6,6,6,6,6,4.. హార్దిక్ హార్డ్ హిట్టింగ్.. ఒక్క ఓవర్ లో సెంచరీకి!
టీమ్ ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా దేశవాళీ క్రికెట్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు.;
టీమ్ ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా దేశవాళీ క్రికెట్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఇటీవలి టి20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో దుమ్మురేపిన పాండ్యా.. ఇప్పుడు వన్డే ఫార్మాట్ లో జరిగే విజయ్ హజారే టోర్నీలోనూ అదరగొడుతున్నాడు. బంతిని బలంగా బాదుతూ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. హార్దిక్ ధాటికి బౌలర్ల్ గణాంకాలే కాదు మ్యాచ్ స్కోర్లు మారిపోతున్నాయి. శనివారం రాజ్ కోట్ లో విదర్భతో జరిగిన మ్యాచ్ లో బరోడా తరఫున పాండ్యా సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. అతడు 92 బంతుల్లోనే 133 పరుగులు చేశాడు. ఇందులో 8 ఫోర్లు, 11 సిక్స్ లు ఉండడం విశేషం. మొత్తం సిక్సులలో ఐదింటిని కేవలం ఒక ఓవర్ లోనే కొట్టాడు. 68 బంతుల్లో సెంచరీ చేసిన హార్దిక్.. లిస్ట్ ఏ క్రికెట్ లో తొలిసారి మూడంకెల స్కోరును అందుకున్నాడు.
హార్దిక్ 133.. బరోడా 293
బరోడా ఇన్నింగ్స్ లో పాండ్యా తప్ప మిగతా ఎవరూ 30 దాటలేదు. కానీ, హార్దిక్ ధాటికి ఆ జట్టు 293 పరుగులు చేసింది. అంతేకాదు.. హార్దిక్ 60 ల నుంచి సెంచరీకి ఒకే ఓవర్ లో చేరుకున్నాడు. గత ఏడాది మార్చిలో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ తర్వాత హార్దిక్ 50 ఓవర్ల ఫార్మాట్లో తొలిసారిగా బరిలో దిగాడు. కానీ, ఆ ప్రభావం ఏమీలేకుండా తుఫాన్ ఇన్నింగ్స్ తో సత్తాచాటాడు. వాస్తవానికి 19.1 ఓవర్లకు బరోడా స్కోరు 71/5. అప్పుడు బ్యాటింగ్ కు దిగిన పాండ్యా.. 293 పరుగుల వద్దకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో 39వ ఓవర్లో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ పార్థ్ రేఖడే బౌలింగ్ లో చుక్కలు చూపాడు. ఈ ఓవర్ తొలి బంతి సమయానికి పాండ్యా స్కోరు 66 మాత్రమే. కానీ, వరుసగా ఐదు సిక్స్ లతో 96కు చేరుకున్నాడు. చివరి బంతిని బౌండరీకి తరలించి సెంచరీ పూర్తి చేశాడు. మొత్తం 34 పరుగులు ఒకే ఓవర్ లో రాబట్టాడు.
కొసమెరుపుః 32 వ ఓవర్ నాలుగో బంతికి పార్థ్ రేఖడే బౌలింగ్ లో పాండ్యా ఇచ్చిన క్యాచ్ ను లాంగాన్ లో యష్ రాథోడ్ జారవిడిచాడు. దీన్ని సద్వినియోగం చేసుకున్న పాండ్యా అదే పార్థ్ బౌలింగ్ ను ఊచకోత కోశాడు. కాగా, విజయ్ హజారే ట్రోఫీలో త్రిపురతో జరిగిన మ్యాచ్ లో కర్ణాటక బ్యాటర్ దేవదత్ పడిక్కల్ సెంచరీ (108) చేశాడు. గత 9 ఇన్నింగ్స్ లో అతడికి ఇది ఐదో సెంచరీ కావడం విశేషం. విజయ్ హజారేలో గత 5 ఇన్సింగ్స్ లో 4వ సెంచరీ.