పాక్‌తో క్రికెట్.. ప్రాణాల మీద‌కే.. నాడు లంక ఆట‌గాళ్ల‌పై ఉగ్ర‌దాడి

బ‌హుశా చాలామంది మ‌ర్చిపోయి ఉంటారు కానీ.. పాకిస్థాన్ తో క్రికెట్ అంటే ప్రాణాల మీద‌కు తెచ్చుకున్న‌ట్లే..! ఈ మాటలో తీవ్ర‌త‌ను ఉదాహ‌ర‌ణ‌ల‌తో స‌హా చెబితేనే తెలుస్తుంది.;

Update: 2025-10-19 03:41 GMT

బ‌హుశా చాలామంది మ‌ర్చిపోయి ఉంటారు కానీ.. పాకిస్థాన్ తో క్రికెట్ అంటే ప్రాణాల మీద‌కు తెచ్చుకున్న‌ట్లే..! ఈ మాటలో తీవ్ర‌త‌ను ఉదాహ‌ర‌ణ‌ల‌తో స‌హా చెబితేనే తెలుస్తుంది. అదెలాగంటే.. 2008 న‌వంబ‌రు 26న భార‌త్ ఆర్థిక రాజ‌ధాని ముంబైపై పాక్ ప్రేరేపిత ఉగ్ర‌వాదులు అరేబియా సముద్రం ద్వారా వ‌చ్చి దారుణ‌మైన‌ దాడికి దిగారు. దీంతో ముంబై అల్లాడిపోయింది. భార‌త దేశం అంతా క‌దిలిపోయింది. పాక్ దుర్బుద్ధి తెలిసిన భార‌త దేశం ఆ దేశ‌ జ‌ట్టుతో ఇక ముఖాముఖి క్రికెట్ ఆడేది లేద‌ని తేల్చిచెప్పింది. ముంబై దాడుల భ‌యాందోళ‌న‌లు చాలా కాలంపాటు కొన‌సాగాయి. ఆ స‌మ‌యంలో ఇంగ్లండ్ క్రికెట్ జ‌ట్టు భార‌త్ లో ప‌ర్య‌టిస్తోంది. భ‌ద్ర‌త‌పై ఆందోళ‌న చెందిన ఆట‌గాళ్లు స్వ‌దేశానికి వెళ్లిపోయారు. పాక్ దాడుల్లో అఫ్ఘాన్ యువ‌ క్రికెట‌ర్ల మ‌ర‌ణంతో గ‌తంలో ఏం జ‌రిగిందో ప‌రిశీలిస్తే..

భార‌త ఆట‌గాళ్లు వెళ్లాల్సింది..

