యాషెస్ గులాబీ టెస్టు..చరిత్రలో నిలిచిపోయేలా రూట్ రికార్డు సెంచరీ
ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య జరిగే యాషెస్ సిరీస్ అంటే పెద్ద సమరమే. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు అత్యంత ఆసక్తితో చూస్తారు.;
ప్రపంచంలో ఎక్కడైనా సెంచరీ కొట్టు.. కానీ, ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీ చేస్తే మాత్రం ఆ కిక్కే వేరప్పా.. పేస్ కు సహకరించే పిచ్ లు.. బౌన్స్ తో బెంబేలెత్తించే బౌలర్లు.. అల్లరి అల్లరి చేసే కంగారూ అభిమానులు.. అదే ఇంగ్లండ్ తో యాషెస్ సిరీస్ లో అయితే గేలి చేస్తూ ఆటాడుకునే దురభిమానులు..! ఇలాంటి పరిస్థితుల్లో అందులోనూ సర్రున దూసుకొస్తూ స్వింగ్ అయ్యే గులాబీ బంతితో టెస్టు మ్యాచ్..! అటు చూస్తే 15 ఏళ్ల టెస్టు కెరీర్..! దాదాపు 14 వేల పరుగులు..! టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా చరిత్రలో నిలిచే చాన్సు ఉన్న గొప్ప బ్యాటర్..! కానీ, 30 ఇన్నింగ్స్ ఆడినా.. ఆస్ట్రేలియాలో ఒక్క సెంచరీ కూడా కొట్టలేదు. మేం అతడిని గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్)గా కాదు కదా..? గొప్ప బ్యాటర్ గానూ ఒప్పుకోం అన్నట్లు ఆస్ట్రేలియా ఆటగాళ్లు..! మరోవైపు ఇప్పుడు తప్పితే మళ్లీ ఆస్ట్రేలియా వచ్చే చాన్స్ లేదనే పరిస్థితి. పైగా తొలి టెస్టులో డకౌట్. ఇంత ఒత్తిడిలో ఆ బ్యాటర్ సెంచరీ కొట్టాడు. చరిత్రలో నిలిచిపోయే రీతిలో మూడంకెల స్కోరు చేశాడు. ఆస్ట్రేలియా పేసర్లు విసిరిన గులాబీ బంతి సవాల్ ను ఛేదిస్తూ బ్యాట్ తో పైచేయి సాధించాడు ఇంగ్లండ్ మేటి క్రికెటర్ జో రూట్.
అనుమానాలు పటాపంచలు...
ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య జరిగే యాషెస్ సిరీస్ అంటే పెద్ద సమరమే. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు అత్యంత ఆసక్తితో చూస్తారు. అలాంటి యాషెస్ లో ఇంతవరకు ఆస్ట్రేలియాలో సెంచరీ కొట్టని చెత్త రికార్డును రూట్ సవరించాడు. గురువారం మొదలైన రెండో టెస్టులో రూట్ (135 నాటౌట్, 15 ఫోర్లు, సిక్స్) అద్భుతంగా ఆడుతూ మూడంకెల మార్క్ చేరాడు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ ను ఆసీస్ పేసర్ స్టార్క్ గులాబీ బంతితో బెంబేలెత్తించాడు. ఓపెనర్ డకెట్ (0), వన్ డౌన్ బ్యాటర్ పోప్ (0)లను ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేర్చాడు. అప్పటికి జట్టు స్కోరు 5 పరుగులు మాత్రమే. ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన రూట్ మొదట్లోనే ఔటయ్యేవాడే. 2 పరుగుల వద్ద అతడి క్యాచ్ ను ఫీల్డర్ జారవిడిచాడు. దీన్ని ఉపయోగించుకుని రూట్ క్రీజులో పాతుకుపోయాడు.
నాటకీయ ఫక్కీలో..
ఆస్ట్రేలియన్లు అంటే మజాకానా? ఓవైపు రూట్ సెంచరీ వైపు వెళ్తుంటే మరో ఎండ్ లోని వికెట్లను వరుసగా పడగొడుతూ సవాల్ విసిరారు. 246 పరుగులకే ఇంగ్లండ్ 9 వికెట్లు తీశారు. దీంతో రూట్ సెంచరీ కష్టమే అనిపించింది. అయితే, 11వ నంబర్ బ్యాటర్ జోఫ్రా ఆర్చర్ (32 బ్యాటింగ్) అండగా సెంచరీని అందుకున్నాడు. ఇది అతడికి 40వ సెంచరీ. సచిన్ (51), కలిస్ (45), పాంటింగ్ (41) తర్వాత 40 అంతకుమించి టెస్టు సెంచరీలు చేసిన బ్యాటర్ గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఆట ముగిసే సరికి ఇంగ్లండ్ 9 వికెట్లకు 325 పరుగులు చేసింది.
-34 ఏళ్ల రూట్ ప్రస్తుతానికి 13686 పరుగుల మీద ఉన్నాడు. సచిన్ టెండూల్కర్ (15,921) అత్యధిక పరుగుల రికార్డుకు మరింత దగ్గరవుతున్నాడు.