వైసీపీకి బ్యాడ్ డేస్‌

Update: 2016-01-22 06:57 GMT
వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాలం క‌లిసిరావ‌డం లేదు. ప్ర‌జాప్ర‌తినిధులు వ‌రుస బెట్టి చిక్కుల్లో ప‌డ‌టం ఆ పార్టీని క‌ల‌వ‌ర‌ప‌రుస్తోంది. పార్టీ నేత‌లు, ముఖ్య నాయ‌కుల వరస అరెస్టులతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అయితే ఈ స‌మ‌స్య‌ను ఎదుర్కునేందుకు కొత్త ఎత్తును ఆ పార్టీ సిద్ధం చేసిపెట్టిన‌ట్లు పార్టీ నేత‌లు చెప్తున్నారు.

వైసీపీలో ఫైర్ బ్రాండ్‌ గా పేరొందిన ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీ నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేయడంతో ప్రారంభమైన బ్యాడ్ డేస్ ఆ త‌ర్వాత కూడా కొనసాగాయి. ఎయిర్‌ పోర్ట్ అధికారిపై దాడి కేసులో ఎంపీ మిథున్‌ రెడ్డిని పోలీసులు అరెస్టుచేసిన విషయం తెలిసిందే. సమైక్యాంధ్ర ఉద్యమంలో నమోదు అయిన కేసులో వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి కూడా క‌ట‌క‌టాల పాల‌య్యారు. రహదారుల నిర్మాణం అడ్డుకొన్న కేసులో నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌ రెడ్డిని  అరెస్టు చేయగా ఆయన బెయిల్‌ పై విడుదల అయ్యారు.

ఏపీ ప్ర‌భుత్వం ఉద్దేశ‌పూర్వ‌కంగానే పాతకేసులను తిరగదోస్తుంద‌ని భావిస్తున్న వైసీపీ నాయకత్వం వరసపెట్టి ఆ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేల అరెస్టు వ్యవహారంపై తీవ్రంగా మండిపడుతోంది. అధికార టీడీపీపై ప్రజాక్షేత్రంలోనే తేల్చుకోవాలని సిద్దమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అరెస్టులకు నిరసనగా వైసీపీ శ్రేణులు రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. ఈ పోరాటాలను మరింత ఉధృతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. ఇందుకోసం త్వరలో ఓ ప్రణాళికను రూపొందించాలని ఆ పార్టీ సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. టీడీపీ సర్కార్ తీరును అవకాశం వచ్చిన ప్రతిచోట, ప్రతి వేదికపై జనంలోకి తీసుకెళ్లాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రాథ‌మికంగా నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News