ఆ సర్వే ధైర్యం ఇచ్చిందా...?

Update: 2022-01-21 11:30 GMT
జాతీయ స్థాయిలో సర్వే అంటూ ఒకటి లేటెస్ట్ గా వచ్చింది. మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో సీ ఓటర్-ఇండియా టు డే సంస్ధలు చేసిన సర్వేలో ఏపీలో వైసీపీకి ఎదురులేదు అన్న ఫలితం అయితే వచ్చింది. జగన్ ఇమేజ్ ఎక్కడా చెక్కుచెదరలేదని, ఎన్నికలు ఇప్పటికిపుడు వస్తే మళ్ళీ ఏపీకి జగనే సీఎం అని కూడా ఆ సర్వే తేల్చింది. దాంతో ఒక రకంగా ఏపీలో క్రూషియల్ సిట్యువేషన్ లో ఉన్న వైసీపీ రాజకీయానికి ఈ సర్వే చల్లని మాట వినిపించింది అంటున్నారు.

ఏపీలో వైసీపీకి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉందని, ఈ రోజు ఎన్నిక జరిగినా జగన్ ఓడిపోతాడని చంద్రబాబు ప్రతీ రోజూ పార్టీ క్యాడర్ తో టెలికాన్ఫరెన్స్ లో చెబుతూ వస్తున్నారు. మరో వైపు సమస్యలు కూడా అలాగే ఏ రోజుకు ఆ రోజు  పెరిగి పెద్దవి అయిపోతున్నాయి. ఇక ఏపీలో అతి పెద్ద సెక్షన్ అయిన ఉద్యోగులు అయితే సర్కార్ తీరు మీద గుర్రుమంటున్నారు. వారు ఏకంగా సమ్మె బాటనే పడుతున్నారు. వారి వెనకాల బాసటగా  విపక్షాలు ఉన్నాయి.

ఇంకో వైపు రెబెల్ ఎంపీ రఘురామక్రిష్ణం రాజు రోజుకో ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ సర్కార్ మీద గట్టిగా సౌండ్ చేస్తున్నారు. రాజీనామా చేసి వస్తున్నాను, నర్సాపురంలో కాచుకోండి అంటున్నారు. ఇలా ఏపీలో వైసీపీ ఇపుడు చాలా రకాలుగా చిక్కుల్లో ఉందనే చెప్పాలి. ఈ టైమ్ లో వచ్చిన సర్వే మోడీకి, బీజేపీకి ఎలా ఉందో కానీ ఏపీకి జగన్ కి మాత్రం చాలా కూల్ గా హాయిగా ఉందనే అంటున్నారు.

నిజానికి పెద్ద ఎత్తున సంక్షేమ పధకాలను లక్షల కోట్లను వెచ్చించి మరీ పందేరం చేస్తున్నందున అంతా తనకు అనుకూలంగానే ఉంటుందని జగన్ గట్టి నమ్మకంతోనే ఉన్నారు. గత ఏడాది జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా వైసీపీ ఏకపక్షంగా గెలవడం సైతం ధీమాను రెట్టింపు చేసింది.

ఆయితే ఆ జోష్ ఊపూ అలా ఉండగానే వరసబెట్టి అనేక కీలకమైన  రాజకీయ పరిణామాలు చోటు చేసుకోవడంతో  ప్రజలలో వైసీపీ సర్కార్ మీద వ్యతిరేకత ఏమైనా ఎంతో కొంత ఉందా అన్న చింత అయితే వైసీపీ పెద్దలలో ఉందని అంటున్నారు. ఇపుడు దాన్ని కూడా బేఫికర్ చేసేలా సర్వే సరైన టైమ్ లో వచ్చింది అంటున్నారు.

ఒక విధంగా తాను తీసుకునే ఏ నిర్ణయం అయినా వెనక్కి తీసుకునే అలవాటు అయితే జగన్ కి లేదనే అంటారు. ఏపీలో కొత్త పీయార్సీ విషయంలో కూడా జగన్ అలాగే ఉన్నారు. అయితే పరిస్థితి కొంత మారుతోంది అంటే ఏమైనా పునరాలోచించేవారేమో. కానీ ఇపుడు వచ్చిన ఈ సర్వేతో ఆ ఆశలు కూడా ఉద్యోగ వర్గాలకు లేవనే అంటున్నారు.

తనకు జనాల మద్దతు పూర్తి స్థాయిలో ఉందని భావిస్తున్న జగన్ అసలు తగ్గరని కూడా చెబుతున్నారు. మరి ఈ టైమ్ లో సర్వే రావడం ఒక విధంగా ఉద్యోగ వర్గాల పోరాటానికి దెబ్బగానే చూస్తున్నారు. ఎటూ ప్రకటించిన మేరకు సమ్మెలోకి వెళ్తారు. మరి ఆ తరువాత కూడా ప్రభుత్వం దిగి రాకపోతే ఏం చేస్తారు అన్నదే చర్చ.

ఏది ఏమైనా కేవలం ఉద్యోగ వర్గాల విషయమే కాదు మరిన్ని కీలకమైన నిర్ణయాలు ఇంకా దూకుడుగా జగన్ తీసుకోవడానికి ఈ సర్వే ఇచ్చిన బూస్టింగ్ ఉపయోగపడుతుంది అంటున్నారు. ఆ వరసలో మంత్రి వర్గ విస్తరణ వంటివి కూడా ఉండవచ్చు అన్న టాక్ అయితే నడుస్తోంది. మొత్తానికి జగన్ చుట్టూ సమస్యల వలయం అల్లుకుంటున్న ప్రతీ సారి ఎన్నికల్లో విజయాలో లేక  ఇలా సర్వేల ఫలితాలో వచ్చి ఆయన్ని మరింత దూకుడు తో సాగేలా చేస్తున్నాయని వైసీపీ లోపలా బయటా కూడా టాక్ నడుస్తోంది.
Tags:    

Similar News