కుర్రాళ్లోయ్.. కుర్రాళ్లు.. ఐపీఎల్-18లో కిర్రాక్ గాళ్లు

ఈ ఐపీఎల్ లోనే ఎంట్రీ ఇచ్చినా ఎంతో అనుభవం ఉన్నవారిలా రెచ్చిపోతున్నారు.;

Update: 2025-04-02 10:34 GMT

రిటైన్ చేసుకున్న వారూ కాదు.. వేలంలో రూ.కోట్లకు కోట్లు పెట్టి కొనలేదు.. పెద్దగా అనుభవం ఉన్నవారు కాదు.. కానీ, గ్రౌండ్ లో దిగితే పెద్ద పెద్ద స్టార్ల కంటే అదరగొడుతున్నారు. రూ.కోట్లకు కోట్లు పెట్టి కొనుక్కున్నవారు.. రిటైన్ చేసుకున్నవారు కనీసం రాణించలేకపోతుంటే.. అనామకులుగా వచ్చిన వీరు అదరగొడుతున్నారు. ఈ ఐపీఎల్ లోనే ఎంట్రీ ఇచ్చినా ఎంతో అనుభవం ఉన్నవారిలా రెచ్చిపోతున్నారు.

అందరూ సాధారణ నేపథ్యం వారే..

ఈ ఐపీఎల్ లో అదరగొడుతున్న వారు విఘ్నేష్ పుత్తూర్ (ముంబై ఇండియన్స్), విప్రజ్ నిగమ్ (డిల్లీ క్యాపిటల్స్), ప్రియాంష్ ఆర్య (పంజాబ్ కింగ్స్), అనికేత్ వర్మ (సన్‌రైజర్స్ హైదరాబాద్), జీషాన్ అన్సారీ (సన్‌రైజర్స్ హైదరాబాద్) – బౌలర్, అశ్వనీ కుమార్ (ముంబై ఇండియన్స్). వీరంతా సాధారణ నేపథ్యం ఉన్నవారే. వీరిలో విఘ్నేష్ ఆటో డ్రైవర్ కుమారుడు కావడం గమనార్హం. ప్రియాంష్ ఆర్య తప్ప అన్ క్యాప్డ్ ఆటగాళ్లయిన వీరిని రూ.30 లక్షలకు తీసుకోవడం గమనార్హం.

కేరళకు చెందిన ఇక విఘ్నేష్ 24 ఏళ్ల ఎడమ చేతి మణికట్టు స్పిన్నర్. చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్‌ లో 4 ఓవర్లలో 32 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. రెండు విధాలుగా బంతిని తిప్పే సత్తా విఘ్నేష్ సొంతం. మంచి స్పిన్నర్ కోసం వెదుకుతున్న ముంబై విఘ్నేష్ రూపంలో సమాధానం దొరికింది.

యూపీకి చెందిన విప్రజ్ నిగమ్ 20 ఏళ్ల కుర్రాడు. లక్నో సూపర్ జెయింట్స్ పై ఇన్నింగ్స్ ప్రారంభించి 15 బంతుల్లోనే 39 పరుగులు సాధించాడు. అశుతోష్ శర్మతో కలిసి 210 పరుగుల లక్ష్యాన్ని చేధించడంలో కీలక పాత్ర పోషించాడు. మరో మ్యాచ్ లో 12 బంతుల్లో 39 పరుగులు సాధించాడు. ఒత్తిడిలో రాణించడం విప్రజ్ గొప్పదనం. దూకుడుగా, భయం లేకుండా ఆడే విప్రజ్ బౌలింగ్ కూడా ఢిల్లీ జట్టుకు ప్లస్ గా మారింది.

ప్రియాంష్ ఆర్య ఎడమచేతి ఓపెనర్. ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌ (డీపీఎల్)లో ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టాడు. వేలంలో రూ.3.80 కోట్లు ధర పలికాడు. గుజరాత్ టైటాన్స్ పై 23 బంతుల్లో 47 పరుగులు చేశాడు. మొదటి బంతి నుంచే దాడి చేసే ఆర్య.. అన్ని షాట్లు కొట్టగలిగే సత్తా ఉన్నవాడు. పంజాబ్ కు ఇప్పుడు ఇతడో కీలక ప్లేయర్.

సన్ రైజర్స్ హిట్టర్

యూపీలోని ఝాన్సీలో పుట్టినా దేశవాళీల్లో మధ్యప్రదేశ్‌ కు ఆడే అనికేత్ వర్మ సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున సాగించిన హార్డ్ హిట్టింగ్ ను ఇటీవల అందరూ చూశారు. లక్నోపై తన తొలి మ్యాచ్‌ లో 13 బంతుల్లో 36 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సిక్సర్లు ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ పై 41 బంతుల్లో 74 పరుగులు బాదాడు. సన్ రైజర్స్ బ్యాటింగ్ ఆర్డర్ లో ఇకపై అనికేత్ ను ముందుగా పంపినా ఆశ్చర్యం లేదు.

సన్ రైజర్స్ కే చెందిన జీషాన్ అన్సారీ ఢిల్లీ తో మ్యాచ్‌లో 42 పరుగులకు 3 వికెట్లు తీశాడు. ఇతడి వికెట్ టేకింగ్ సామర్థ్యం బాగుంది. పాట్ కమ్మిన్స్, మొహమ్మద్ షమీ వంటి అనుభవజ్ఞులైన బౌలర్ల సహచర్యం అన్సారీకి మేలు చేసేదే.

ముంబై కుర్రాడు అశ్వనీ కుమార్ కోల్‌కతా నైట్ రైడర్స్ పై 24 పరుగులకు 4 వికెట్లు తీసి తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు. దీంతో కోల్ కతాపై ముంబై తేలిగ్గా గెలిచింది.

ఈ సారి లీగ్ లో ఇలాంటి కుర్రాళ్లే మెరుపు వీరులు. సీనియర్లు విఫలమైనా యువ రక్తం మాత్రం టోర్నీని ఆసక్తికరంగా మార్చింది.

Tags:    

Similar News