సరిగ్గా రెండు వారాల్లో.. హైదరాబాద్ కు ఫుట్ బాల్ లెజెండ్: రేవంత్
మెస్సీ పర్యటనకు మన హైదరాబాద్ వేదిక కానుంది. ఇంతకూ అతడు వచ్చేది ఏయే తేదీల్లో తెలుసుకోండి..;
ప్రపంచ ఫుట్ బాల్ చరిత్రలో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (గోట్)... దాదాపు మూడు దశాబ్దాల తర్వాత అర్జెంటీనా జట్టుకు ప్రపంచ కప్ అందించిన కెప్టెన్... ప్రపంచంలో అత్యంత ఫాలోయింగ్ ఉన్న ఫుట్ బాలర్... లయోనల్ మెస్సీ భారత పర్యటనకు వస్తున్నాడు. సాధారణంగా ఫుట్ బాల్ క్రేజ్ అంతగా లేని భారత్ లోనూ ప్రతి ఒక్క క్రీడాభిమానికీ సుపరిచితుడు మెస్సీ. తన సమ్మోహన ఆటతీరుతో ఫుట్ బాల్ లో ప్రత్యేక పేజీ లిఖించుకున్న ఆటగాడు ఇతడు. అంతటి మెస్సీ భారత్ కు రావడం అంటే చాలా అరుదే. పైగా ప్రపంచ కప్ వచ్చే ఏడాది ఉండగా.. అర్జెంటీనా జట్టు డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పోటీ పడుతుండగా.. మరోవైపు లీగ్ షెడ్యూల్ ను సరిచూసుకుంటూ భారత్ లో అడుగు పెట్టనున్నాడు మెస్సీ. ఇక్కడ మరో విశేషం ఏమంటే.. కొన్ని నెలల కిందట వరకు కేరళలో మెస్సీ సారథ్యంలో అర్జెంటీనా జట్టు పర్యటన ఉంటుందని కథనాలు వచ్చాయి. ఆ రాష్ట్రంలో ఫుట్ బాల్ మ్యాచ్ కూడా ఆడతాడని ప్రకటించారు. అనూహ్యంగా ఆ టూర్ క్యాన్సిల్ అయింది. మెస్సీ పర్యటనకు మన హైదరాబాద్ వేదిక కానుంది. ఇంతకూ అతడు వచ్చేది ఏయే తేదీల్లో తెలుసుకోండి..
డిసెంబరు రెండో వారాంతంలో..
కేరళ వంటి విపరీతమైన ఫుట్ బాల్ క్రేజ్ ఉన్న రాష్ట్రాన్ని కాదని మెస్సీ హైదరాబాద్ రానుండడం విశేషమే. ఒక విధంగా ఇది తెలుగు రాష్ట్రాల వారికి క్రేజీ న్యూస్ కానుంది. అయితే, మెస్సీ టూర్ జట్టుతో కాదు.. కేవలం ఒంటరిగా. కేరళ టూర్ క్యాన్సిల్ నేపథ్యంలో దక్షిణ భారత ప్రజలను నిరుత్సాహ పరచకుండా హైదరాబాద్ ను ఎంపిక చేశారు. చెన్నై, బెంగళూరు వంటి నగరాలను కూడా కాదని భాగ్య నగరానికి అవకాశం ఇచ్చారు. ఈ మేరకు డిసెంబరు 13న మెస్సీ హైదరాబాద్ వస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. అభిమాన ఆటగాడిని చూసేందుకు ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఉన్నారని పేర్కొన్నారు.
దేశంలోని నాలుగు నగరాల్లో...
మెస్సీ హైదరాబాద్ తో పాటు కోల్ కతా, ఢిల్లీ, ముంబైలోనూ పర్యటించనున్నాడు. అంటే దేశంలోని నాలుగు మూలల్లో అతడి టూర్ ఏర్పాటు చేశారు. వాస్తవానికి నవంబరు 17నే కేరళలో మెస్సీ మ్యాచ్ ఉంది. అది రద్దయింది. వీటిలో కోల్ కతా ఫుట్ బాల్ కు పెట్టింది పేరు. ముంబై సరేసరి. మరో నగరమైన ఢిల్లీ దేశ రాజధాని. అక్కడా మెస్సీ అంటే భిమానించని వారు ఎవరూ ఉండరు.
ప్రయివేటు జెట్ లో..
అంతర్జాతీయ ఫుట్ బాలర్లు అంటే వేల కోట్లకు అధిపతులు. సొంత విమానాలు కలిగినవారు. ఇప్పుడు మెస్సీ ప్రైవేటు జెట్ లోనే భారత్ కు వస్తున్నాడు. డిసెంబరు 13న కోల్ కతా వెళ్తాడు. అటు తర్వాత హైదరాబాద్ వస్తాడు. గచ్చిబౌలి స్టేడియంలో కానీ, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం ఉప్పల్ లో గాని అతడి కార్యక్రమం ఉండనుంది. డిసెంబరు 14న ముంబై, 15 ఢిల్లీ టూర్ చేస్తాడు. మెస్సీ చివరిగా 2011లో భారత్ లో పర్యటించాడు. అప్పటికి అర్జెంటీనా ప్రపంచ విజేత కాదు. మెస్సీ కూడా పెద్దగా పాపులర్ కాదు.