రాప్తాడు ఉన్మాది దొరికేశాడా? పోలీసు యాక్షన్ పై సస్పెన్స్
అనంతపురం జిల్లా రాప్తాడు హైస్కూల్ లో పదో తరగతి విద్యార్థినిపై జరిగిన దాడి కలకలం సృష్టిస్తోంది.
అనంతపురం జిల్లా రాప్తాడు హైస్కూల్ లో పదో తరగతి విద్యార్థినిపై జరిగిన దాడి కలకలం సృష్టిస్తోంది. ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన విద్యార్థినిని మెరుగైన చికిత్స నిమిత్తం బెంగళూరు ఆస్పత్రికి తరలించారు. పదో తరగతి చదువుతున్న విద్యార్థినిని లక్ష్యంగా చేసుకున్న దుండగుడు చెట్లు నరికే రంపాన్ని తీసుకువచ్చి దాడి చేయడం, ఆ పక్కనే ఉన్న మరో విద్యార్థిని గాయపడిన విషయం తెలిసిందే. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో రాష్ట్రమంత్రులు అంతా ఈ ఘటనపై ఉలిక్కిపడ్డారు. పాఠశాలల్లో విద్యార్థినుల భద్రతను ప్రశ్నార్థకం చేసే ఘటనపై ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోందని అంటున్నారు. ఇదే సమయంలో ఉన్మాదిని కఠినంగా శిక్షించాలనే డిమాండ్ ఊపందుకుంది.
అమాయక విద్యార్థినిపై క్లాస్ రూములోనే దాడి చేయడం తీవ్రంగా కలిచివేస్తోంది. దుండగుడికి ఉరిశిక్ష వేయాలని తల్లిదండ్రులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇలాంటి నేరాలకు పాల్పడే వారికి ఈ నేలపై బతికే హక్కు లేదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మెరుగైన వైద్యం అందించి విద్యార్థినిని బతికించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దాడిపై ప్రజల నుంచి వస్తున్న డిమాండ్లతో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేదే ఉత్కంఠ రేపుతోంది.
పోలీసుల అదుపులో నిందితుడు?
రాప్తాడు హైస్కూల్ లో విద్యార్థినిపై దాడి చేసిన ఉన్మాదిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దాడి తర్వాత నిందితుడు బైక్ పై పరార్ అయినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. ఈ చిత్రాల ఆధారంగా గాలింపు చేపట్టిన పోలీసులకు నిందితుడు ధర్మవరం రైల్వేస్టేషన్ వద్ద ఉన్నట్లు తెలిసిందని చెబుతున్నారు. ఆ వెంటనే స్థానిక పోలీసులను అప్రమత్తం చేసి ఉన్మాదిని అదుపులోకి తీసుకున్నారని రహస్య ప్రదేశానికి తరలించి ప్రశ్నిస్తున్నారని చెబుతున్నారు. విద్యార్థిని స్వగ్రామంలోనే నిందితుడు పదేళ్లుగా నివసిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. ఏ ఉద్దేశంతో ఈ దాడికి పాల్పడింది తెలియాలంటే అతడు మాత్రమే చెప్పాల్సివుందని అంటున్నారు. స్వగ్రామం నుంచి ఆటోలో పాఠశాలకు వచ్చి వెళ్లే విద్యార్థిని ప్రవర్తనపై ఎలాంటి ఫిర్యాదులు లేవని స్థానికులు చెబుతున్నారు. తరగతి గదిలో తొలి వరుసలోనే కూర్చుని చక్కగా చదువుకుంటుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. విద్యార్థినిపై దుండగుడు చేసిన దాడిని ప్రత్యక్షంగా చూసిన ఉపాధ్యాయులు, విద్యార్థులు భయంతో హడలిపోతున్నారు.
పోలీస్ యాక్షన్ పై ఉత్కంఠ
కాగా, నిందితుడు పోలీసులు అదుపులో ఉన్నాడనే సమాచారంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇటువంటి నిందితుడిని కఠినంగా శిక్షించాలనే డిమాండ్ రాష్ట్రవ్యాప్తంగా వినిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో నిందితుడు బయట ఉంటే ప్రమాదమని పోలీసు అధికారులు భావిస్తున్నారని చెబుతున్నారు. అందుకే రహస్య ప్రదేశంలో ఉంచి ప్రశ్నిస్తున్నారని చెబుతున్నారు. ఇక నిందితుడి అరెస్టును చూపుతారా? లేదా? అన్న సస్పెన్స్ కూడా నెలకొంది. ఇప్పటివరకు నిందితుడు తమ అదుపులో ఉన్నాడని పోలీసులు అధికారికంగా ధృవీకరించలేదు. దీంతో ఉన్మాదిని పట్టుకున్నారనే ప్రచారాన్ని కొందరు విశ్వసించడం లేదని అంటున్నారు. ఏదిఏమైనా ఈ సస్పెన్స్ కు పోలీసులే తెరదించాల్సివుందని అంటున్నారు.