ఐపీఎల్ -19 మినీ వేలం.. ఈసారి ఈ క్రికెటర్ పైనే కాసుల వాన
ఆటగాళ్లను వేలానికి వదిలేశాక ఫ్రాంచైజీల వద్ద ఎంత డబ్బు (పర్సు) మిగిలింది అనేది వేలంలో కీలకం అవుతుంది.;
మరికొద్ది రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్ కు సంబంధించి మినీ వేలం జరగనుంది. గత ఏడాది మెగా వేలంగా సాగినందున ఈసారి మినీ వేలం ఉంటుంది. అబుదాబిలో నిర్వహించే ఈ వేలం కోసం 1,355 మంది ఆటగాళ్లు పేర్లు నమోదు చేసుకున్నారు. వీరి జాబితాను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ).. ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ఇచ్చేసింది. ఇక వేలంలో 77 మంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు కొనేందుకు వీలుంది. మరి 16వ తేదీన జరిగే ఆక్షన్ లో ఎవరికి కాసుల పంట పండుతుంది? మరెవరికి నిరాశ మిగులుతుంది? అనేది ఆసక్తికరంగా మారింది. అయితే, ఈసారి భారత్ నుంచి స్టార్ ఆటగాళ్లు ఎవరూ పెద్దగా లేరు. ఇప్పటికే అందరు భారత స్టార్లు ఆయా ఫ్రాంచైజీల్లో కుదురుకున్నారు. ఫ్రాంచైజీలు కూడా ఈ ఏడాది ఎవరినీ విడుదల చేయలేదు.
ఆటగాళ్లూ బయటకు రాలేదు. మినీ వేలంలోకి వచ్చినవారిలో భారత్ నుంచి ఆల్ రౌండర్ వెంకటేశ్ అయ్యర్, స్పిన్నర్ రవి బిష్ణోయ్ మాత్రమే కనీస ధర రూ.2కోట్ల జాబితాలో ఉన్నారు. వాస్తవానికి నిరుడు వెంకటేశ్ రూ.23.75 కోట్ల రికార్డు ధర పలికాడు. అతడిని కోల్ కతా నైట్ రైడర్స్ మెగా వేలానికి వదిలి మరీ తీసుకుంది. కానీ, కనీసం న్యాయం చేయకపోవడంతో ఈ ఏడాది వదిలేసింది. రవి బిష్ణోయ్ మంచి స్పిన్నరే అయినా... అతడి ఫామ్ నిలకడగా ఉండదు. మరి వెంకటేశ్ ఈసారి ఎంత పలుకుతాడు...? బిష్ణోయ్ ను తీసుకునేది ఎవరు అనేది ఇంట్రస్టింగ్ పాయింట్.
పర్సు బరువే కీలకం..
ఆటగాళ్లను వేలానికి వదిలేశాక ఫ్రాంచైజీల వద్ద ఎంత డబ్బు (పర్సు) మిగిలింది అనేది వేలంలో కీలకం అవుతుంది. ఈ లెక్కన మాజీ చాంపియన్లు కోల్ కతా నైట్ రైడర్స్ వద్ద రూ.64.30 కోట్లు, చెన్నై సూపర్ కింగ్స్ దగ్గర రూ.43.40 కోట్లు ఉన్నాయి. మరి ఈ మొత్తాన్ని ఎవరిపై అత్యధికంగా ఖర్చు పెడతాయి? ఎందరిపై ఖర్చు చేస్తాయి? అన్నది చూడాలి. మిగతా ఫ్రాంచైజీలలో సన్ రైజర్స్ హైదరాబాద్ వద్ద రూ.25.50 కోట్లు, లక్నో సూపర్ జెయింట్స్ (రూ.22.95 కోట్లు), ఢిల్లీ క్యాపిటల్స్ (రూ.21.80 కోట్లు), చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (రూ.16.40 కోట్లు), రాజస్థాన్ రాయల్స్ రూ.16.05 కోట్లు కలిగి ఉన్నాయి. అత్యంత తక్కువ ఉన్నది ముంబై ఇండియన్స్ వద్ద (రూ.2.75 కోట్లు) కావడం గమనార్హం.
అతడి కోసం వేలం వెర్రిగా...?
మినీ వేలంలో అత్యధిక ధర పలికేది ఫలానా అని కచ్చితంగా చెప్పలేం. అయితే, ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ కు భారీగా రేటు దక్కుతుందనే అంచనాలు ఉన్నాయి. కోల్ కతా, చెన్నై ఇతడి కోసం పోటీ పడతాయని భావిస్తున్నారు. మిగతా ఫ్రాంచైజీలూ ఆసక్తి చూపొచ్చు. లంక బౌలర్ మతీశ పతిరన, ఇంగ్లండ్ ఆల్ రౌండర్ లివింగ్ స్టన్ లకూ జాక్ పాట్ దొరకొచ్చని లెక్కేస్తున్నారు. 2023లో గ్రీన్ ను ముంబై రూ.17.5 కోట్లకు తీసుకుంది. కానీ, 2024లో బెంగళూరుతో అంతే మొత్తానికి ట్రేడ్ చేసుకుంది.
కొసమెరుపుః గ్రీన్ ఈసారి కూడా మిలియనీర్ అవుతాడు. అయితే, ఆ మొత్తం రూ.18 కోట్లకు మించదు. కొందరు విదేశీ ఆటగాళ్లు ఉద్దేశపూర్వకంగానే మినీ వేలంలోకి వస్తుండడంతో ఐపీఎల్ మేనేజ్ మెంట్ మాగ్జిమమ్ ఫీజు రూల్ ను తీసుకొచ్చింది.