విశాఖలో సెంచరీ..ఫ్రాంచైజీ మనసు చోరీ.. కోటితో వేలంలోకి
అతడు మూడు ఫార్మాట్లలో దూకుడైన బ్యాటరే.. మంచి వికెట్ కీపర్ కూడా...కానీ, కెరీర్ పై నిర్ణయాలు మాత్రం చాలా తీవ్రంగా తీసుకుంటాడు.;
అతడు మూడు ఫార్మాట్లలో దూకుడైన బ్యాటరే.. మంచి వికెట్ కీపర్ కూడా...కానీ, కెరీర్ పై నిర్ణయాలు మాత్రం చాలా తీవ్రంగా తీసుకుంటాడు. ఒకవైపు టెస్టుల్లో స్థిరంగా రాణిస్తుండగానే రిటైర్మెంట్ ఇచ్చాడు. వన్డేల్లో వస్తూనే హ్యాట్రిక్ సెంచరీలు చేసిన అతడు ప్రపంచ కప్ అనంతరం అనూహ్యంగా రిటైర్మెట్ ప్రకటించాడు. ఇక టి20ల్లో మాత్రం కొనసాగుతానని ప్రపంచ వ్యాప్తంగా లీగ్ లు ఆడుకుంటానని చెప్పాడు. కానీ, చివరకు అతడిని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోనే ఎవరూ కొనని పరిస్థితికి వచ్చాడు. ఒకప్పుడు ముంబై ఇండియన్స్ వంటి చాంపియన్ జట్టులో ఓపెనర్ గా వచ్చి కీలక ఇన్నింగ్స్ ఆడిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ కు అవమానకర పరిస్థితి ఇది. అయితే, ఇలాంటి సమయంలో అతడు తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం మళ్లీ ఐపీఎల్ ఫ్రాంచైజీలను ఆకట్టుకుంది. దీంతో ఆ ప్లేయర్ ను మినీ వేలం ఆటగాళ్ల జాబితాలో చేర్చాలంటూ ఓ ఫ్రాంచైజీ పట్టుబట్టి మరీ చేర్పించింది.
విశాఖ మ్యాచ్ మార్చేసింది...
దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విధ్వంసం, క్లాస్ కలగలసిన ప్లేయర్ అతడు. పదేళ్ల కిందట టీమ్ ఇండియాపై వన్డేల్లో అరంగేట్రంలోనే హ్యాట్రిక్ సెంచరీలు కొట్టాడు. తర్వాతి కాలంలో టి20ల్లోనూ పేరు తెచ్చుకున్నాడు. టెస్టుల్లోనూ రాణిండాడు. అనూహ్యంగా టెస్టులు, వన్డేలకు రిటైర్మెంట్ ఇచ్చాడు. ఈ నిర్ణయం ప్రభావం అతడి టి20 భవిష్యత్ పైనా పడింది. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది ఐపీఎల్ మినీ వేలం ఆటగాళ్ల జాబితాలో పేరు దక్కలేదు. 2013 నుంచి ఐపీఎల్ లో ఆడుతున్న డికాక్.. గత ఏడాది కోల్ కతాకు ప్రాతినిధ్యం వహించాడు. అంతకుముందు 3 సీజన్లు లక్నో సూపర్ జెయింట్స్ కు ఆడాడు. ఈ సారి డికాక్ పై మొదట ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపలేదు. దీంతోనే అతడి పేరు మినీ వేలం జాబితాలో లేదు. ఇక విశాఖపట్నం వన్డేలో టీమ్ ఇండియాపై సెంచరీ చేయడంతో డికాక్ పట్ల ఓ ఫ్రాంచైజీ మనసు మారింది.
పట్టుబట్టిన ఫ్రాంచైజీ ఏది?
డికాక్ ను మినీ వేలం జాబితాలో చేర్చాలంటూ ఓ ఫ్రాంచైజీ పట్టుబట్టిందట. దీంతోనే వచ్చే మంగళవారం 16న అబుదాబిలో జరిగే ఆక్షన్ లో రూ.కోటి బేస్ ప్రైస్ తో చోటుదక్కింది. గత ఏడాది కోల్ కతా ఇతడిని రూ.2 కోట్లకు తీసుకుంది. వచ్చే వేలంలో మరి ఎంత ధర పలుకుతాడో చూడాలి. ఇక డికాక్ కోసం పట్టుబట్టిన ఆ ఫ్రాంచైజీ ఏదో బయటకు రాలేదు.
కొసమెరుపుః విశాఖలో జరిగిన మూడో వన్డేలో సెంచరీ చేసిన డికాక్.. ఐపీఎల్ మినీ వేలంలోకి వచ్చాడు. కానీ, కటక్ లో జరిగిన తొలి టి20లో డకౌట్ అయ్యాడు.