పోరాటానికి కూడా వైకాపా జీవితకాలం లేటే!

Update: 2015-09-13 06:24 GMT
ఏదో నాంకేవాస్తేగా రాజకీయాల్లో తాము కూడా ఉన్నాం అంటూ.. అస్తిత్వాన్ని చాటుకోవడానికి ప్రయత్నించే పార్టీలు ఎంత లేటు చేసినా పరవాలేదు గానీ.. ప్రభుత్వం పై పోరాడే విషయంలో.. అధికారాన్ని కోరుకునే పార్టీలు ఎంత దూకుడుగా ఉండాలి? ఎంత స్పీడుగా ఉండాలి? ఏ చిన్న అవకాశం వచ్చినా చెలరేగిపోతూ ఉండాలి. అధికారపక్షాన్ని ఇరుకునపెట్టడానికి అన్ని దారులనూ వినియోగించుకోవాలి? కానీ ఏపీలో వచ్చే ఎన్నికల నాటికి తామే గద్దె ఎక్కాలని ఆశపడుతున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఇలా అవకాశాలను వాడుకోవడానికి కూడా అలసత్వం ప్రదర్శిస్తోంది. ప్రభుత్వం పోరాడడంలో కూడా జీవితకాలం లేటు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తాజాగా ప్రభుత్వానికి వ్యతిరకంగా కొన్ని కరపత్రాలను ముద్రించింది. 'చంద్రబాబు చెప్పిందేమిటి? చేస్తున్నదేమిటి? ముఖ్యమంత్రిని మంత్రులను ప్రశ్నిద్దాం? నిలదీద్దాం?' అనే నినాదంతో ఈ కరపత్రాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలనేది పార్టీ వ్యూహం. తెదేపా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను, అధికారంలో వచ్చిన తర్వాత ఇప్పటిదాకా అసలు పట్టించుకోకుండా ఉన్న వాటి గురించి ఆ కరపత్రాల్లో విపులంగా ప్రచురించారు.

అయితే తమాషా ఏంటంటే.. తెలుగుదేశం పార్టీ విజయయాత్రలను, 'చంద్రన్న యాత్ర' పేరుతో నిర్వహిస్తూ.. 13 రోజుల్లో 13 జిల్లాలు పర్యటించడానికి తిరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ యాత్రలో ముగ్గురు మంత్రులు రాష్ట్రమంతా తిరుగుతున్నారు. వారితో పాటూ స్థానిక మంత్రులు కూడా ఆయా జిల్లాల్లో పాల్గొంటున్నారు. ఇదిలా ఉండగా.. జిల్లాలకు మంత్రులు వచ్చినప్పుడు వారిని ప్రజలు - రైతులు నిలదీసేలా వారికి అవగాహన కల్పించడం లక్ష్యంగా ఈ కరపత్రాలను ప్లాన్‌ చేశారు. దానికి తగ్గట్లుగానే మంత్రులను నిలదీయండి? ప్రశ్నించండి? అని టైటిల్స్‌ కూడా పెట్టారు. అంతా బాగానే ఉంది. కానీ దానిని శనివారం నాడు ఆవిష్కరించారు.

ఐడియా బాగానే ఉంది.. ప్రభుత్వంపై పోరాడడానికి చక్కగానే ఉన్నది గానీ.. ఇలా చంద్రన్న యాత్ర మొదలైపోయిన అయిదు రోజుల తర్వాత ఈ కరపత్రాలు అందుబాటులోకి రావడం ఏంటంటూ.. పార్టీ కార్యకర్తలే అనుకుంటున్నారు. చేసేదేదో యాత్ర ప్రారంభానికి ముందే చేసి ఉంటే.. ఈ పాటికి కొంత మైలేజీ వచ్చేది కదా అనుకుంటున్నారు.
Tags:    

Similar News