చనిపోయినా తర్వాత నా ఫొటో పెట్టుకునేలా పాలిస్తా

Update: 2019-06-24 07:36 GMT
పాలన విషయంలో అవినీతి విషయంలో ఉపేక్షించేది లేదని.. తాను చనిపోయినా ప్రతీ ఇంట్లో తన ఫొటో పెట్టుకునేలా పాలించాలన్నదే తన తాపత్రయం అని ఏపీ సీఎం జగన్ సంచలన కామెంట్స్ చేశారు.  ఉండవల్లిలోని ప్రజావేదికలో కలెక్టర్ల సదస్సును సీఎం జగన్ నిర్వహించారు. ఇందులో తన పాలన విషయంలో ఎలా ముందుకెళ్లాలన్నది కలెక్టర్లకు జగన్ వివరించాడు. విద్య, వైద్యం, రైతులే తమ ప్రధాన ఎజెండా అని జగన్ కుండబద్దలు కొట్టారు.

జగన్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులంటే ప్రజల్లో గౌరవం, అభిమానం పెరిగేలా పనిచేయాలని సూచించారు. ప్రతీ సోమవారం అధికారులతో ఎలాంటి సమీక్షలు, సమావేశాలు నిర్వహించమని.. అధికారులంతా సోమవారం ప్రజావాణిలో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించాలని సూచించారు. వారానికి ఒక రోజు గ్రామాల్లో రాత్రి బస చేయాలని.. రెండేళ్లలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తామని అన్నారు.

ఎంతటివారైనా సరే అవినీతి, దోపిడీని ఈ ప్రభుత్వం సహించదని స్పష్టం చేశారు. తమ ఎమ్మెల్యేలు చేసినా ఉపేక్షించమని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీలకు పెద్ద పీట వేయాలన్నారు.

వైసీపీకి ఓటేయని వారు.. కుల, మతం, ప్రాంతం ఇలా ఏదీ చూడవద్దని.. అర్హులైన ప్రతీ ఒక్కరికి పథకాలు వర్తింపచేయాలని జగన్ సూచించారు. అందరికీ మేలు చేస్తే వారే తరువాతి ఎన్నికల్లో ఓటేస్తారని జగన్ చెప్పుకొచ్చారు.

ఇక సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు కట్టుకున్న ప్రజావేదిక విషయంలో జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అక్రమంగా కట్టుకున్న ఈ భవనంలో అధికారులందరూ కూర్చున్నారని.. ఇది అవినీతితో అక్రమంగా కట్టించిన భవనం అని జగన్ చెప్పుకొచ్చారు. టెండర్లు లేకుండా రూ.5కోట్లతో ప్రతిపాదించి రూ8 కోట్లతో పూర్తి చేశారని.. 3 కోట్లు ప్రభుత్వ సొమ్మును మింగేశారనిజగన్ ధ్వజమెత్తారు. చట్టాలను తుంగలో తొక్కిన ఈ భవనాన్ని అందరికీ చూపించాలని ఇక్కడ సమావేశం పెట్టినట్టు తెలిపారు. ఎల్లుండి అక్రమంగా నిర్మించిన ఈ భవనాన్ని కూల్చివేస్తున్నట్టు జగన్ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ భవానాలను కూల్చే ప్రక్రియను ప్రజావేదికతోనే ప్రారంభించాలని అధికారులను జగన్ కోరారు. జగన్ ప్రజావేదిక కూల్చివేత నిర్ణయం టీడీపీ వర్గాల్లో కలకలం రేపింది.

   

Tags:    

Similar News