ఏఎంసీఏకు శ్రీసత్యసాయి జిల్లాలో శంకుస్థాపన.. దీని గురించి తెలిస్తే వావ్ అనేస్తారు

రాయలసీమ పరిధిలోని శ్రీసత్యసాయి జిల్లాలో ఈ రోజు కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్.. ఏపీ సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ఫైటర్ జెట్ల తయారీ కేంద్రానికి శంకుస్థాపన జరగనుంది.

Update: 2026-05-15 05:15 GMT

కొన్ని అద్భుతాలకు పెద్దగా ప్రచారం జరగవు. ఇప్పుడు చెప్పేది కూడా ఆ కోవలోకే వస్తుంది. రాయలసీమ పరిధిలోని శ్రీసత్యసాయి జిల్లాలో ఈ రోజు కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్.. ఏపీ సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ఫైటర్ జెట్ల తయారీ కేంద్రానికి శంకుస్థాపన జరగనుంది. అడ్వాన్స్ డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ (పొట్టిగా చెప్పాలంటే ఏఎంసీఏ). ఇది దేశీయంగా డెవలప్ చేస్తున్న తొలి స్వదేశీ ఐదో తరం స్టెల్త్ యుద్ధ విమానం. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టుకు తెలుగు నేల వేదిక కానుంది. ఈ ప్రాజెక్టు వివరాలు.. ఇక్కడేం తయారవుతాయన్న విషయం గురించి తెలిస్తే.. ఒక తెలుగువాడిగా ఎంతో సంతోషానికి గురవుతాం. నిజానికి ఇక్కడ చేపట్టే ప్రాజెక్టు.. ప్రతి భారతీయుడికి గర్వకారణంగా చెప్పక తప్పదు.

ఇంతకూ ఐదోతరం యుద్ధ విమానాల ప్రాజెక్టు విషయంలోకి వెళ్లే ముందు.. ఇప్పటివరకు మన దేశం వద్ద ఉన్న నాలుగో తరం.. 4.5 తరం యుద్ద విమానాల గురించి తెలిసినప్పుడు.. ఇప్పుడు చేపట్టే ప్రాజెక్టు ప్రత్యేకత ఇట్టే అర్థమవుతుంది. నాలుగోతరం యుద్ధ విమానాలుగా రష్యా సాంకేతికతో భారత్ లో తయారైన సుఖోయ్, తేజస్, మిరాజ్ 2000, మిగ్ 29లుగా చెప్పాలి. దానికి కాస్త అప్ గ్రేడ్ చేసిన 4.5 తరం యుద్ధ విమానాల విషయానికి వస్తే.. సుఖోయ్, తేజస్ లతో పాటు ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన రఫేల్ యుద్ధ విమానాన్ని చెప్పొచ్చు. మన వద్ద ఉన్న నాలుగోతరం యుద్ధ విమానాలకు కొన్ని అదనపు ఫీచర్లు జోడించటం ద్వారా 4.5 తరంగా మార్చారు. అయితే.. మిగిలిన వాటికి రఫేల్ కు మధ్య ఉన్న వ్యత్యాసం ఇందులో ఐదో తరం యుద్ధ విమానాల్లో ఉండే కొన్ని ఫీచర్లు ఉంటాయి. అధునాతన క్షిపణులు ఉంటాయి.

నాలుగోతరం.. 4.5 తరం యుద్ధ విమానాలకు ఉండే అతి పెద్ద సమస్య శత్రువుల రాడార్లకు చాలా స్పష్టంగా.. సులువుగా దొరికిపోతుంటాయి. యుద్ధ విమానాల్లో ఉండే క్షిపణులు.. బాంబులు అన్ని రెక్కల కింద బయటకు కనిపిస్తూ ఉంటాయి. ధ్వని కంటే వేగంగా వెళ్లాలంటే అదనపు ఇంధనం వాడాలి. దీంతో ఇందులోని ఇంధనం త్వరగా ఖర్చు అవుతుంది. పైలట్ స్వయంగా వేర్వేరు రాడార్ స్క్రీన్లను చూసి శత్రువును అంచనా వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఐదో తరం యుద్ధ విమానం గురించి.. దాని ఫీచర్ల గురించి తెలిస్తే.. ఈ ప్రాజెక్టు దేశానికి ఎంత తలమానికం అన్నది ఇట్టే అర్థమవుతుంది.

