రికార్డుల ‘రాజూ’ ఆయనే.. రూపాయిల ‘మహారాజూ’ ఆయనే.. కోహ్లీ బ్యాట్ కంటే బ్యాంక్ బ్యాలెన్సే ఎక్కువ!

మన దగ్గర సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ప్యాకేజీల కోసం మూడు నెలలకు ఒకసారి కంపెనీలు మార్చేస్తుంటారు.

Update: 2026-05-21 07:25 GMT

విరాట్ కోహ్లీ... ఈ పేరు చెబితే స్టేడియంలో పూనకాలు.. బౌలర్లకు చెమటలు. ఒకప్పుడు అతడిని రికార్డుల వేటగాడు.. “చేజ్ మాస్టర్” అని పిలిచేవారు. కానీ ఇప్పుడు రూట్ మార్చి “క్యాష్ మాస్టర్” అని పిలవాలేమో..! ఎందుకంటే, ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా సంపాదించిన ఆటగాడిగా కింగ్ కోహ్లీ సరికొత్త రికార్డు సృష్టించాడు. కేవలం ఐపీఎల్ శాలరీల రూపంలోనే ఏకంగా రూ.230 కోట్లు కొల్లగొట్టాడు. ఈ ఫిగర్ వినగానే నెల జీతం కోసం అల్లాడిపోయే సగటు ఉద్యోగి.. నోరెళ్లబెట్టి తన ఈఎంఐ క్యాలిక్యులేటర్ చూసుకుని కన్నీళ్లు పెట్టుకుంటున్నాడట!

ఒకే కంపెనీ... కోట్లలో శాలరీ.. సరికొత్త ‘హెచ్ఆర్’ పాలసీ!

మన దగ్గర సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ప్యాకేజీల కోసం మూడు నెలలకు ఒకసారి కంపెనీలు మార్చేస్తుంటారు. నోటీస్ పీరియడ్‌లోనే మరో మూడు ఆఫర్లు చేతిలో పట్టుకుని తిరుగుతుంటారు. కానీ కోహ్లీ మాత్రం “కంపెనీ ఏదైనా... మన లాయల్టీ ఒకటే” అంటూ 2008 ఐపీఎల్ ప్రారంభం నుండి నేటివరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కే అంకితమైపోయాడు. “ఒకే కంపెనీ.. కానీ కోట్లలో సాలరీ” అనే సరికొత్త హెచ్ఆర్ పాలసీని ప్రపంచానికి పరిచయం చేశాడు. బెంగళూరు మేనేజ్‌మెంట్ కూడా కోహ్లీని వదులుకోవడానికి అస్సలు సిద్ధంగా లేదు. బ్యాంక్ లాకర్‌లో నిగనిగలాడే పసిడిని దాచినట్టు విరాట్‌ను భద్రంగా దాచుకుంటోంది. ఈ లాయల్టీకి ప్రతిఫలమే ఆ 230 కోట్ల అంకె!

ధోని, రోహిత్‌లను దాటేసిన ‘రన్ మెషిన్’

ఈ సంపాదన రేసులో కోహ్లీ తర్వాతి స్థానాల్లో ఎవరున్నారో తెలుసా? రోహిత్ శర్మనే ముంబై ఇండియన్స్‌కు ఐదు ట్రోఫీలు అందించి, రూ.227.2 కోట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక ఎమ్ఎస్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ ‘తలా’, కెప్టెన్ కూల్ ధోని రూ.200 కోట్లతో మూడో స్థానంలో నిలిచాడు. మ్యాచ్‌లను ఆఖరి బంతి వరకు తీసుకెళ్లి గెలిపించే ధోని కూడా, కోహ్లీ బ్యాంక్ బ్యాలెన్స్ చూశాక... “నిజమైన ఫినిషర్ అంటే ఇదేనా!” అని మనసులో అనుకుని ఉంటారేమోనని నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు.

బ్రాండ్ వాల్యూలో ‘సిక్సర్ల’ వర్షం!

