ఓటముల ఎఫెక్ట్.. మళ్లీ టెస్టుల్లోకి టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్!
ఈ క్రమంలోనే ఇటీవల టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ బ్యాటర్ ను ఆ నిర్ణయం వెనక్కుతీసుకోవాలని కోరనుందట..! ఈ మేరకు ఓ క్రికెట్ వెబ్ సైట్ కథనం ఇచ్చింది.;
ఏడాదిలో స్వదేశంలో రెండు వైట్ వాష్ లు.. ఒకటి చరిత్రలో ఆ జట్టుపై తొలిసారి అయితే.. మరొకటి 25 ఏళ్ల తర్వాత..! విదేశాల్లోనూ సిరీస్ ఓటమి..! జట్టు బ్యాటింగ్ ఆర్డర్ లో స్థిరత్వం లోపం..! మిడిలార్డర్ లో పట్టుమని ఒక సెషన్ ఆడగల బ్యాటర్ లేడు..! దీంతోనే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఒక ఆలోచనకు వచ్చిందట..! టెస్టుల్లో ఇలాగే టీమ్ ఇండియా ఓటములు పరంపర కొనసాగితే విమర్శలు తప్పవని భావించినట్లు కనిపిస్తోందట..! ఈ క్రమంలోనే ఇటీవల టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ బ్యాటర్ ను ఆ నిర్ణయం వెనక్కుతీసుకోవాలని కోరనుందట..! ఈ మేరకు ఓ క్రికెట్ వెబ్ సైట్ కథనం ఇచ్చింది. ఇదే నిజమైతే.. అభిమానులు ఎంతగానో ప్రేమించే ఆ స్టార్ క్రికెటర్ మళ్లీ టెస్టు ఫార్మాట్ లో కనిపించే చాన్సుంది. మరో రెండేళ్లయినా సంప్రదాయ ఫార్మాట్లో కొనసాగే ఫామ్, ఫిట్ నెస్ ఉన్న అతడు ఇప్పటికే వందకు పైగా టెస్టులు ఆడాడు. అయితే, ఈ ఫార్మాట్ లో మైలురాయిగా పరిగణించే పదివేల పరుగుల రికార్డును మాత్రం అందుకోలేకపోయాడు. మళ్లీ ఇప్పుడు టెస్టు జట్టులోకి వస్తే ఈ రికార్డును చేరే చాన్స్ ఉంది.
123.. 9,230..
టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఈ ఏడాది మే నెలలో అనూహ్యంగా టెస్టు ఫార్మాట్ కు గుడ్ బై చెప్పాడు. తాను ఎంతగానో ఇష్టపడే టెస్టులకు, అదికూడా ఇంగ్లండ్ టూర్ ముంగిట కోహ్లి తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీనివెనుక కొన్ని కథనాలు కూడా వచ్చాయి. స్వదేశంలో న్యూజిలాండ్ తో వైట్ వాష్, ఆస్ట్రేలియా టూర్ లో పదేపదే ఒకే విధంగా ఔట్ అయి వైఫల్యం చెందడం తదితర కారణాలతో ఇంగ్లండ్ టూర్ కు కోహ్లి ఎంపిక కష్టమేనని హెడ్ కోచ్, సెలక్టర్ల నుంచి మెసేజ్ వెళ్లడంతోనే కోహ్లి టెస్టుల నుంచి వైదొలగాడని భావించారు. కెరీర్లో 123 టెస్టులు ఆడిన కోహ్లి 9,230 పరుగులు చేసిన అతడు.. పదివేల పరుగుల మైలురాయి చేరిన దిగ్గజాలు సచిన్ టెండూల్కర్ (15,921), రాహుల్ ద్రవిడ్ (13,265), సునీల్ గావస్కర్ (10,122) సరసన చేరుతాడని అనుకున్నారు. కానీ, రిటైర్మెంట్ తో సాధ్యం కాలేదు.
కోహ్లి సిద్ధమే.. మరి మళ్లీ వస్తాడా?
భారత క్రికెట్ లో రిటైర్మెంట్ ఇచ్చిన ఒక ఆటగాడిని మళ్లీ ఆలోచన వెనక్కు తీసుకోమనడం ఉండదు. అయితే, కోహ్లి విషయంలో మాత్రం అరుదైన నిర్ణయానికి అవకాశం ఉందని చెబుతున్నారు. కోహ్లి వస్తే గనుక మిడిలార్డర్ లో టెస్టు బ్యాటింగ్ బలపడుతుందని బీసీసీఐ ఆలోచిస్తోంది. దీనికి కోహ్లి కూడా ఓకే చెబుతాడని అంటున్నారు. మరి బీసీసీఐ ఆలోచన ఎలా ఉన్నా.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అంగీకారం కూడా ముఖ్యమే. కోహ్లి పునరాగమనాన్ని గంభీర్ ఎలా తీసుకుంటాడో చూడాలి. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో మెరుగైన ప్రతిభ చాటుతున్న కుర్రాళ్లను కాదని కోహ్లిని వెనక్కు పిలవడంపై విమర్శలు కూడా రావొచ్చు. చూడాలి ఏం జరగనుందో?