15మందితో జగన్ 8న మంత్రివర్గవిస్తరణ

Update: 2019-05-31 08:14 GMT
జగన్ ప్రమాణ స్వీకారం  చేసిన మరుసటి రోజే పాలనపై దృష్టిసారించారు. జెట్ స్పీడుతో నిర్ణయాలను తీసుకుంటూ రాష్ట్రాన్ని గాడినపెడుతున్నారు. తాజాగా ఏపీ డీజీపీతో సమావేశమయ్యారు జగన్. తాడేపల్లిలోని తన నివాసంలో శాంతిభద్రతలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీతో రాష్ట్రంలో శాంతిని నెలకొల్పేలా చర్యలు చేపట్టాలని.. ఇందుకోసం కీలక స్థానాల్లో ఎస్పీలు, పోలీసు ఉన్నతాధికారుల బదిలీపై చర్చించినట్టు తెలిసింది.

ఏపీ సీఎంగా జగన్ ప్రమాణం చేసిన కొన్ని గంటల్లోనే అధికార యంత్రాంగం ప్రక్షాళన ప్రారంభమైంది. ముందస్తుగానే కసరత్తు చేసి జాబితా తయారు చేసుకున్నట్టుగా వరుసగా జగన్ అధికారులను మార్చేశారు. మొదట చంద్రబాబు హయాంలో ఆయనకు అనుకూలంగా పనిచేసిన సీఎంవో అధికారులను జగన్ సాగనంపారు. తర్వాత డీజీపీ ఆర్పీ ఠాకూర్, ఏసీపీ డీజీ వెంకటేశ్వరరావును కూడా బదిలీ చేశారు. వీరి బదిలీలను వెనువెంటనే అమల్లోకి తెచ్చారు.

పాలనపై దృష్టిపెట్టిన జగన్ పూర్తిగా కొత్త టీంను సిద్ధం చేసుకుంటున్నారు. రేపటిలోగా పలు శాఖల అధికారులు, పలు జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లకు స్థాన చలనం అయ్యే అవకాశాలున్నాయి. ఏప్రిల్ 1 నాటికి ఇక పనులు మొదలు పెట్టని కాంట్రాక్టులను రద్దు చేయాలని జగన్ సూచన మేరకు ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్ని శాఖల అధికారులకు సూచించారు.

ఇక జగన్ మంత్రివర్గ విస్తరణపై ప్రధాన దృష్టిసారించారు.  జూన్ 8న కొత్త కేబినెట్ విస్తరించడానికి అడుగులు వేస్తున్నారు. కేబినెట్ లో 15మందికి అవకాశం కల్పించాలని  జగన్ చూచాయగా నిర్ణయించారని తెలిసింది.

జూన్ 11 నుంచి మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. అందుకే 8న కేబినెట్ విస్తరణకు యోచిస్తున్నారు. ఇందులో 15మంది పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. మరి జగన్ మదిలో ఉన్న ఆ 15మంది మంత్రులు ఎవరనేది ఆసక్తిగా మారింది.

    
    
    

Tags:    

Similar News