టీమ్ ఇండియాకు కొత్త‌ స్పాన్స‌ర్.. రంగంలో దిగ్గ‌జ ఆటో మేక‌ర్

ఏడాదికి రూ.358 కోట్లు... ఇదేదో సాధార‌ణ ఒప్పందం కాదు.. ప్ర‌పంచంలోనే అత్యంతా ఆదర‌ణ ఉన్న టీమ్ ఇండియా డ్రీమ్ 11 సంస్థ స్పాన్స‌ర్ షిప్ ప్ర‌స్తుత విలువ‌.;

Update: 2025-08-26 06:50 GMT

ఏడాదికి రూ.358 కోట్లు... ఇదేదో సాధార‌ణ ఒప్పందం కాదు.. ప్ర‌పంచంలోనే అత్యంతా ఆదర‌ణ ఉన్న టీమ్ ఇండియా డ్రీమ్ 11 సంస్థ స్పాన్స‌ర్ షిప్ ప్ర‌స్తుత విలువ‌. ఇంకా ఏడాదికి పైగా స‌మ‌యం ఉంది. కానీ, ఇంత‌లో ఆల్ లైన్ గేమ్ ల‌ను నిషేధిస్తూ కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోవ‌డంతో వైదొల‌గాల్సి వ‌చ్చింది. ఈ క్ర‌మంలో బీసీసీఐ కొత్త స్పాన్స‌ర్ ను వెదుక్కోవాల్సి వ‌స్తోంది.

ఆసియా క‌ప్ ముంగిట‌..

టి20 ఫార్మాట్లో ఆసియా క‌ప్ సెప్టెంబ‌రు 9 నుంచి జ‌ర‌గ‌నుంది. ఇదే స‌మ‌యంలో డ్రీమ్ 11 వైదొల‌గ‌డంతో అస‌లు స్పాన్స‌ర్ లోగో లేకుండానే టీమ్ ఇండియా ఆడాల్సి వ‌స్తోంది. ప్ర‌పంచంలోనే అత్యంత ధ‌నిక బోర్డుకు చెందిన జ‌ట్టు ఖాళీ జెర్సీతో మైదానంలోకి దిగ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌య‌మే. ఇప్ప‌టికిప్పుడు ప్ర‌య‌త్నాలు మొద‌లైనా కొత్త స్పాన్స‌ర్ ల‌భించ‌డం క‌ష్ట‌మే. తాత్కాలికంగా ఆసియా క‌ప్ వ‌ర‌కు ఒక స్పాన్స‌ర్ ను దొర‌క‌బ‌ట్టే ఆలోచ‌న ఉండొచ్చు. మ‌రోవైపు డ్రీమ్ 11తో ఒప్పందం ముగిసింద‌ని, కొత్త స్పాన్సర్ ను వెదుకుతున్నామ‌ని బీసీసీఐ కార్య‌ద‌ర్శి సైకియా తెలిపారు.

డ్రీమ్ 11కు బాధ్య‌త లేన‌ట్లే... మై11 కూడా ఔటే...

టీమ్ ఇండియా స్పాన్స‌ర్ గా ఒప్పందం ప్ర‌కారం.. ఏడాది గ‌డువున్న‌ప్ప‌టికీ డ్రీమ్ 11 వైదొల‌గింది. అయితే, దీనికి ఆ సంస్థ‌పై చ‌ర్య‌లు ఉండ‌వు. ఎందుకంటే.. కేంద్ర ప్ర‌భుత్వ కొత్త‌ నిబంధ‌న‌ల ప్ర‌కారమే త‌ప్పుకోవాల్సి వ‌చ్చింది కాబ‌ట్టి. డ్రీమ్ 11 మాత్ర‌మే కాదు.. మ‌రో గేమింగ్ సంస్థ మై11 స‌ర్కిల్ ఐపీఎల్ స్పాన్స‌ర్ గా వైదొల‌గ‌డం ఖాయ‌మే. ఏడాదికి రూ.125 కోట్లు చొప్పున ఐదేళ్ల‌కు మై11 స‌ర్కిల్ ఒప్పందం చేసుకుంది.

రేసులో ఆటో దిగ్గ‌జం

టీమ్ ఇండియా స్పాన్స‌ర్ షిప్ రేసులో జ‌పాన్ కు చెందిన ఆటోమొబైల్ దిగ్గ‌జం ట‌యోటా ఆసక్తిగా ఉన్న‌ట్లు స‌మాచారం. ఫైనాన్షియ‌ల్ టెక్నాల‌జీ స్టార్ట‌ప్ కూడా రేసులో ఉంద‌ని తెలుస్తోంది. అయితే, బిడ్డింగ్ ఇంకా మొద‌లు కాలేదు. ఆ ప్ర‌క్రియ మొద‌ల‌య్యే స‌మ‌యానికి ఎవ‌రు ముందుకొస్తారో చూడాలి.

Tags:    

Similar News