మ్యాచ్ లు పుట్టెడు..లీగ్ బారెడు..ఐపీఎల్ పై అక్ర‌మ్ అక్క‌సు

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ స్థాయి చాలా పెద్ద‌ది. ఇక్క‌డ అడ్వ‌ర్ట‌యిజ్ మెంట్ స్పాన్స‌ర్ షిప్ లు, ఆట‌గాళ్ల వేలం విలువ పాకిస్థాన్ సూప‌ర్ లీగ్ తో పోలిస్తే అనేక రెట్లు అధికం.;

Update: 2025-12-11 14:30 GMT

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్).. భార‌త క్రికెట్ ప్ర‌యాణాన్నే కాదు.. ప్ర‌పంచ క్రికెట్ గ‌తినీ మార్చిన లీగ్..! స్టాండ‌ర్డ్స్ కు స్టాండ‌ర్డ్స్.. అట్రాక్ష‌న్ కు అట్రాక్ష‌న్.. డ‌బ్బుకు డబ్బు..! దీంతోనే మిగ‌తా దేశాల వారికి కుళ్లు పుడుతోంది. రూ.ల‌క్ష కోట్ల విలువ‌కు చేరిన మ‌న లీగ్ ను చూస్తే వారికి క‌డుపు మండుతోంది.. ఇక మ‌న ఐపీఎల్ కు పోటీగా పాకిస్థాన్ సూప‌ర్ లీగ్ (పీఎస్ఎల్) అంటూ లీగ్ ను మొద‌లుపెట్టిన పాకిస్థాన్ సాదాసీదా లీగ్ తో స‌రిపెట్టుకుంది. ఈ క్ర‌మంలోనే ఆ దేశ మాజీలు, కెరీర్ కొన‌సాగిస్తున్న క్రికెట‌ర్లు కూడా అక్క‌సు వెళ్ల‌గ‌క్కుతుంటారు. అంద‌రూ అంటే అనుకోవ‌చ్చు గానీ.. పాకిస్థాన్ దిగ్గ‌జ బౌల‌ర్, మంచి వ్య‌క్తిగా పేరున్న వ‌సీం అక్ర‌మ్ కూడా తాజాగా ఇదే విధంగా మాట్లాడ‌డం విస్తుగొలుపుతోంది. భార‌తీయుల‌తో పాటు క్రికెట్ అభిమానుల ఆగ్ర‌హానికి దారితీశాయి. ప్ర‌స్తుతం అక్ర‌మ్ వ్యాఖ్య‌ల‌పై సోషల్ మీడ‌యాలో పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతోంది. పైగా అత‌డు ఈ మాట‌ల‌న్న‌ది కూడా పాకిస్థాన్ సూప‌ర్ లీగ్ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మంలో కావ‌డంతో ఇదేం ప‌ద్ధ‌తి అంటూ విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

ఇదేం తీరు?

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ స్థాయి చాలా పెద్ద‌ది. ఇక్క‌డ అడ్వ‌ర్ట‌యిజ్ మెంట్ స్పాన్స‌ర్ షిప్ లు, ఆట‌గాళ్ల వేలం విలువ పాకిస్థాన్ సూప‌ర్ లీగ్ తో పోలిస్తే అనేక రెట్లు అధికం. ఒక్క‌మాట‌లో చెప్పాలంటే ఐపీఎల్ లో అమ్ముడ‌వ‌ని కొంద‌రు ఆట‌గాళ్లు పీఎస్ఎల్ కు వెళ్తారు. కానీ, అక్ర‌మ్.. ఐపీఎల్ ను పీఎస్ఎల్ ను పోలుస్తూ వ్యాఖ్య‌లు చేశాడు. పీఎస్ఎల్ షెడ్యూల్ 34-40 రోజులు మాత్ర‌మేన‌ని, దీంతో లీగ్ యాక్టివ్ గా ఉంటుంద‌ని.. అభిమానుల నుంచి కూడా మంచి స్పంద‌న వ‌స్తుంద‌ని విశ్లేషించాడు. ఇదే స‌మ‌యంలో సుదీర్ఘ లీగ్ లు ఆట‌గాళ్లు, స‌హాయ సిబ్బందిని అల‌సి పోయేలా చేస్తాయ‌ని వ్యాఖ్యానించాడు.

ప‌రోక్షంగా ప్ర‌స్తావించి...

చ‌ర్చా కార్య‌క్ర‌మంలో ఐపీఎల్ గురించి మొదట ప్ర‌స్తావించ‌ని అక్ర‌మ్... “బచ్చే బడే హో జాతే హై, వో లీగ్ ఖతం హి నహీ హోతి” అని వ్యాఖ్యానించాడు. మ్యాచ్ లు ఎక్కువైతే ఆ లీగ్ సుదీర్ఘంగా సాగుతుంద‌నే అర్థంలో మాట్లాడాడు. త‌ర్వాత ఫార్మాట్, పోటీ స్థాయి గురించి పోల్చే స‌మ‌యంలో ఐపీఎల్ గురించి నేరుగా ప్ర‌స్తావించాడు. సాధార‌ణంగా ప‌ది జ‌ట్ల‌తో ఉన్న ఐపీఎల్ రెండు నెల‌లకు పైగా సాగుతుంది. 2025లో 65 రోజుల‌కు పైగా జ‌రిగింది. పీఎస్ఎల్ మాత్రం నెల రోజుల్లోనే ముగిసింది. ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్)ను కూడా నిడివి త‌గ్గించార‌ని అక్ర‌మ్ చెప్పాడు.

ఐపీఎల్ తో పీఎస్ఎల్ కు పోలికా?

ఐపీఎల్ ను త‌క్కువ చేసే ఉద్దేశంలోనో ఏమో..? పీఎస్ఎల్ క్వాలిటీ గురించి ప్ర‌స్తావించాడు అక్ర‌మ్. ఈ లీగ్ లో ఆడిన చాలామంది విదేశీయులు ఇక్క‌డి ప్ర‌మాణాల‌ను పోటాపోటీగా సాగే మ్యాచ్ ల‌ను ప్ర‌శంసిస్తున్నార‌ని తెలిపాడు. స్వ‌చ్ఛ‌మైన ప్రతిభ‌లో పీఎస్ఎల్ నంబ‌ర్ వ‌న్ అని గొప్ప‌లు పోయాడు. దీంతో అక్ర‌మ్ పై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. ఒక‌ప్పుడు ఐపీఎల్ లో అత‌డు పాల్గొన్న సంగతిని గుర్తుచేస్తూ.. ఆ లీగ్ ను అవ‌మానించ‌డం స‌రికాద‌ని అంటున్నారు. ఇంకొంద‌రు ఐపీఎల్ ను పీఎస్ఎల్ తో పోల్చ‌డం పెద్ద జోక్ గా అభివ‌ర్ణిస్తున్నారు. త‌న విశ్లేష‌ణ వివాదం కావ‌డంతో అక్ర‌మ్ రంగంలోకి దిగాడు. చాలామంది ఆట‌గాళ్లు ఇప్ప‌టికే మాట్లాడిన దానినే తాను చెప్పిన‌ట్లు తెలిపాడు.

Tags:    

Similar News