తండ్రి వారసత్వాన్ని నిలబెట్టిన జగన్

Update: 2019-06-08 14:16 GMT
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి నాయకత్వంలోని మంత్రివర్గం శనివారం ఏర్పాటైంది. ఐదుగురు ఉప ముఖ్యమంత్రులతో కూడిన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడం వెనుక జగన్‌ ఎంతో కసరత్తు చేశారు. సామాజిక న్యాయం పాటించి మరీ మంత్రులను ఎంపిక చేశారు. మొత్తంగా బీసీల నుంచి ఏడుగురికి, ఎస్సీ సామాజికవర్గం నుంచి ఐగురురికి, ఎస్టీ, మైనారిటీల్లో ఒకరికి, ఓసీలోని పలు సామాజికవర్గాలకు చెందిన పదకొండు మందికి మంత్రులుగా అవకాశం కల్పించారు. ఈ క్రమంలో జగన్ తీసుకున్న ఓ నిర్ణయం దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని గుర్తుకు తెచ్చింది. అప్పట్లో ఆయన తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యం కలిగించింది. ఇప్పుడదే బాటలో జగన్ నడిచారు.

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరితకు ఊహించని అందలం దక్కింది. ఆమెకు హోంశాఖను కేటాయించంతో పాటు ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టారు పార్టీ అధినేత జగన్‌. తన కొలువులో ఉప ముఖ్యమంత్రి పదవిని ఎస్సీ సామాజికవర్గానికి కట్టబెడతానని చెప్పినప్పుడే ఆమెకు అవకాశం దక్కుతుందని ప్రచారం జరిగింది. అయితే, హోం శాఖను కేటాయిస్తారని మాత్రం ఎవరూ ఊహించలేదు. గతంలో రాజశేఖర్ రెడ్డి కూడా మహిళా ఎమ్మెల్యేకు హోం శాఖ కేటాయించిన విషయం తెలిసిందే. 2009 శాసనసభ ఎన్నికలలో మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందిన మాజీ మంత్రి పీ ఇంద్రారెడ్డి సతీమణి సబితకు ఈ శాఖను కేటాయించారు. అప్పట్లో ఇది పెద్ద సంచలనం అయింది. ఇప్పుడదే జగన్ రిపీట్ చేసి క్రెడిట్ దక్కించుకుంటున్నారు.

మేకతోటి సుచరిత రాజశేఖరరెడ్డి హయాంలో ఫిరంగిపురం నుంచి జడ్పీటీసీగా గెలుపొంది రాజకీయాల్లో ఘనమైన ఆరంగేట్రం చేశారు. అప్పట్లోనే ఆమె జడ్పీ ఛైర్మన్‌ పదవిని టార్గెట్‌ గా పెట్టుకొని జడ్పీటీసీ ఎన్నికల బరిలోకి దిగినప్పటికీ ఆ పదవిని వేరేవారికి కట్టబెట్టారు. ఆ తరువాత 2009 ఎన్నికల్లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి.. కొత్తగా ఎస్సీ నియోజకవర్గంగా ఏర్పాటైన ప్రత్తిపాడు నుంచి ఆమెకు కాంగ్రెస్‌ తరుపున పోటీ చేసే అవకాశం కల్పించారు. ఆ ఎన్నికల్లో గెలుపొందిన సుచరిత వైఎస్‌ మరణానంతరం ఆయన తనయుడు జగన్‌ వెంట పయనించి వైసీపీలో చేరారు.

కాంగ్రెస్‌ ద్వారా చేకూరిన ఎమ్మెల్యే పదవిని వదులుకొని 2012 ఉప ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి తిరిగి ఎన్నికల బరిలోకి దిగి విజయం సాధించారు. మళ్ళీ 2014లో కూడా వైసీపీ తరపున అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. అయినప్పటికీ ఆమె అధికార పార్టీ వైపు పక్క చూపులు చూడకుండా నియోజకవర్గాన్నే అంటి పెట్టుకొని ఇటు స్వపక్షంలోనూ, అటు విపక్షంలోనూ వివాద రహితురాలిగా పేరొందారు. తిరిగి ఈ ఎన్నికల్లో పోటీ చేసి హేమాహేమీలైన మాజీ మంత్రులు డొక్కా మాణిక్యవరప్రసాద్‌, రావెల కిశోర్‌ బాబులను ఓడించారు.



Tags:    

Similar News