1939 తర్వాత టెస్టు మ్యాచ్ 4వ ఇన్నింగ్స్ లో టాప్ స్కోరు..
న్యూజిలాండ్ తో తొలి టెస్టులో వెస్టిండీస్ మొదటి నుంచి వెనుకబడి ఉంది. ఆతిథ్య జట్టును 231 పరుగులకే ఆలౌట్ చేసినా.. వెస్టిండీస్ 167 పరుగులకే ఆలౌట్ అయింది.;
టార్గెట్ 531... ఇంకా రెండు రోజుల ఆట ఉంది.. 72 పరుగులకే నాలుగు ప్రధాన వికెట్లు డౌన్..! మిగిలింది కెప్టెన్, మరో బ్యాటర్ మాత్రమే. మిగతా అంతా లోయర్ ఆర్డరే. అవతలి బౌలర్లు చెలరేగుతున్నారు. ఈ లెక్కన చూస్తే ఆ జట్టు ఏ 150కో ఆలౌట్ కావాలి. కానీ, ఫలితం డ్రా..! దాదాపు రెండు రోజులు బ్యాటింగ్ చేసిన ఆల్ రౌండర్ అజేయంగా డబుల్ సెంచరీ బాదేశాడు. చాలా కాలం తర్వాత జట్టులోకి వచ్చిన 37 ఏళ్ల పేసర్ హాఫ్ సెంచరీ చేయడమే కాదు.. ఏకంగా 233 బంతులు ఆడాడు. మరికొంత సమయం ఉంటే... ఆ జట్టు 531 కూడా కొట్టేసేదేమో..? ఇదీ టెస్టుల మజాను చాటుతూ మ్యాచ్ జరిగిన తీరు..! ఇందులో డ్రా చేసిన జట్టు వెస్టిండీస్. అవతలి జట్టు న్యూజిలాండ్. మొన్నమొన్ననే భారత్ కు వచ్చి రెండు టెస్టుల్లోనూ ఓడిపోయి క్లీన్ స్వీప్ పరాభవం ఎదుర్కొన్న వెస్టిండీస్.. ఇప్పుడు న్యూజిలాండ్ వెళ్లి తొలి టెస్టును భారీ టార్గెట్ ఒత్తిడిని తట్టుకుంటూ డ్రా చేసి ఔరా అనిపించింది. ఇదంతా క్రైస్ చర్చ్ మైదానంలో జరిగింది.
మ్యాచ్ లో బాగా వెనుకబడినా...
న్యూజిలాండ్ తో తొలి టెస్టులో వెస్టిండీస్ మొదటి నుంచి వెనుకబడి ఉంది. ఆతిథ్య జట్టును 231 పరుగులకే ఆలౌట్ చేసినా.. వెస్టిండీస్ 167 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో కివీస్ 466/8 భారీ స్కోరు చేసి డిక్లేర్ చేసింది. వెస్టిండీస్ ముందు 531 పరుగుల అతిభారీ టార్గెట్ పెట్టింది. అప్పటికీ రెండు రోజుల సమయం ఉండడంతో వెస్టిండీస్ దారుణంగా ఓడిపోవడం ఖాయం అనుకున్నారు. అదేసమయంలో 4 వికెట్లను 72 పరుగులకే కోల్పోయింది. అయితే, ఈ సమయంలో కెప్టెన్ షై హోప్ (234 బంతుల్లో 140, 15 ఫోర్లు, 2 సిక్సులు), ఆల్ రౌండర్ జస్టిన్ గ్రీవ్స్ (388 బంతుల్లో 202 నాటౌట్, 19 ఫోర్లు) అద్భుతంగా పోరాడారు. వీరు ఐదో వికెట్ కు 196 పరుగులు జోడించారు. 268 పరుగుల వద్ద హోప్, ఆ వెంటనే వికెట్ కీపర్ ఇమ్లాచ్ (4) కూడా ఔట్ అయ్యారు. ఇంకా సగం లక్ష్యం, దగ్గరదగ్గరగా రోజు ఆట ఉండడంతో వెస్టిండీస్ కు ఓటమి తప్పదని భావించారు. కానీ, మరో అద్భుతం జరిగింది.
37 ఏళ్ల వయసులో..
కీమర్ రోచ్.. 37 ఏళ్ల ఈ పేస్ బౌలర్ వెస్టిండీస్ తరఫున 284 వికెట్లు తీశాడు. ఈ ఏడాది జనవరిలో పాకిస్థాన్ తో టెస్టుకు ముందు చాలాకాలం జట్టుకు దూరమయ్యాడు. అయితే, ఇతర బౌలర్లు గాయపడడంతో మళ్లీ పిలుపు దక్కింది. ఇటీవలి భారత పర్యటనకు మాత్రం రాలేదు. తాజాగా న్యూజిలాండ్ తో టెస్టు బరిలో దిగిన రోచ్.. ఏకంగా 233 బంతులు ఎదుర్కొని 58 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. టెస్టు కెరీర్ లో అతడికి ఇదే మొదటి హాఫ్ సెంచరీ, అత్యధిక స్కోరు కావడం విశేషం.
-మొత్తంగా వెస్టిండీస్ 457 పరుగులకు 6 వికెట్లు చేసి టెస్టును డ్రాగా ముగించింది. క్రికెట్ చరిత్రలో నాలుగో ఇన్నింగ్స్ లో ఇది రెండో అత్యధిక స్కోరు. 1939లో ఇంగ్లండ్.. దక్షిణాఫ్రికాపై 5 వికెట్లకు 654 పరుగులు చేయడం రికార్డుగా ఉంది. ఓటమి తప్పని కఠిన పరిస్థితుల్లో వెస్టిండీస్ చేసిన అద్భుత డ్రా చరిత్రలో నిలిచిపోయింది.