విరాట్ కోహ్లి కొత్త పెట్టుబడి..రూ.300 కోట్ల అడిడాస్ డీల్ కు బైబై
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి..! ఈ సామెత తెలుగుదే అయినా ప్రపంచం అంతటా అన్ని రంగాలవారూ ఫాలో అవుతుంటారు.;
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి..! ఈ సామెత తెలుగుదే అయినా ప్రపంచం అంతటా అన్ని రంగాలవారూ ఫాలో అవుతుంటారు. అందుకే కెరీర్ ఉన్నంతగా ఉన్నప్పుడే, రెండు చేతులా సంపాదన ఉండగానే ప్రొఫెషనల్స్ అందరూ వివిధ రంగాల్లో పెట్టుబడులు పెడుతుంటారు. ఇలాంటివారిలో అధిక ఆదాయం ఉండే క్రికెట్ ప్లేయర్స్ ముందుంటారు. దీనికి తాజా నిదర్శనం... టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిలు. కేవలం బీసీసీఐ నుంచే రూ.7 కోట్ల యాన్యువల్ కాంట్రాక్టు ఉన్న కోహ్లి... ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ద్వారా, వివిధ బ్రాండ్లకు ప్రచారకర్తగా రూ.వందల కోట్లలో సంపాదిస్తున్నాడు. ఎంతో ముందుచూపుతో ఇప్పటికే సొంత స్పోర్ట్స్ బ్రాండ్ వన్ 8ను మొదలుపెట్టాడు కోహ్లి. దీంతోపాటు ఎనిమిదేళ్లుగా ప్రముఖ స్పోర్ట్స్ బ్రాండ్ ప్యూమాకు అంబాసిడర్ గా ఉన్నాడు. దీని విలువ ఎంతో తెలిస్తే ఔరా అనకుండా ఉండలేరు.
ముగిసిందా ఒప్పందం?
రూ.300 కోట్లతో ప్యూమా వంటి ఇంటర్నేషనల్ బ్రాండ్ తో 8 ఏళ్ల బంధానికి కోహ్లి తెరదించాడా? లేదంటే కెరీర్ చరమాంకంలో ఉన్న అతడితో ఒప్పందం పొడిగించేందుకు ప్యూమా సిద్ధంగా లేదా అన్నది తెలియాల్సి ఉంది. అయితే, సొంత బ్రాండ్ ద్వారా రూ.40 కోట్లను మరో సంస్థలో పెట్టుబడిగా పెట్టాడు. దాని పేరు అజిలిటాస్ స్పోర్ట్స్. అంటే.. అటు పర్సనల్ లైఫ్ స్టయిల్ ఇటు అథ్లెటిజర్ దుస్తుల రంగంలో ఉన్న వన్ 8 ముందుముందు అజిలిటాస్ తో కలిసి సాగనుంది అన్నమాట. తద్వారా కోహ్లి కొత్త వ్యాపార ప్రయాణం మొదలుపెట్టాడు. ఇదే విషయాన్ని అతడు తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నాడు. వన్ 8ను అజిలిటాస్ ముందుకుతీసుకెళ్తుందని పేర్కొన్నాడు.
భారతీయుడి సంస్థే..
అజిలిటాస్.. ఎవరిదో కాదు. భారతీయుడిదే. అది కూడా మొన్నటివరకు కోహ్లి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ప్యూమా ఇండియాకు మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేసిన అభిషేక్ గంగూలీ అనే వ్యక్తిది. స్పోర్ట్స్ వేర్ స్టార్టప్ అయిన అజిలిటాస్ కు అభిషేక్ కో ఫౌండర్. వన్ 8తో కలిసి పనిచేయాలనుకున్నప్పుడు అభిషేక్.. అజిలిటాస్ గురించి పూర్తిగా చెప్పాడని కోహ్లి పేర్కొన్నాడు. నైపుణ్యం, వ్యక్తులు, శక్తియుక్తులు, తయారీ సామర్థ్య తదితరాల గురించి అవగాహన వచ్చాక తానూ భాగంగా మారాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.
వాటా చిన్నదే..
రూ.40 కోట్ల పెట్టుబడితో కోహ్లి అజిలిటాస్ లో మైనారిటీ వాటాదారుడు కానున్నాడు. ఇదే విషయాన్ని అభిషేక్ గంగూలీ కూడా ధ్రువీకరించాడు. రూ.300 కోట్ల ప్యూమా డీల్ గురించి కాక.. భవిష్యత్ లో లాభాలు ఆర్జించి పెట్టగల అజిలిటాస్ పై ఫోకస్ పెట్టాడని వివరించాడు.