మ‌హా నాయ‌కా..సెల‌విక‌..మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ త్వ‌ర‌లో రిటైర్‌?

ఎవ‌రూ ఊహించ‌ని విధంగా సంచ‌ల‌నం.. టీమ్ ఇండియా వ‌న్డే కెప్టెన్సీ నుంచి రోహిత్ శ‌ర్మను త‌ప్పించి టెస్టు కెప్టెన్, యువ బ్యాట్స్ మ‌న్ శుబ్ మ‌న్ గిల్ కు అవ‌కాశం..!;

Update: 2025-10-04 11:22 GMT

ఎవ‌రూ ఊహించ‌ని విధంగా సంచ‌ల‌నం.. టీమ్ ఇండియా వ‌న్డే కెప్టెన్సీ నుంచి రోహిత్ శ‌ర్మను త‌ప్పించి టెస్టు కెప్టెన్, యువ బ్యాట్స్ మ‌న్ శుబ్ మ‌న్ గిల్ కు అవ‌కాశం..! ఈ ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో కెప్టెన్ గా ఉన్న‌ప్ప‌టికీ ఐదో టెస్టు తుది జ‌ట్టు నుంచి రోహిత్ శ‌ర్మ‌ను త‌ప్పించారు. దీంతోనే అత‌డి టెస్టు కెరీర్ ముగిసింద‌ని అర్థ‌మైంది. త‌న‌కు కూడా విష‌యం తెలిసి ఇంగ్లండ్ టూర్ కు ముందు మే నెల‌లో సుదీర్ఘ ఫార్మాట్ కు వీడ్కోలు ప‌లికాడు. ఇప్పుడు కూడా స‌రిగ్గా ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌నకు ముందు వ‌న్డే కెప్టెన్సీ కోల్పోయాడు.

త‌ప్పించేశారు...

ఈ ఏడాది మార్చిలో జ‌రిగిన చాంపియ‌న్స్ ట్రోఫీలో చివ‌రిగా టీమ్ ఇండియాకు ఆడాడు రోహిత్. అత‌డి కెప్టెన్సీలోనే టీమ్ ఇండియా టైటిల్ కూడా కొట్టింది. రోహిత్ మ‌ళ్లీ ఏడు నెల‌ల త‌ర్వాత మైదానంలోకి దిగుతున్నాడు. ఈ నెల 19 నుంచి ఆస్ట్రేలియాతో మూడు వ‌న్డేల‌ సిరీస్ మొద‌లుకానుంది. అనంత‌రం ఐదు టి20ల సిరీస్ జ‌ర‌గ‌నుంది. అయితే, ఆసీస్ తో వ‌న్డే సిరీస్ కు కెప్టెన్ గా రోహిత్ ను కొన‌సాగిస్తార‌ని భావించినా, చివ‌రి నిమిషంలో త‌ప్పించేశారు. ఇప్పుడు రోహిత్ ఎంత‌కాలం అంత‌ర్జాతీయ క్రికెట్ లో కొన‌సాగుతాడు అనేది మాత్ర‌మే మిగిలి ఉంది. గ‌త ఏడాది టి20 ప్ర‌పంచ క‌ప్ అనంత‌రం అత‌డు ఆ ఫార్మాట్ కు గుడ్ బై చెప్పిన సంగ‌తి తెలిసిందే. వ‌న్డేలు అడ‌పాద‌డ‌పానే త‌ప్ప రెగ్యుల‌ర్ గా జ‌ర‌గ‌డం లేదు. 2027 వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ న‌కు ఇంకా రెండేళ్ల స‌మ‌యం ఉంది. అప్ప‌టికి రోహిత్ కు 40 ఏళ్లు వ‌స్తాయి. అందుక‌నే రోహిత్ రిటైర్మెంట్ త్వ‌ర‌లోనే అనే కామెంట్లు వ‌స్తున్నాయి.

ఆస్ట్రేలియా సిరీస్ తో ఆఖ‌రా?

నిజానికి దుబాయ్ లో జ‌రిగిన‌ చాంపియ‌న్స్ ట్రోఫీలో రోహిత్ ఫైన‌ల్లో త‌ప్ప మిగ‌తా మ్యాచ్ ల‌లో విఫ‌ల‌మ‌య్యాడు. ఆ త‌ర్వాత ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్)లోనూ రాణించ‌లేదు. దీంతో ఓ ద‌శ‌లో అత‌డిని గాయం సాకుతో ప‌క్క‌న‌పెట్టారు. త‌ర్వాత‌ ఇంపాక్ట్ ప్లేయ‌ర్ గా వాడుకున్నారు. ఆ త‌ర్వాత రోహిత్ ఫిట్ నెస్ పై అనేక ఊహాగానాలు వ‌చ్చాయి. అత‌డు శ‌రీరంపై పూర్తిగా అదుపుత‌ప్పిన‌ట్లు క‌నిపించే ఫొటోలు విడుద‌ల‌య్యాయి.

-ఇక టీమ్ ఇండియాలో చోటు విష‌యానికి వ‌స్తే ఆస్ట్రేలియాతో వ‌న్డే సిరీస్ రోహిత్ కు క‌ఠిన ప‌రీక్ష‌. ఇప్పుడు కేవ‌లం ఆట‌గాడినే ఉన్న అత‌డు ఈ సిరీస్ లో రాణించ‌కుంటే క‌ష్ట‌మే. రోహిత్ స్వ‌యంగా రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌కున్నా.. సెల‌క్ట‌ర్లు అత‌డిని ఎంపిక చేయ‌క‌పోవ‌చ్చు.

ప్ర‌పంచ క‌ప్ ఫైన‌లిస్టు.. చాంపియ‌న్స్ ట్రోఫీ విజేత‌

-న‌వంబ‌రులో ద‌క్షిణాఫ్రికా, డిసెంబ‌రులో న్యూజిలాండ్ జ‌ట్లు మ‌న దేశానికి రానున్నాయి. ఆస్ట్రేలియా టూర్ లో రోహిత్ రాణిస్తే స‌రి.. లేదంటే ద‌క్షిణాఫ్రికాతో సిరీస్ కు ఎంపిక లేన‌ట్లే.

-వ‌న్డేల్లో మూడు డ‌బుల్ సెంచ‌రీలు చేసిన ఏకైక బ్యాట‌ర్ అయిన రోహిత్ శ‌ర్మ‌.. కెప్టెన్ గానూ గొప్ప రికార్డును సొంతం చేసుకున్నాడు. రోహిత్ నాయ‌క‌త్వంలో టీమ్ ఇండియా 56 మ్యాచ్ లు ఆడింది. 12 ఓడింది. ఒకటి టై కాగా, మ‌రోటి ఫ‌లితం రాలేదు.

-2023లో స్వ‌దేశంలో జ‌రిగిన ప్ర‌పంచ క‌ప్ లో టీమ్ ఇండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైన‌ల్ చేరింది. ఫైన‌ల్లో ఆసీస్ చేతిలో ప‌రాజ‌యం పాలైంది. 2025 చాంపియ‌న్స్ ట్రోఫీ గెల‌చుకున్న జ‌ట్టుకూ రోహిత్ శ‌ర్మ‌నే కెప్టెన్.

Tags:    

Similar News