జమిలి ఎన్నికలకు తెర తీస్తున్న బీజేపీ!

దేశంలో మరో మారు జమిలి ఎన్నికల మీద చర్చ వాడిగా వేడిగా సాగుతోంది. జమిలి ఎన్నికలు అంటే ఒకేసారి పార్లమెంట్ కి అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించడం.;

Update: 2026-01-27 13:19 GMT

దేశంలో మరో మారు జమిలి ఎన్నికల మీద చర్చ వాడిగా వేడిగా సాగుతోంది. జమిలి ఎన్నికలు అంటే ఒకేసారి పార్లమెంట్ కి అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించడం. ఆ విధంగా చేస్తే బీజేపీకి లాభం అని అంటున్నారు. రాజకీయ విశ్లేషణలు చూసుకున్నా బీజేపీకి ఉన్న అవగాహన ఆ పార్టీకి ఎంపీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు చూసుకున్నా జమిలితోనే ఎంతో రాజకీయ ప్రయోజనం చేకూరుతుందని భావిస్తోంది. దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. అలాగే కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఉంటూ అసెంబ్లీలుగా ఉన్నవి ఢిల్లీ, పుదుచ్చేరి, జమ్మూ అండ్ కాశ్మీర్, లడఖ్ ఉన్నాయి.

తరచూ ఎన్నికలు :

ఈ విధంగా చూస్తే 32 సార్లు ఎన్నికలు దేశంలో తలోసారీ జరుగుతున్నాయి. ఇక కేంద్రంలో లోక్ సభకు మరోసారి జరుగుతున్నాయి. దీని వల్ల కలాం, ధనం అన్నీ ఖర్చు అవుతున్నాయి. అలాగే ఎన్నికల కోడ్ రూపంలో పాలన తరచూ ఆగుతూ దేశంలో సక్రమంగా ప్రజలకు సేవలు అందడం లేదు. ఈ నేపధ్యంలోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2014లో అధికారంలోకి రాగానే జమిలి ఎన్నికల గురించే సీరియస్ గా ఆలోచన చేస్తూ వస్తోంది. 2019లో అనుకున్నారు కానీ అది జరగలేదు, 2024లో అనుకున్నా అదీ జరగలేదు, ఇపుడు 2029 లో అయినా జమిలి ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ పట్టుదలగా ఉందని అంటున్నారు.

పాక్షికంగా అయినా :

మొత్తం 28 రాష్ట్రాలు నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాలు లోక్ సభతో కలిపి భారీ స్థాయిలో జమిలి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాకపోవచ్చు, దాంతో వచ్చే లోక్ సభ ఎన్నికలతో కలిపి కనీసం సగానికి సగం రాష్ట్రాలలో అయినా అసెంబ్లీలకు ఎన్నికలు జరిపిస్తే కొంతలో కొంత అయినా కలసి వస్తుందని భావిస్తున్నారు. అంతే కాదు ఖర్చు ఆదా అయి సమయం వృధా కాకుండా ప్రజలకు సక్రమంగా పాలన అందుతుందని కూడా లెక్క వేస్తున్నారు.

ముందస్తుగా తెస్తూ :

ఇక లోక్ సభకు షెడ్యూల్ ప్రకారం చూస్తే ఎన్నికలు 2029 మేలో జరుగుతాయి. కానీ వివిధ రాష్ట్రాలలో ఎన్నికలను కలుపుకుని పోవాలంటే ఆ షెడ్యూల్ ని కాస్తా ముందుకు జరిపి రాష్ట్రాలలో అసెంబ్లీల కాల పరిమితుల గడువులో తేడాలు ఉన్నా వాటిని సర్దుబాటు చేస్తూ 2028లో మినీ జమిలి ఎన్నికలు జరిపించాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోంది అని అంటున్నారు. అదే కనుక జరిగితే ఈ జాబితాలోకి వచ్చే రాష్ట్రాలు ఏమిటి ఉంటాయన్న చర్చ కూడా సాగుతోంది.

ఇవన్నీ కలుపుతూ :

అయితే గత మూడు దశాబ్దాలుగా ఏపీ లోక్ సభతోనే కలిపి ఎన్నికలకు వెళ్తోంది. తెలంగాణాను ఈసారి కలుపుకుంటారని అంటున్నారు. అక్కడ 2028 చివరిలో ఎన్నికలు ఉన్నాయి. అదే విధంగా 2028 మధ్యలో ఎన్నికలు జరిగే కర్ణాటకను కూడా మినీ జమిలీలోకి జత చేస్తారు అని అంటున్నారు. ఇక 2029 అక్టోబర్ దాకా గడువు ఉన్న మహారాష్ట్రను కూడా మినీ జమిలీలోకి తీసుకుని వస్తారు అని అంటున్నారు. ఇక ఢిల్లీ హర్యానాలతో పాటు 2028లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ, చత్తీస్ ఘడ్, మధ్య ప్రదేశ్, మిజోరాం, రాజస్థాన్ లతో కలిపి మినీ జమిలి ఎన్నికలకు బీజేపీ తెర తీయనుంది అని అంటున్నారు. అంటే మొత్తంగా లోక్ సభతో పాటు 14 రాష్ట్రాలకు కలిపి మినీ జమిలి ఎన్నికలు నిర్వహించడం ద్వారా బీజేపీ తన అజెండాలోని సగమైనా పూర్తి చేయాలని చూస్తోంది అని అంటున్నారు.

బడ్జెట్ సెషన్ లోనే :

ఇక బడ్జెట్ సెషన్ లో జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లు పార్లమెంట్ ముందుకు వస్తుందని చెబుతున్నారు 2024 ఎన్నికల కంటే ముందే మాజీ రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ఆధ్వర్యంలో జమిలి ఎన్నికల మీద కమిటీని వేసి నివేదికను కేంద్రం కోరింది. ఆ కమిటీ నివేదిక కేంద్రానికి అందింది. దాని మీద ఇపుడు పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే జమిలి ఎన్నికలకు దేశంలో రంగం సిద్ధం అవుతుందని అంటున్నారు.

Tags:    

Similar News