ఆసియా కప్.. ఆడేది లేదు పో.. తేల్చిచెప్పిన బీసీసీఐ
క్రికెట్ ఆడేది ఎక్కువగా ఆసియా దేశాలే. అంటే భారత్, పాక్, బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గానిస్థాన్. ఇటీవలి కాలంలో అఫ్ఘాన్ బాగా పుంజుకొన్న సంగతి తెలిసిందే.;
కొన్నాళ్ల కిందట హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ ఏకంగా ఆరు వికెట్లు తీసి శ్రీలంకను 50 పరుగులకే ఆలౌట్ చేసిన మ్యాచ్ గుర్తుందా? అదేమి టోర్నీనో తెలుసా?
భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యం మరో క్రికెట్ టోర్నీపై పడింది.. ఈ ఏడాది మార్చిలో చాంపియన్స్ ట్రోఫీకి వెళ్లేది లేదని బీసీసీఐ తేల్చి చెప్పడంతో తటస్థ వేదిక దుబాయ్ లో మ్యాచ్ లు ఆడింది టీమ్ ఇండియా. ఇప్పుడు మరో పెద్ద టోర్నీని బీసీసీఐ ఏకంగా బాయ్ కాట్ చేసింది.
క్రికెట్ ఆడేది ఎక్కువగా ఆసియా దేశాలే. అంటే భారత్, పాక్, బంగ్లాదేశ్, శ్రీలంక, అఫ్గానిస్థాన్. ఇటీవలి కాలంలో అఫ్ఘాన్ బాగా పుంజుకొన్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా వంటి జట్లకే షాక్ ఇస్తోంది అఫ్ఘాన్. దీంతో ఆసియాలో క్రికెట్ బాగా బలపడింది.
ఈ జట్ల మధ్య నిర్వహణకు తలపెట్టిందే ఆసియా కప్.
పర్యటకులపై పెహల్గాంలో ఉగ్రదాడి అనంతరం పాక్ పై భారత్ ప్రతీకార చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఉద్రిక్తతల రీత్యా క్రికెట్ సంబంధాలు తెంచుకోవాలనే డిమాండ్లు వచ్చాయి.
భవిష్యత్ లో ఐసీసీ టోర్నీల్లోనూ పాకిస్థాన్ తో లీగ్ దశలో ఆడొద్దనే నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. తాజాగా ఆసియా కప్ నుంచి వైదొలగాలని భావిస్తోందని కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయంలో ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ)కి తెలిపిందట.
ఆసియా కప్ సెప్టెంబరులో జరగాల్సి ఉంది. దీంతోపాటు జూన్‌లో మహిళల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ నుంచి కూడా భారత్ వైదొలగనుందట.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి ప్రస్తుతం భారతీయుడైన జై షా చైర్మన్ కాగా, ఆసియా క్రికెట్ మండలికి పాకిస్థాన్ మంత్రి, పీసీబీ చైర్మన్ మోసిన్ నఖ్వీ అధ్యక్షుడు. పాకిస్థాన్ ప్రభుత్వంలో భాగమైన వ్యక్తి ఆధ్వర్యంలోని క్రికెట్ మండలి నిర్వహించే టోర్నీల్లో టీమ్ ఇండియా ఆడకూడదనేది అసలు ఉద్దేశం.
పాక్ ను క్రికెట్ లో ఏకాకిని చేయాలనేది భారత నిర్ణయంగా తెలుస్తోంది. ఈవెంట్ల స్పాన్సర్లలో అత్యధికం భారత్ కు చెందినవారివే. ఇక టీమ్ ఇండియా లేకుండా ఆసియా కప్ అంటే.. దివాళానే. కనీసం బ్రాడ్ కాస్టర్లు కూడా రారు. ప్రస్తుతం ఆసియా కప్ ప్రసార హక్కులు సోనీ పిక్చర్స్ నెట్ వర్క్స్ ఇండియా వద్ద ఉన్నాయి. ఎనిమిదేళ్లకు గాను 170 మిలియన్ డాలర్లతో ఒప్పందం చేసుకుందీ సంస్థ. టోర్నీ రద్దయితే డీల్ కూడా రద్దే.
2023లో ఆసియా కప్ నకు పాకిస్థాన్ ఆతిథ్యం ఇచ్చింది. భారత్ ఆ దేశం వెళ్లలేదు. మన మ్యాచ్ లు శ్రీలంకలో నిర్వహించారు.