ప్ర‌పంచక‌ప్ లో కోహ్లి.. టీమ్ ఇండియా స్టార్ చుట్టూ తీవ్ర‌స్థాయి చ‌ర్చ‌

భార‌త క్రికెట్ లో 15 ఏళ్లుగా విడ‌దీయ‌రాని భాగం అయ్యాడు విరాట్ కోహ్లి. వంద‌కు పైగా టెస్టులు.. టి20 ప్ర‌పంచ క‌ప్ చాంపియ‌న్, కెప్టెన్ గా ఎన్నో విజ‌యాలు, ఆట‌గాడిగా మ‌రెన్నోమైలురాళ్లు.. ఇదీ కోహ్లి గొప్ప‌ద‌నం.;

Update: 2025-08-03 12:22 GMT

దాదాపు 14 నెల‌ల కింద‌టే టి20ల నుంచి రిటైర్.. మూడు నెల‌ల కింద‌ట త‌న‌కెంతో ఇష్ట‌మైన‌, అత్యంత కీల‌క‌మైన‌ ఇంగ్లండ్ టూర్ ముందు టెస్టుల నుంచి రిటైర్.. కానీ, అత‌డు మాత్రం ఇంకా హాట్ టాపిక్ గానే ఉన్నాడు. ఇప్ప‌టికీ అత‌డు టీమ్ఇండియాలో లేడంటే న‌మ్మ‌నివారు త‌క్కువే. మ‌ళ్లీ ఇప్పుడు వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ లో త‌న ప్రాతినిధ్యం ఉంటుంద‌నే క‌థ‌నాలు వ‌స్తున్నాయి.

*కోహ్లి*నూర్ లేకుండా...

భార‌త క్రికెట్ లో 15 ఏళ్లుగా విడ‌దీయ‌రాని భాగం అయ్యాడు విరాట్ కోహ్లి. వంద‌కు పైగా టెస్టులు.. టి20 ప్ర‌పంచ క‌ప్ చాంపియ‌న్, కెప్టెన్ గా ఎన్నో విజ‌యాలు, ఆట‌గాడిగా మ‌రెన్నోమైలురాళ్లు.. ఇదీ కోహ్లి గొప్ప‌ద‌నం. అలాంటివాడు వ‌న్డేల‌కు మాత్ర‌మే అందుబాటులో ఉండ‌నున్నాడు. 36 ఏళ్ల కోహ్లి టెస్టుల‌కు కూడా వీడ్కోలు ప‌లుకుతాడ‌ని ఈ ఏడాది మే వ‌ర‌కు ఎవ‌రూ ఊహించ‌లేదు. అంత‌కుముందు టి20ల నుంచి త‌ప్పుకొన్నా పెద్ద‌గా ఆశ్చ‌ర్య‌పోలేదు కానీ.. టెస్టుల‌కు మాత్రం గుడ్ బై ప‌లుకుతాడ‌ని భావించ‌లేదు. దీంతో కోహ్లి లేకుండానే టీమ్ ఇండియా ప్ర‌స్తుతం ఇంగ్లండ్ లో టెస్టు సిరీస్ ఆడింది.

కోహ్లి మ‌ళ్లీ ఎప్పుడు..?

కోహ్లి వ‌న్డేలు మాత్ర‌మే ఆడ‌తాడు. కానీ, అస‌లు వ‌న్డేలు ఎక్క‌డ జ‌రుగుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో చాంపియ‌న్స్ ట్రోఫీ అనంత‌రం టీమ్ ఇండియా ఆరు నెల‌లుగా ఒక్క వ‌న్డే కూడా ఆడ‌లేదు. అస‌లు ప్ర‌పంచ క్రికెట్ లోనే వ‌న్డేలు చాలా త‌క్కువ‌. భార‌త్ మ‌ళ్లీ వ‌న్డేలు ఆడేది న‌వంబ‌రులో ఆస్ట్రేలియాతో. వాస్త‌వానికి ఈ నెల‌లో బంగ్లాదేశ్‌లో ప‌ర్య‌టించాల్సి ఉన్నా.. అక్క‌డి ప‌రిస్థితుల కార‌ణంగా టూర్ క్యాన్సిల్ అయింది. దీంతో కోహ్లిని మ‌ళ్లీ టీమ్ఇండియా జెర్సీలో చూసేది ఆస్ట్రేలియాతో మూడు వ‌న్డేల సిరీస్ లోనే.

వ‌చ్చే ప్ర‌పంచ క‌ప్ ప‌రిస్థితి ఏమిటి?

కోహ్లితో పాటు టీమ్ఇండియా వ‌న్డే కెప్టెన్ రోహిత్ శ‌ర్మ కూడా టెస్టుల‌కు వీడ్కోలు ప‌లికాడు. అత‌డు కూడా టి20ల‌కు మాత్ర‌మే అందుబాటులో ఉంటాడు. రోహిత్ ను కూడా ఆస్ట్రేలియాతో సిరీస్ లోనే చూసే చాన్సుంది. అయితే, వీరిద్ద‌రిలో 38 ఏళ్ల రోహిత్ వచ్చే వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ ఆడ‌డం క‌ష్ట‌మే. కానీ, కోహ్లికి ఇప్పుడు 36 ఏళ్లే. వ‌చ్చే ప్ర‌పంచ‌క‌ప్ 2027 న‌వంబ‌రులో ద‌క్షిణాఫ్రికా, జింబాబ్వే, న‌మీబియాల్లో జ‌ర‌గ‌నుంది. అప్ప‌టికి స‌రిగ్గా 39 ఏళ్ల వ‌య‌సుకు వ‌స్తాడు కోహ్లి. ఫామ్ ప్ర‌కారం కంటే ఫిట్ నెస్ లోనే ప్ర‌స్తుతం కోహ్లి టాప్ లో ఉన్నాడు. అందుకే వ‌చ్చే ప్ర‌పంచ క‌ప్ ఆడ‌తాడ‌ని అంటున్నారు. ఏది ఏమైన‌దీ.. ఈ ఏడాది ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో కోహ్లి ఆడే తీరును బ‌ట్టి తెలిసిపోతుంది. అయితే, దీనికిముందే 2027 ప్ర‌పంచ‌క‌ప లో అత‌డి ప్రాతినిధ్యంపై క‌థ‌నాలు వ‌స్తున్నాయి.

Tags:    

Similar News