రిటైర్మెంట్ తూచ్.. దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్ అనూహ్య నిర్ణయం
వచ్చే నెల 12 నుంచి పాకిస్థాన్ లో పర్యటించనుంది దక్షిణాఫ్రికా జట్టు. రెండు టెస్టులు, మూడేసి వన్డేలు, టి20లు ఆడనుంది.;
డుమిని.. డివిలియర్స్.. డుప్లెసిస్... దక్షిణాఫ్రికాకు చెందిన ఈ మిస్టర్ ‘డి’.. జాబితాలోని కీలక ఆటగాడు అతడు.. వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ గా విధ్వంసక ఇన్నింగ్స్ లు ఆడినవాడు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోనూ తన ప్రతిభను అందరూ చూశారు. 21 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్ లోకి వచ్చి, భారత్ పై వరుసగా మూడు వన్డే సెంచరీలు బాదిన రికార్డు అతడిది. అలాంటి ఆటగాడు అనూహ్యంగా 30 ఏళ్ల వయసుకే వన్డేలకు రిటైర్మెంట్ ఇచ్చాడు. మంచి ఫామ్ లో ఉండగా అంతకుముందే టెస్టులకూ వీడ్కోలు పలికాడు. ఇంతకూ అతడి వయసు అప్పటికి 28 ఏళ్లు కూడా కాదు. కానీ, అనూహ్య నిర్ణయాలు తీసుకుని వార్తల్లో నిలిచాడు. ఇప్పుడు అంతే అనూహ్యంగా వెనక్కు వచ్చాడు.
ప్రపంచ కప్ లో 600 బాది...
రెండేళ్ల కిందట భారత్ లో జరిగిన వన్డే ప్రపంచ కప్ లో దక్షిణాఫ్రికా బ్యాటర్ క్వింటన్ డికాక్ చెలరేగి ఆడాడు. 594 పరుగులు చేశాడు. అంతలోనే వన్డే ఫార్మాట్ కు బైబై చెప్పాడు. భారత్ పై నిరుడు జరిగిన టి20 ప్రపంచ కప్ ఫైనల్లో ఆడిన అనంతరం ఈ ఫార్మాట్ లోనూ తక్కువగా కనిపిస్తున్నాడు. దేశానికి కాకుండా ఫ్రాంచైజీ క్రికెట్ పైనే ఫోకస్ పెట్టాడు. 2021లో 28 ఏళ్ల వయసులో టెస్టులకు వీడ్కోలు పలికి అందరినీ ఆశ్చర్యపరిచిన డికాక్.. 2023లో వన్డేల నుంచి తప్పుకొన్నాడు. ఇక టి20ల్లోనూ అతడు దక్షిణాఫ్రికాకు ఆడడం కష్టమేనని భావిస్తుండగా... వన్డేలు ఆడతానంటూ ముందుకొచ్చాడు.
పాకిస్థాన్ తో సిరీస్ కు....
వచ్చే నెల 12 నుంచి పాకిస్థాన్ లో పర్యటించనుంది దక్షిణాఫ్రికా జట్టు. రెండు టెస్టులు, మూడేసి వన్డేలు, టి20లు ఆడనుంది. ఈ నేపథ్యంలో ప్రకటించిన వన్డే, టి20 జట్లలో డికాక్ కు చోటు దక్కింది. రెగ్యులర్ కెప్టెన్ బవుమాకు గాయం కావడంతో టెస్టు కెప్టెన్ గా మార్క్రమ్ ను ప్రకటించారు. టి20లకు స్టార్ బ్యాటర్ మిల్లర్, వన్డేలకు కొత్త ఆటగాడు మాథ్యూ బ్రిట్జ్ కే సారథులుగా వ్యవహరిస్తారు.
ఆ డి ని ఒప్పుకోలేదు.. ఈ డి ని ఒప్పుకొన్నారు...
దక్షిణాఫ్రికా అత్యుత్తమ క్రికెటర్లలో ఏబీ డివిలియర్స్ ఒకడు. వికెట్ కీపింగ్ కూడా చేస్తాడు. ఇలాంటివాడు ఏ ఫార్మాట్ లోనైనా అతడు తుది జట్టులో ఉండాలని కెప్టెన్లు కోరుకుంటారు. అలాంటి ఏబీ డివిలియర్స్ 2018లో రిటైర్మెంట్ ఇచ్చాడు. అయితే, తర్వాత 2019 ప్రపంచ కప్ ఆడతానని ముందుకొచ్చాడు. కానీ, ఏవో కారణాలు చెప్పి దక్షిణాఫ్రికా బోర్డు అప్పట్లో డివిలియర్స్ ను తీసుకోలేదు. ఇప్పుడు డికాక్ విషయంలో మాత్రం ఆ దేశ బోర్డు మనసు మార్చుకుంది. 32 ఏళ్ల డికాక్... సరిగ్గా రెండేళ్ల తర్వాత వన్డేలు ఆడబోతున్నాడు.