‘అమరావతి’పై కేంద్రం బిల్లు.. వైసీపీ స్టాండ్ ఇదే..

రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టబోయే చట్టంపై ఎలా స్పందించాలనే విషయమై వైసీపీ ఓ క్లారిటీకి వచ్చింది.;

Update: 2026-01-27 12:35 GMT

రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టబోయే చట్టంపై ఎలా స్పందించాలనే విషయమై వైసీపీ ఓ క్లారిటీకి వచ్చింది. మూడు రాజధానుల అజెండాతో ఇన్నాళ్లు అమరావతిని నిర్లక్ష్యం చేసిందని వైసీపీ విమర్శలు ఎదుర్కొంటోంది. అమరావతిపై తరచూ మాటలు మార్చడం వల్ల రాజకీయంగా ఆ పార్టీ తీవ్రంగా నష్టపోయిందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం పట్టుదలతో రాజధాని అమరావతి బిల్లును పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో ఈ అంశంపై ఇన్నాళ్లు జరిగిన ఉగిసలాటకు ముగింపు పలకడం వైసీపీకి సవాలుగా మారిందని అంటున్నారు. అయితే తాజాగా వైసీపీ పార్టమెంటరీ పార్టీ నాయకుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజధానిపై ఆ పార్టీ ఎదుర్కొంటున్న గందరగోళం నుంచి బయటపడేసేవిగా ఉన్నాయని వ్యాఖ్యానిస్తున్నారు.

రాజధాని అమరావతి విషయంలో వైసీపీకి చాలా క్లారిటీ ఉందని రాజంపేట ఎంపీ, వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. తమ పార్టీ ఎప్పుడూ కూడా అమరావతిని వ్యతిరేకించలేదని వ్యాఖ్యానించారు మిథున్ రెడ్డి. పార్లమెంటులో అమరావతి బిల్లు వస్తే రైతులకు న్యాయం చేయాలని తాము గట్టిగా మాట్లాడతామని తెలిపారు. రాష్ట్రానికి మేలు జరిగే విధంగా పోరాడమని తమ నేత జగన్మోహనరెడ్డి సూచించారని, ఆయన సూచనల మేరకే పార్లమెంటులో పనిచేస్తామన్నారు. గత సమావేశాల్లో కూడా తాము మాట్లాడటం వల్లే రాష్ట్రానికి ఉపాధి హామీ పథకంలో రూ.30 వేల కోట్లు విడుదలయ్యాయని గుర్తు చేశారు.

రాజధానిపై మిథున్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీస్తున్నాయి. రాజధానిపై వైసీపీ భవిష్యత్తు ప్రణాళికలను ఆయన మాటల్లో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. అయితే మిథున్ రెడ్డి వ్యాఖ్యలను లోతుగా పరిశీలిస్తే ఇంకా వైసీపీ అమరావతిపై స్పష్టమైన నిర్ణయం తీసుకోలేని గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటుందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంటులో అమరావతి బిల్లు ప్రవేశపెడితే తాము రైతుల తరఫున పోరాడతామని, రైతు సమస్యలు ముందుగా పరిష్కరించమని అడుగు తామని మిథున్ రెడ్డి చెబుతున్నారు. ఈ మాటలను బట్టి రాష్ట్రానికి అమరావతి ఒక్కటే రాజధానిగా తాము ఆమోదిస్తున్నట్లు ఆయన ఎక్కడా చెప్పలేదని అంటున్నారు.

2019 నుంచి రాజధాని అమరావతిపై వైసీపీ వ్యతిరేకత చూపుతూనే ఉందని అంటున్నారు. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఈ వైఖరిలో మార్పు వస్తుందని ఆశించినా, ఆ దిశగా ఆ పార్టీ మార్పు కనిపించలేదని అంటున్నారు. అయితే ఈ విషయంలో వైసీపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ప్రకటనలు వస్తుండటం కొంత గందరగోళానికి కారణమవుతోందని చెబుతున్నారు. ముఖ్యంగా పార్టీ అధినేత జగన్ రాజధాని అమరావతిలో లక్షల కోట్ల రూపాయలతో నిర్మాణాలను చేపట్టడాన్ని ఇప్పటికీ వ్యతిరేకిస్తున్నారు. ఐదేళ్లు సీఎంగా ఉండగా, ఒక్కసారి కూడా రాష్ట్ర సచివాలయానికి వెళ్లని జగన్.. విశాఖను పరిపాలన రాజధానిగా చేసుకుని పాలన కొనసాగించాలని ఆకాంక్షించారు. అయితే ఆయన ఆలోచనలకు కార్యరూపం ఇవ్వలేకపోయారని విమర్శలు ఎదుర్కొన్నారు. ఇక ఎన్నికల్లో ఓటమి తర్వాత విజయవాడ-గుంటూరు మధ్య నాగార్జున యూనివర్సిటీలో 500 ఎకరాల్లో పరిపాలన భవనాలు నిర్మించి రాజధానిగా ప్రకటిస్తే సరిపోతుంది కదా? అంటూ ప్రశ్నించారు. దీనికి కొనసాగింపుగా సీఎం ఎక్కడ ఉంటే అదే రాజధానిగా ఇటీవల ప్రకటించారు.

రాజ్యాంగంలో రాజధాని అన్న పదమే లేదని చెప్పడం ద్వారా అమరావతికి ప్రాధాన్యం లేదన్నట్లు ఇటీవల జగన్ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. అయితే ఆయన ప్రకటనపై వ్యతిరేకత వచ్చిందన్న కారణంతో పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామచంద్రారెడ్డి కల్పించుకుని తాము రాజధాని అమరావతికి వ్యతిరేకం కాదని క్లారిటీ ఇచ్చారు. ఇక ఇప్పుడు మిథున్ రెడ్డి సైతం ఇదే అర్థం వచ్చేలా మాట్లాడి పార్టీకి నష్టం జరగకుండా చూస్తున్నారని అంటున్నారు. రాజధాని అమరావతిపై చట్టం చేస్తే ఇక భవిష్యత్తులో రాజధాని నగరాన్ని మరో చోటుకు తరలించడం సాధ్యం కాదని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ రాజధాని చట్టాన్ని అడ్డుకునే స్థితిలో లేకపోవడంతో అంగీకరించడం ఒక్కటే మార్గంగా తుది నిర్ణయానికి వచ్చినట్లు ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే వైసీపీ వైఖరిపై ఇంకా స్పష్టత రావాల్సివుందని, రాజధానిగా అమరావతిపై మాజీ ముఖ్యమంత్రి జగన్ అధికారికంగా ప్రకటన చేయాలని టీడీపీ సోషల్ మీడియా డిమాండ్ చేస్తోంది.

Tags:    

Similar News