టీమ్ ఇండియాకు ఆడకున్నా.. 45 ఏళ్లకే బీసీసీఐ చీఫ్.. ఎవరీ మిథున్?
మిథున్ మన్హాస్... ఈ పేరు భారత దేశవాళీ క్రికెట్ లో బాగా తెలిసినదే. అయితే, టీమ్ ఇండియాకు మాత్రం ఎంపిక కాలేకపోయాడు.;
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)... రూ.లక్షల కోట్ల విలువ.. ప్రపంచంలోనే అత్యంత సంపన్నం బోర్డు.. ఇంకా చెప్పాలంటే ప్రపంచ క్రికెట్ నే శాసిస్తున్న బోర్డు.. అలాంటి సంస్థకు కేవలం 45 ఏళ్లకే అధ్యక్షుడు కాబోతున్నాడు ఓ మాజీ క్రికెటర్. దేశవాళీ క్రికెట్ లో బాగా ఆడినప్పటికీ పరిస్థితుల కారణంగా టీమ్ ఇండియాలో చోటు దక్కని ఆ క్రికెటర్ ఇప్పుడు భారత క్రికెట్ బోర్డుకే అధ్యక్షుడు కాబోతున్నాడు. తన వయసు వాడే అయిన మహేంద్ర సింగ్ ధోనీ ఇంకా ఐపీఎల్ ఆడుతుండగా.. తన వయసు వాడే అయిన గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా ఉండగా.. అతడు మాత్రం బీసీసీఐ అధ్యక్షుడు కాబోతుండడం గమనార్హం.
జమ్ములో పుట్టి..
మిథున్ మన్హాస్... ఈ పేరు భారత దేశవాళీ క్రికెట్ లో బాగా తెలిసినదే. అయితే, టీమ్ ఇండియాకు మాత్రం ఎంపిక కాలేకపోయాడు. 45 ఏళ్ల మిథున్ మన్హాస్ ఇప్పుడు బీసీసీఐ చీఫ్ కాబోతున్నాడు. జమ్ములో పుట్టిన మిథున్.. దేశవాళీ క్రికెట్ లో జమ్ముకశ్మీర్, ఢిల్లీ జట్లకు ఆడాడు. 1997 నుంచి 2017 సీజన్ వరకు కొనసాగాడు. ఇండియా ఎ, బి, గ్రీన్ జట్లకు ఎంపికయ్యాడు. ఢిల్లీ, ఇండియా అండర్ 19 జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.
-వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ అయిన మిథున్... 157 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లలో 9,714 పరుగులు, 130 లిస్ట్ ఏ మ్యాచ్ లలో 4,126 పరుగులు, 91 టి20ల్లో 1,170 పరుగులు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహించాడు.
-1997-98 సీజన్ లో దేశవాళీ క్రికెట్లోకి వచ్చిన మిథున్ మన్హాస్.. బాగానే రాణించినా, అప్పట్లో సచిన్, ద్రవిడ్, గంగూలీ, లక్ష్మణ్‌లతో కూడిన టీమ్ ఇండియా మిడిలార్డర్ లో చోటు లేకపోవడతో జాతీయ జట్టుకు ఎంపిక కాలేదు. ఇక 2004 తర్వాత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ శకం మొదలుకావడంతో వికెట్ కీపర్ బ్యాటర్ గానూ అవకాశం లేకుండా పోయింది.
వచ్చే వారంలో...
బీసీసీఐ చీఫ్ గా వచ్చే వారంలో మిథున్ మన్హాస్ ఎన్నిక ఖాయం. ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్న రాజీవ్ శుక్లా (వైస్ ప్రెసిడెంట్) మీడియాతో మాట్లాడుతూ.. తమ ప్యానెల్ తరఫున బీసీసీఐ చీఫ్ పదవికి మిథున్ నామినేషన్ వేసినట్లు వెల్లడించారు. కర్ణాటక క్రికెట్ సంఘం అధ్యక్షుడు రఘురామ్ భట్ కూడా ఇదే ప్యానల్ తరఫున బీసీసీఐ కోశాధికారి పదవికి నామినేషన్ వేశారు. భట్ బీసీసీఐ చీఫ్ పదవికి పోటీ చేస్తారని భావించినా తర్వాత మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది.
-ఉపాధ్యక్ష పదవికి రాజీవ్ శుక్లా, కార్యదర్శి పదవికి దేవజీత్ సైకియా, సంయుక్త కార్యదర్శిగా ప్రభ్ తేజ్ సింగ్ భాటియా నామినేషన్లు వేశారు. బీసీసీఐ అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం) భావిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. కాబట్టి మిథున్ మన్హాస్, రాజీశ్ శుక్లా ప్యానెల్ కే పదవులు దక్కడం ఖాయం.
-టీమ్ ఇండియాకు ఎంపిక కాలేకపోయిన మిథున్ మన్హాస్.. ఇలా బీసీసీఐ చీఫ్ గా అదీ 45 ఏళ్ల వయసుకే బాధ్యతలు చేపట్టనుండడం, అదికూడా జమ్ము ప్రాంతం వ్యక్తి కావడం విశేషాలు.