అమెరికాలో టి20 ప్రపంచ కప్.. 'రెండు' టీం ఇండియాల ఢీ

జూన్ 12న జరగబోయే మ్యాచ్ చూసి మైదానంలో రెండు భారత జట్లు ఉన్నాయేమిటని కంగారు పడొద్దు

Update: 2024-05-04 12:30 GMT

జూన్ 12న జరగబోయే మ్యాచ్ చూసి మైదానంలో రెండు భారత జట్లు ఉన్నాయేమిటని కంగారు పడొద్దు. హెడింగ్ చూసి ఒకే ప్రపంచ కప్ నకు రెండు భారత జట్లను పంపుతున్నారా? అనుకోవద్దు.. లేదా బీసీసీఐపై తిరుగుబాటు జరిగి భారత్ నుంచి రెండు జట్లు ప్రపంచకప్ నకు వెళ్లాయా? అని ఊహించుకోవద్దు.. హెడ్డింగ్ సరైనదే.. అందులో తప్పు కూడా ఏమీ లేదు. అసలు విషయం ఏమంటే..?

భూమికి అవతలి వైపు..

క్రికెట్ ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన గేమ్ కావొచ్చు. కానీ, భూమికి అటువైపు ఉన్న ఉత్తర, దక్షిణ అమెరికాల్లొ మరీ పాపులర్ ఏమీ కాదు. దక్షిణ అమెరికాలో అయితే అంతా ఫుట్ బాలే. ఉత్తర అమెరికాలో కొంత నయం. కెనడా వన్డే ప్రపంచ కప్ లలోనూ పాల్గొన్నది. మనం ఎంతో ఇష్టపడే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్)లో మాత్రం ఇప్పుడిప్పుడే ఫేమస్ అవుతోంది. అందులోనూ గత మూడు దశాబ్దాలుగా భారత, ఆసియా సంతతి వారి సంఖ్య పెరగడంతో అమెరికాలోక్రికెట్ ప్రాచుర్యంలోకి వచ్చింది.

15 మందిలో కెప్టెన్ సహా మనవాళ్లు ఏడుగురు

వచ్చే నెల 2 నుంచి అమెరికా, కరీబియన్ దీవులు టి20 ప్రపంచ కప్ నకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇందుకోసం ప్రకటించిన అమెరికా జట్టులో భారత సంతతి ఆటగాళ్లే ఎక్కువగా ఉన్నారు. మొత్తం 15 మందిలో కెప్టెన్ మోనాంక్ పటేల్ సహా ఏడుగురు భారతీయ మూలాలున్నవారే కావడం విశేషం. మోనాంక్ గుజరాత్‌ అండర్‌-19 జట్టుకు ఆడిన వికెట్‌కీపర్‌ బ్యాటర్‌. ఇక 2018-19 రంజీ ట్రోఫీ సీజన్‌ లో అత్యధిక పరుగులు చేసిన మిలింద్‌ కుమార్‌ కూడా అమెరికా జట్టులో దక్కించుకున్నాడు. ఆ సీజన్‌లో సిక్కిం తరఫున 1331 పరుగులు చేసిన మిలింద్‌.. దేశవాళీల్లో దిల్లీ, త్రిపురకూ ఆడాడు. ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ తో పాటు ఆర్సీబీకీ ప్రాతినిథ్యం వహించాడు. ముంబై ఇండియన్స్ కు ఆడిన మాజీ బౌలర్లు హర్మీత్‌ సింగ్‌, సౌరభ్‌ నేత్రావల్కర్‌ కూడా అమెరికా ప్రపంచకప్‌ జట్టుకు ఎంపికయ్యారు.

Read more!

అండర్ 19 ప్రపంచ కప్ విన్నర్ కు చోటులేదు..

2012 అండర్‌-19 ప్రపంచ కప్‌ లో హార్మీత్‌ భారత్ కు ఆడాడు. ఇక 2010 అండర్‌-19 ప్రపంచ కప్‌ లో కేఎల్‌ రాహుల్‌, జైదేవ్‌ ఉనద్కట్, మయాంక్‌ అగర్వాల్ లాంటివారితో సౌరభ్‌ పాల్గొన్నాడు. అయితే, ఆస్ట్రేలియాతో జరిగిన 2012 అండర్‌-19 ప్రపంచ కప్‌ ఫైనల్లో అద్భుత సెంచరీ కొట్టి భారత్‌ ను గెలిపించిన కెప్టెన్‌ ఉన్ముక్త్‌ చంద్‌ కు మాత్రం అమెరికా జట్టులో చోటు లభించలేదు. వాస్తవానికి ఉన్ముక్త్ ను అప్పట్లోనే జాతీయ జట్టులోకి తీసుకోవాలన్న డిమాండ్లు వచ్చాయి. అయితే, అతడు నిలకడ తప్పాడు. రెండేళ్ల కిందట అమెరికాకు వెళ్లిపోయాడు. కాగా, న్యూజిలాండ్‌ మాజీ ఆల్‌రౌండర్‌ కోరె అండర్సన్‌ అమెరికా తరపున ప్రపంచ కప్‌ ఆడబోతున్నాడు.

కాగా, భారత్‌, కెనడా, పాకిస్థాన్‌, ఐర్లాండ్‌, అమెరికా జట్లు ప్రపంచ కప్ గ్రూప్‌- ఎలో ఉన్నాయి.

అమెరికా ప్రపంచ కప్ జట్టు..: మోనాంక్‌ పటేల్‌ (కెప్టెన్‌), ఆరోన్‌ జోన్స్‌, ఆండ్రీస్‌ గౌస్‌, కోరె అండర్సన్‌, అలీ ఖాన్‌, హర్మీత్‌ సింగ్‌, జెస్సీ సింగ్‌, మిలింద్‌ కుమార్‌, నిసర్గ్‌ పటేల్‌, నితీశ్‌ కుమార్‌, కెంజిగె, సౌరభ్‌ నేత్రావల్కర్‌, షాడ్లీ, స్టీవెన్‌ టేలర్‌, షయాన్‌ జహంగీర్‌.

Tags:    

Similar News