ఈ ఐదో తరం యుద్ధ విమానాలు ప్రస్తుతం ప్రపంచంలో అమెరికా, రష్యా, చైనా దేశాల వద్ద మాత్రమే ఉన్నాయి. అలాంటి శక్తివంతమైన యుద్ద విమానం ఉన్న నాలుగో దేశంగా భారతదేశం అవతరిస్తుంది. అమెరికా వద్ద ఉన్న ఎఫ్ 22, ఎఫ్ 35 యుద్ధ విమానాలు.. రష్యాకు చెందిన ఎస్ యు-57, చైనా వద్ద ఉన్న జే20 యుద్ధ విమానాలు ఐదో తరానికి చెందినవి. ఐదోతరం యుద్ధ విమానం ప్రత్యేకత ఏమంటే.. శత్రువుల అధునాత రాడార్ల కంటికి చిక్కకుండా దూసుకెళుతుంది. దీని డిజైన్ చాలా సిత్రంగా ఉంటుందని చెబుతారు.

యుద్ధ విమానం మీద పూసే రంగు కోటింగ్ శత్రువుకు ఒక మాయను గురి చేస్తోంది. అదెలానంటే.. రాడార్ కిరణాలు ఈ యుద్ధ విమానం మీద పడి తిరిగి వెళ్లకుండా పక్కకు తప్పుకుంటాయి. దీంతో శత్రువులు తమ అత్యాధునిక రాడార్ స్క్రీన్ మీద ఈ భారీ విమానం ఒక చిన్న పక్షిలా కానీ అసలు ఏమీ లేనట్లుగా కానీ కనిపిస్తుంది. ఒకవేళ శత్రువు దీన్ని గుర్తించి అర్థం చేసుకునేలోపే ఇది తన పని పూర్తి చేసుకుంటుంది.శత్రువుల లక్ష్యాల మీద దాడి చేసి వెనుదిరుగుతుంది. ఈ ఐదో తరం యుద్ధ విమానం లోపలే ఆయుధాలు ఉంటాయి. శత్రువు మీద దాడి చేసే వేళలో మాత్రమే కింది డోర్స్ తెరుచుకొని బాంబులు వస్తాయి. దాడులు పూర్తి కాగానే డోర్స్ మూసుకుపోతాయి.

ధ్వని కంటే వేగంగా గంటల తరబడి దూసుకెళ్లే సామర్థ్యం దీని సొంతం. దీంతో ఇంధనం భారీగా ఆదా అవుతుంది. ఎక్కువ దూరం ప్రయాణించే వీలుంది. నాలుగో తరం యుద్ధ విమానాల్లో పైలట్ మీద తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది.అతడు స్వయంగా రాడార్ చూసుకుంటూ.. శత్రువులను వెతకాలి. విమానం నడపాల్సి ఉంటుంది. కానీ.. ఐదోతరం యుద్ధ విమానంలో అందుకు భిన్నమైన వ్యవస్థ ఉంటుంది. చుట్టుపక్కల వందల కిలోమీటర్ల పరిధిలో శత్రువుల వివరాలు..వాతావరణం.. ప్రమాదాలను అదే స్వయంగా స్కాన్ చేసి.. పైలట్ స్క్రీన్ మీద చూపిస్తుంది. దీంతో.. ముప్పును ముందే గుర్తించేందుకు పైలట్ కు సాయంగా ఉండటమే కాదు.. ముందే హెచ్చరికలు చేస్తూ.. ఏం చేయాలన్న సలహాను ఇవ్వటం దీని ప్రత్యేకత. శత్రువు గుర్తించే లోపే.. తనకు అప్పజెప్పిన పనిని పూర్తి చేసుకొని సురక్షితంగా తిరిగి వచ్చేస్తుంది. అలాంటి కీలక ప్రాజెక్టుకు శ్రీసత్యసాయి జిల్లా వేదిక కావటం విశేషంగా చెప్పకతప్పదు.

Tags:    

Similar News