WCL 2025 : చరిత్రలోనే అత్యంత ఖరీదైన జెర్సీతో క్రిస్ గేల్, కిరోన్ పొలార్డ్

క్రికెట్ అభిమానులకు ఓ పండుగ వాతావరణాన్ని తీసుకురాబోతున్న వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) 2025 పోటీలకు రంగం సిద్ధమైంది.;

Update: 2025-07-19 04:45 GMT

క్రికెట్ అభిమానులకు ఓ పండుగ వాతావరణాన్ని తీసుకురాబోతున్న వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) 2025 పోటీలకు రంగం సిద్ధమైంది. ఈసారి వెస్టిండీస్ ఛాంపియన్స్ జట్టు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. క్రిస్ గేల్, డీజే బ్రావో, కీరన్ పొలార్డ్ వంటి దిగ్గజాలు కలిసి బరిలోకి దిగనున్న ఈ జట్టు, ఇప్పుడు మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. చరిత్రలోనే అత్యంత ఖరీదైన జెర్సీతో వీరు మైదానంలోకి అడుగుపెట్టనున్నారు.

వెస్టిండీస్ జెర్సీలో 18కే బంగారం.. లగ్జరీకి కొత్త నిర్వచనం

ఈ ప్రత్యేకమైన జెర్సీని 'లోరెంజ్' అనే సంస్థ డిజైన్ చేసింది. ఇందులో అసలైన 18 క్యారెట్ల బంగారాన్ని ఉపయోగించారు. ఈ జెర్సీలు మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటాయి. 30 గ్రాములు, 20 గ్రాములు, 10 గ్రాముల బంగారంతో తయారవుతున్నాయి. ఈ డిజైన్ వెస్టిండీస్ క్రికెట్ వారసత్వాన్ని, దానికి ఎంతో ప్రేరణనిచ్చిన దిగ్గజాల సంస్కృతిని ప్రతిబింబిస్తూ ఒక స్మారక చిహ్నంగా నిలుస్తోంది.

-"ఇది కేవలం క్రీడా దుస్తులు కాదు – ఇది ధరించదగ్గ చరిత్ర"

లోరెంజ్ వ్యవస్థాపకుడు రాజ్ కరణ్ దుగ్గల్ మాట్లాడుతూ, "ఇది కేవలం స్పోర్ట్స్‌వేర్ కాదు. ఇది వెస్టిండీస్ క్రికెట్ వారసత్వానికి అంకితమైన కళాత్మకత, సాంస్కృతిక గౌరవం, క్రీడా ప్రావీణ్యానికి మేళవింపు. ఈ జెర్సీ ప్రపంచ క్రీడా చరిత్రలో లగ్జరీకి కొత్త ప్రమాణంగా నిలుస్తుంది" అని వ్యాఖ్యానించారు.

అభిమానుల కోసం అగ్రశ్రేణి ఆటగాళ్ల సమ్మేళనం

ఈ సీజన్‌లో ఆటగాళ్ల జాబితాను గమనిస్తే, ఇది నిజంగా లెజెండ్స్ ఫెస్టివల్ అని చెప్పొచ్చు. క్రిస్ గేల్, డీజే బ్రావో, కీరన్ పొలార్డ్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, శిఖర్ ధవన్, సురేష్ రైనా, బ్రెట్ లీ, క్రిస్ లిన్, షాన్ మార్ష్, ఇయోయిన్ మోర్గాన్, మొయిన్ అలీ, అలస్టర్ కుక్, ఏబీ డివిలియర్స్, హషీమ్ ఆమ్లా, క్రిస్ మోరిస్, వేన్ పార్నెల్ వంటి ప్రపంచ ప్రఖ్యాత ఆటగాళ్లు ఈ టోర్నీలో పాల్గొననున్నారు.

ఇంగ్లాండ్ అంతటా మైదానాల్లో మహోత్సవం

డబ్ల్యూసీఎల్ 2025 జూలై 18 నుండి ఆగస్టు 2 వరకు ఇంగ్లాండ్‌లోని ప్రముఖ మైదానాలైన బర్మింగ్‌హామ్, నార్తాంప్టన్, లీస్టర్, లీడ్స్‌లలో జరగనుంది. ఈ టోర్నీకి ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) అధికారిక అనుమతి కూడా ఉంది.

- విజయం కోసం పయనం: ఛైర్మన్ అజయ్ సేథీ

వెస్టిండీస్ ఛాంపియన్స్ జట్టు యజమాన్య సంస్థ అయిన ఛానెల్2 గ్రూప్ ఛైర్మన్ అజయ్ సేథీ మాట్లాడుతూ "ఈ జట్టులో అనేక దిగ్గజాలు ఉన్నారు. ఈ జెర్సీ వారి వారసత్వానికి గొప్ప గౌరవ సూచకంగా నిలుస్తుంది. మేము ఈసారి ట్రోఫీ గెలుచుకునేందుకు పట్టుదలతో ఉన్నాము" అని అన్నారు.

డబ్ల్యూసీఎల్ 2025 క్రీడా ప్రేమికులకు ఓ గొప్ప క్రీడా పండుగగా మారనుంది. గొప్ప లెజెండ్స్‌, అద్భుతమైన సదుపాయాలు, చరిత్రలో నిలిచిపోయే జెర్సీలు.. వీటన్నింటితో ఈ టోర్నీ నిజంగా ప్రత్యేకమైనదిగా నిలవనుంది. గత సారి ఇండియాలో జరిగిన ఈ టోర్నీ కప్ ను భారత్ గెలుచుకుంది. అయితే నాడు ఇండియాలో ‘పాకిస్తాన్ జట్టు’ పాల్గొనలేదు. ఈసారి ఇంగ్లండ్ లో జరుగనుండడంతో పాకిస్తాన్ కూడా పాల్గొంటోంది. మరి ఈసారి విజేత ఏ జట్టు అన్నది వేచిచూడాలి.

Tags:    

Similar News