కోహ్లీకి ఈ స్థాయిలో ఆదాయం రావడానికి కారణం క్రీజులో అతడు కురిపించే పరుగుల వర్షమే. ప్రతి సీజన్‌లోనూ బౌండరీలు కొడుతూ తన బ్రాండ్ విలువను కూడా సిక్సర్ల మాదిరిగా స్టేడియం దాటించేస్తున్నాడు. సాధారణంగా మనం షాపింగ్ మాల్స్‌కు వెళ్తే “బై 1 గెట్ 1” ఆఫర్లు చూస్తాం. కానీ కోహ్లీకి మాత్రం “ప్లే 1 మ్యాచ్ గెట్ 10 క్రోర్స్” రేంజ్‌లో డీల్స్ నడుస్తున్నాయి.

అతడు ఒక యాడ్‌లో టూత్‌పేస్ట్ పట్టుకున్నా కోట్లే.. షూ వేసుకున్నా కోట్లే.. చివరికి ఫిట్‌నెస్ కోసం బ్రాండెడ్ నీళ్లు తాగినా అకౌంట్‌లోకి కోట్లు వచ్చి పడిపోతుంటాయి. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే చాలు, చాలామంది ఐదేళ్ల జీతం ఒక్క సెకన్లో కోహ్లీ ఖాతాలో జమైపోతుంది.

లండన్ లైఫ్... కెమెరామెన్లకు ‘ఫుల్ టైమ్’ జాబ్!

ప్రస్తుతం కోహ్లీ తన కుటుంబంతో కలిసి లండన్‌లో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. కోట్ల సంపాదన ఉన్నా పిల్లల విషయంలో మాత్రం అతడు చాలా పద్ధతిగా ఉంటాడు. ఇప్పటివరకు తన పిల్లల ముఖాలను సోషల్ మీడియాలో పూర్తిగా చూపించకుండా ప్రైవసీని కాపాడుకుంటూ వస్తున్నాడు. ఈ విషయంలో కోహ్లీని చూసి సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు కూడా “ప్రైవసీని ఎలా కాపాడుకోవాలో” నోట్స్ రాసుకుంటున్నారట.

అయితే అతడి భార్య అనుష్క శర్మ మ్యాచ్‌లకు వస్తే మాత్రం స్టేడియంలో కెమెరామెన్‌కు ఫుల్ టైమ్ జాబ్ దొరికినట్టే! కోహ్లీ ఫోర్ కొట్టినా కెమెరా అనుష్క వైపే.. ఔట్ అయినా కెమెరా ఆమె వైపే.. చివరికి వైడ్ వేసినా కెమెరామెన్ అనుష్క ఎక్స్‌ప్రెషన్స్ కోసమే వెతుకుతుంటాడు. ఇది చూసే ప్రేక్షకులు.. “మేము లైవ్ మ్యాచ్ చూస్తున్నామా లేక కోహ్లీ ఫ్యామిలీ వ్లాగ్ చూస్తున్నామా?” అని తలలు పట్టుకుంటున్నారు.

బాస్... ఇకపై ‘కింగ్ కోహ్లీ’ కాదు.. ‘క్యాష్ కోహ్లీ’!

ఏదేమైనా విరాట్ కోహ్లీ ఇప్పుడు కేవలం ఒక క్రికెటర్ మాత్రమే కాదు. అతడొక అంతర్జాతీయ బ్రాండ్, ఒక సక్సెస్ ఫుల్ బిజినెస్ మోడల్ నడిచే ‘ఏటీఎం’ మెషిన్.. అతడు బ్యాట్ ఊపితే రికార్డులు బద్దలవుతాయి, సోషల్ మీడియాలో వేలు కదిపితే డబ్బులు కురుస్తాయి. అందుకే విరాట్ క్రేజ్ చూసిన అభిమానులు ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక కొత్త నినాదాన్ని అందుకున్నారు: “ఇకపై కింగ్ కోహ్లీ కాదు బాస్… క్యాష్ కోహ్లీ!”

Tags:    

Similar News