ఉగ్ర‌వాదం ఎక్క‌డైనా ప్ర‌మాద‌క‌ర‌మే. ఉగ్ర‌వాదుల‌ను భార‌త్ లోకి పంపి ముంబైపై దాడికి ఉసిగొల్పిన పాక్‌కు.. కేవ‌లం ఐదు నెల‌ల్లోపే దిమ్మ‌తిరిగింది. ఏకంగా ఒక అంత‌ర్జాతీయ క్రికెట్ జ‌ట్టు పాక్‌లో ప‌ర్య‌టిస్తుండ‌గా.. ఆట‌గాళ్ల బ‌స్సుపై దాడి జ‌రిగింది. దీంతో క్రికెట్ ప్ర‌పంచం నివ్వెర‌పోయింది. ఆరేడేళ్ల పాటు పాకిస్థాన్‌లో అంత‌ర్జాతీయ‌ క్రికెట్ బంద్ అయింది. ముంబైపై 2008 న‌వంబ‌రు 26న ఉగ్ర‌దాడి జ‌ర‌గ్గా, పాక్‌లోని లాహోర్‌లో ఉన్న గ‌డాఫీ స్టేడియానికి వెళ్తున్న శ్రీలంక క్రికెట‌ర్ల‌పై 2009 మార్చి 3న కాల్పులు జ‌రిగాయి. రెండో టెస్టు మూడో రోజు మ్యాచ్ కోసం వీరు హోట‌ల్ నుంచి గ్రౌండ్ కు ప‌య‌నం కాగా 12 మంది సాయుధులు కాల్పులు జ‌ర‌ప‌డంతో లంక క్రికెట‌ర్లు భీతిల్లి పోయారు. ఏకంగా ఆరుగురు లంక క్రికెట‌ర్ల‌కు గాయాల‌య్యాయి. వీరిలో అప్ప‌టి లంక కెప్టెన్, వైస్ కెప్టెన్ అయిన దిగ్గ‌జ ఆట‌గాళ్లు మ‌హేల జ‌య‌వ‌ర్ద‌నే, కుమార సంగ‌క్క‌ర, దిగ్గ‌జ పేస‌ర్ చ‌మిందా వాస్‌ కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం. ఈ దాడిలో ఆరుగురు పోలీసులు, ఇద్ద‌రు సాధార‌ణ ప్ర‌జ‌లు చ‌నిపోయారు. వాస్త‌వానికి ఈ స‌మ‌యంలో పాక్‌లో టూర్ చేయాలిసింది టీమ్ ఇండియా. కానీ, ముంబై దాడుల‌తో దానిని రద్దు చేసుకుంది. బ‌దులుగా శ్రీలంక వెళ్లి బ‌లైంది.

లంక జ‌ట్టుపై దాడికి పాల్ప‌డింది ల‌ష్క‌ర్ ఏ జాంగ్వీ అనే ఉగ్ర‌వాద సంస్థ అని 2016లో తేల్చారు. ఇదే ఏడాది అఫ్ఘానిస్థాన్‌లో దాక్కున ఈ దాడుల మాస్ట‌ర్ మైండ్ ను భ‌ద్ర‌తా ద‌ళాలు హ‌త‌మార్చాయి.

పాక్‌లో ఎప్పుడూ స‌మ‌స్యే...

పాకిస్థాన్ లో విదేశీ జ‌ట్లు ఆడ‌డం ఎప్పుడూ ప్ర‌మాద‌క‌ర‌మేన‌ని గ‌తంలోని చాలా సంఘ‌ట‌న‌లు చెప్పాయి. 2002 మేలో న్యూజిలాండ్ క్రికెట్ జ‌ట్టు బ‌స చేసిన హోట‌ల్ ఎదుట బాంబు పేలుడు జ‌రిగింది. ఈ దెబ్బ‌తో ఆ జ‌ట్టు పాక్‌ను విడిచి వెళ్లిపోయింది. అక్టోబ‌రులో జ‌ర‌గాల్సిన టూర్‌ను ఆస్ట్రేలియా ర‌ద్దు చేసుకుంది. ఇక 2009లో లంక జ‌ట్టుపై దాడి జ‌రిగాక పాక్ వెళ్లేందుకు ఏ జ‌ట్టు కూడా మొగ్గుచూప‌లేదు. దీంతో త‌ట‌స్థ వేదిక‌గా దుబాయ్ ను ఎంచుకుని మ్యాచ్‌లు ఆడింది. 2015 త‌ర్వాత ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ‌డంతో పాక్‌లో జ‌ట్లు ప‌ర్య‌టించ‌డం మొద‌లుపెట్టారు.

కొస‌మెరుపుః ముంబై దాడుల‌తో పాక్‌లో ప‌ర్య‌ట‌న నుంచి భార‌త్ వైదొల‌గ‌గా లంక జ‌ట్టు కూడా వెనుకాడింది. కానీ, అధ్య‌క్షుడి త‌ర‌హా (ప్రెసిడెన్షియ‌ల్‌) భ‌ద్ర‌త క‌ల్పిస్తామ‌ని హామీ ద‌క్క‌డంతో వెళ్లిన ఆ జ‌ట్టుకు ఆ మేర‌కు పాక్‌ ఏర్పాట్లు చేయ‌లేదు.

Tags:    

Similar News