ఆత్మహత్య చేసుకోవాలనుకున్న భార్యాబాధిత క్రికెటర్?
కెరీర్ పరంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్న సమయంలోనే భారత క్రికెటర్ చాహల్, వ్యక్తిగత జీవితంలోను బిగ్ -బ్లోని ఎదుర్కొన్నాడు. భార్య ధనశ్రీ నుంచి విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది.;
కెరీర్ పరంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్న సమయంలోనే భారత క్రికెటర్ చాహల్, వ్యక్తిగత జీవితంలోను బిగ్ -బ్లోని ఎదుర్కొన్నాడు. భార్య ధనశ్రీ నుంచి విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇటీవల భారతదేశంలో ఎక్కువగా చర్చించుకున్న హైప్రొఫైల్ విడాకుల కేసులలో ఇది ఒకటి. చాహల్ వర్సెస్ ధనశ్రీ! వార్ ఆఫ్ వర్డ్స్ ని మీడియా ప్రపంచం నిరంతర కథనాలుగా ప్రచురించింది. కొరియోగ్రాఫర్ ధనశ్రీని ప్రేమించి పెళ్లాడిన చాహల్ ఇది తన జీవితంలో అతి పెద్ద గుణపాఠం అన్నారు! అంటే అర్థం చేసుకోవచ్చు.
అయితే ప్రముఖ సోషల్ మీడియా ప్రభావశీలి, ఆర్జే మహ్వాష్ తో చాహల్ ఎఫైర్ పెట్టుకున్నాడని మీడియాలలో కథనాలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అదే క్రమంలో చాహల్ మోసగాడు! అంటూ సోషల్ మీడియాల్లో ఒక సెక్షన్ దుమ్మెత్తిపోసింది. ఇటీవలే విడాకుల ప్రక్రియ పూర్తయాక చాహల్ తిరిగి తన కెరీర్ పై మాత్రమే ఫోకస్ చేసాడు. అయితే ఇప్పటివరకూ ధనశ్రీ నుంచి విడాకులు తీసుకున్న క్రమంలో తనకు ఎదురైన మానసిక ఒత్తిడి గురించి అతడు ఏనాడూ ఓపెన్ కాలేదు.
సోదరీమణులతో కలిసి పెరిగాను:
తాజా ఇంటర్వ్యూలో అతడు తాను ఎదుర్కొన్న తీవ్రమైన ఒత్తిడి గురించి, ఆత్మహత్య ఆలోచనల గురించి కూడా బహిరంగంగా మాట్లాడి షాకిచ్చాడు. తనను మోసగాడు అంటుంటే, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని చాహల్ తెలిపారు. తాను ఎవరినీ మోసం చేయలేదని, తన మనస్తత్వం అలాంటిది కాదు అని కూడా వివరణ ఇచ్చాడు. ఇద్దరు సోదరీమణులు, తల్లితో పాటు పెరిగానని, స్త్రీల గౌరవం గురించి తనకంటే ఉత్తమంగా ఇంకెవరికీ తెలీదని కూడా చాహల్ అన్నారు. ఆర్జే మహ్వాష్ తో స్నేహం గురించి ఎక్కడా ప్రస్థావించని చాహల్ తనకు ఎవరితోను ఎలాంటి ఎఫైర్ లేదని పరోక్షంగా వెల్లడించాడు.
45రోజుల పాటు ఇదే పరిస్థితి:
భార్య ధనశ్రీని మోసం చేసానని మీడియాలు కథనాలు వేయడం తనలో ఆందోళన పెంచిందని చాహల్ అన్నారు. రోజుకు 2గం.లు మాత్రమే నిదురించేవాడిని.. తీవ్ర ఒత్తిడి నిద్ర చక్రాన్ని కూడా ప్రభావితం చేసింది. క్రికెట్ నుంచి కొంతకాలం దూరంగా ఉండాలనుకున్నానని కూడా చాహల్ అన్నారు. ``నాకు ఆత్మహత్య ఆలోచనలు వచ్చేవి.. 2 గంటలు మాత్రమే నిద్రపోయేవాడిని.. 40-45 రోజుల పాటు ఇదే పరిస్థితి. ఆటపైనా దృష్టి పెట్టలేకపోయాను`` అని అతడు అన్నారు. అప్పటికే కెరీర్ పరంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న చాహల్ క్రికెట్ లో రాణించలేక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్న సమయంలో వ్యక్తిగత జీవితంలో సమస్య నిద్ర కోల్పోయేందుకు కారణమైంది. ఆత్మహత్యకు ప్రేరేపించింది.
జీవితంలో ఎప్పుడూ మోసం చేయలేదు:
కొందరు మీడియా జర్నలిస్టులు తమ ఎజెండాను రుద్దడానికి, వారి సోషల్ మీడియాల ట్రాఫిక్ ని పెంచుకోవడానికి తప్పుడు కథనాలు ప్రచురించారని కూడా చాహల్ ఆవేదన చెందాడు. తనను మోసగాడిగా మీడియా చిత్రీకరించడం బాధ కలిగించిందని అన్నారు. తన సోదరీమణులు, తల్లితో కలిసి పెరడగం వల్ల తనకు విలువలు తెలుసునని , మహిళలను అత్యంత విలువైన వారిగా చూస్తానని అన్నారు. నేను నా జీవితంలో ఎప్పుడూ మోసం చేయలేదు. నా అంత నమ్మకమైనవాడిని మరొకరిని కనుగొనలేరు. నేను నా సన్నిహితుల కోసం హృదయం, ఆత్మను పెట్టి ఆలోచిస్తాను. నేను డిమాండ్ చేయను. ఎల్లపుడూ ఇస్తాను. కానీ ఇవేవీ తెలియని వారు నన్ను నిందిస్తారని చాహల్ అన్నారు. మహిళలతో పెరిగాను కాబట్టి, వారిని ఎలా గౌరవించాలో తెలుసు.. నా చుట్టూ ఉన్నవారి నుంచి జీవిత పాఠాలు నేర్చుకున్నాను అని అన్నారు. నా పేరును ఎవరితోను ముడిపెట్టి రాయాల్సిన అవసరం లేదని అన్నారు.
డిసెంబర్ 2020లో చాహల్- ధనశ్రీ వివాహం జరిగింది. 20 మార్చి 2025 నాటికి చట్టబద్ధంగా ఈ జోడీ విడాకులు తీసుకున్నారు.