలోనే ఇతర దేశాల్లోనూ తమ ఖాతాదారులకు నెట్‌ఫ్లిక్స్ చుక్కలు చూపించేందుకు రెడీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే ఇండియాలో ఇతర ఓటీటీలతో పోల్చితే నెట్‌ఫ్లిక్స్ రేటు ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఆ మొత్తం ను మరింత పెంచే అవకాశాలు ఉన్నాయి. దాంతో నెట్‌ఫ్లిక్స్ తమ ఖాతాదారులకు సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు, షో లు చూపించకుండా రేట్లు పెంచి చుక్కలు చూపిస్తోంది అంటూ విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే సబ్‌స్క్రిప్షన్‌ రేటు ఎక్కువగా ఉండటంతో కొందరు పైరసీ వైపు చూస్తున్నారు. ఇప్పుడు మరింతగా సబ్‌స్క్రిప్షన్‌ రేటు పెంచితే కచ్చితంగా పైరసి మరింతగా పెరగడం ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News