బడ్జెట్ సెషన్ - ఢిల్లీకి పవన్

ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ బాధ్యతలు చేపట్టాక ఒకటి రెండు సందర్భాలలో తప్పించి ఢిల్లీకి వెళ్ళింది లేదు అన్నది తెలిసిందే.;

Update: 2026-01-27 18:10 GMT

ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ బాధ్యతలు చేపట్టాక ఒకటి రెండు సందర్భాలలో తప్పించి ఢిల్లీకి వెళ్ళింది లేదు అన్నది తెలిసిందే. ఆయన గడచిన ఇరవై నెలలలో ఏపీలోనే ఉంటూ తన శాఖకు సంబంధించిన వయవహారాలను చూస్తున్నారు. అంతే కాదు ఆయన తన శాఖలలో పట్టుకు ప్రయత్నిస్తూ అందులోనే రాటు తేలుతున్నారు. ఇదిలా ఉంటే మరో వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ తరచూ వెళ్ళి వస్తున్నారు. కేంద్ర మంత్రులతో పెద్దలతో కలిసి రాష్ట్రానికి అవసరమైన నిధుల సాధనకు కృషి చేస్తున్నారు. అయితే ఈసారి ఢిల్లీకి వెళ్ళే పనిలో పవన్ కూడా ఉన్నారని అంటున్నారు.

వరుస భేటీలు :

ఇదిలా ఉంటే కేంద్ర బడ్జెట్ సమావేశాల మధ్యలో ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన ఉంటుందని జనసేన పార్టీ లోక్ సభాపక్ష నేత బాలశౌరి తెలిపారు. పవన్ ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులతో విడిగా సమావేశమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా ఉన్న అమరావతి నిర్మాణానికి అవసరమైన నిధులను కోరుతారని చెప్పారు. అలాగే గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు వీలుగా అదనపు నిధులను కేంద్ర ప్రభుత్వాన్ని పవన్ కోరనున్నట్లుగా బాలశౌరి తెలిపారు.

భారీగా నిధుల కోసం :

పవన్ కి కేంద్ర పెద్దలు అయిన మోడీ అమిత్ షాలతో మంచి సాన్నిహిత్యం ఉంది అని అంటారు. దానిని ఆయన ఈసారి బడ్జెట్ సెషన్ సందర్భంగా వినియోగించుకుంటారు అని అంటున్నారు. రాష్ట్రానికి సంబంధించి ఎక్కువగా నిధులను వివిధ శాఖలకు రాబట్టే విషయంలో పవన్ మార్క్ పర్యటన ఉంటుందని చెబుతున్నారు. అంతే కాదు ఏపీకి నిధుల అవసరం చాలా ఉంది. అభివృద్ధి పెద్ద ఎత్తున జరగాల్సి ఉంది. దాంతో పవన్ ఈసారి నేరుగా ఢిల్లీ పర్యటనకు రాబోతున్నారు అని అంటున్నారు.

జనసేన స్టాండ్ ఇదే :

ఇక తాజాగా ఢిల్లీలో కేంద్ర మంత్రి రాజ్ నాధ్ సింగ్ అధ్యక్షతన నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో జనసేన వివిధ అంశాల మీద తన స్టాండ్ స్పష్టంగా వెల్లడించింది. జనసేన లోక్ సభాపక్ష నేత బాలశౌరి ఈ సమావేశంలో మాట్లాడుతూ ఏపి రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించేలా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. అలాగే యువత డ్రగ్స్ వినియోగంపై తల్లిదండ్రులలో పెద్ద ఎత్తున ఆందోళన ఉందని ఆయన కేంద్రం దృష్టికి తెచ్చారు. అదే విధంగా డ్రగ్స్, సోషల్ మీడియా నియంత్రణ పై కఠిన చట్టాలు రావాలని ఆయన కోరారు. వీటి మీద పార్లమెంట్ లో చర్చ జరపాలని కూడా జనసేన తరఫున ఆయన కోరారు. ఇక యువత డ్రగ్స్ బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని బాలశౌరి సూచించారు.

సోషల్ మీడియా విషయంలో :

అదే విధంగా దేశంలో విచక్షణ లేకుండా విచ్చలవిడిగా సోషల్ మీడియాను వాడటం తీవ్ర పరిణామాలకు దారితీస్తోందని జనసేన ఆందోళన వ్యక్తం చేసింది. సోషల్ మీడియా వినియోగం పై పార్లమెంట్లో చర్చించి ఒక సమగ్రమైన చట్టం చేయాలని కూడా ఆయన కేంద్రాన్ని కోరారు. జల జీవన్ మిషన్ పధకం కింద ఈసారి కేంద్ర బడ్జెట్ లో అన్ని జిల్లాలకు సమృద్ధిగా నిధులను కేటాయించాలని జనసేన కోరింది. ఏపిలో ప్రతి గ్రామానికి తాగునీరు అందించాలన్నదే పవన్ కళ్యాణ్ ముఖ్య ఉద్దేశంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లినట్లుగా బాలశౌరి తెలిపారు. అలాగే ఆక్వా కల్చర్ పై అమెరికా పన్ను ప్రభావం తీవ్రంగా ఉందని అందువల్ల ఈ ప్రధానమైన అంశం మీద పార్లమెంటులో విస్తృతంగా చర్చించి ఆక్వా రైతుల సమస్య పరిష్కారానికి కేంద్రం చర్యలు తీసుకోవాలని జనసేన కోరుతోంది.

Tags:    

Similar News